– మన సైనిక సత్తాను ప్రపంచమంతా గుర్తించింది
– ఉగ్రదాడికి ప్రతీకారంగానే ఉగ్రమూకలపై దాడి
– ప్రతిదాడితో పాక్‌ను ఘోరంగా దెబ్బతీసాం
– లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చలో రాజ్‌నాథ్ సింగ్
న్యూదిల్లీ, జులై 28: పహల్గాం దాడికి ప్రతిగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ భారత్ సత్తాకు నిదర్శనమని, ఇందులో మన వీర జవాన్ల పాత్ర వెలకట్ట లేనిదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో సోమవారం జరిగిన ప్రత్యేక చర్చను రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. పహల్గాంలో ఉగ్రమూక దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతిగా పాక్ ఉగ్రవాద స్థావరాలపై మన సైన్యం వ్యూహాత్మకంగా దాడి చేసి తొమ్మిది ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిందని, వందమందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిందని సభకు తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌కు ముందు భారత సైనికులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, పాక్‌లో సామాన్యులకు ఇబ్బంది లేకుండా దాడులు చేసినట్లు వివరించారు. సిందూర్ అనేది వీరత్యం, శౌర్యానికి ప్రతీక అని అభివర్ణించారు. ఉగ్రవాద శిబిరాలు, వారి మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని వారిని మట్టుబెట్టడమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టామన్నారు. ఆత్మరక్షణ కోసమే సైనిక చర్య తీసుకున్నామని, రెచ్చగొట్టడానికో, విస్తరణవాదంతోనే కాదని స్పష్టం చేశారు. మే 10వ తేదీన సుమారు 1.30 గంటలకు కూడా ఇండియాపై క్షిపణలు, డ్రోన్లు, రాకెట్లు, ఇతర సుదీర్ఘ శ్రేణి ఆయుధాలపై పాక్ దాడులకు తెగబడిరదని చెప్పారు ఎస్-400, ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ పూర్తిగా పాక్ దాడులను విఫలం చేశాయని చెప్పారు. పాకిస్థాన్‌లోని పలు వైమానిక కేంద్రాలపై భారత వాయుసేన భీకరంగా విరుచుకుపడటంతో పాకిస్థాన్ ఓటమిని అంగీకరించి కాల్పుల విరమణ ప్రతిపాదన చేసిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌కు విరామం ఇచ్చేందుకు కేవియట్‌తో ఆమోదించామని తెలిపారు. భవిష్యత్తులో పాక్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా ఆపరేషన్ తిరిగి ప్రారంభిస్తామని హెచ్చరించారు. ముందుగా నిర్ణయించిన రాజకీయ, మిలటరీ లక్ష్యాలు నెరవేరడంతో ఆపరేషన్ సిందూర్‌కు విరామం ఇచ్చిందని, ఒత్తిళ్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామనేది పూర్తిగా అవాస్తవమని వివరించారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పకుండా ఉండేందుకే తాను ప్రయత్నించానన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో ఎన్ని విమానాలు కూలిపోయాయంటూ కొందరు విపక్ష సభ్యులు ప్రశ్నించారని, అయితే ఆ ప్రశ్న మన జాతీయ భావోద్వేగాలను ప్రతిబింబించేదిగా లేదని తాను భావిస్తున్నానన్నారు. ఎన్ని శత్రు విమానాలను కూల్చేశారని మాత్రం విపక్షాలు ప్రశ్నించలేదన్నారు. ఉగ్రవాద శిబిరాలను కూల్చేశారా అని వాళ్లు ప్రశ్నించి ఉన్నా, ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందా అని అడిగినా అందుకు అవునన్నదే తన సమధానమని చెప్పారు. మన సాహస జవాన్లు ఎవరైనా మరణించారా అని అడిగితే లేదన్నదే తన సమాధానమని రాజ్‌నాథ్ అన్నారు. మన సైనికులెవ్వరికీ ఎలాంటి హాని జరగలేదని స్పష్టం చేశారు. రాజ్‌నాథ్ ప్రసంగిస్తున్నంతసేపు అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని గట్టిగా చెబుతున్నామని, ఇలాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు చిన్నచిన్న విషయాలు పట్టించుకోకూడదని అన్నారు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ వినలేదంటూ ఇలాంటి విషయాల్లో ఆచితూచి, ఆలోచించి ప్రశ్నలు అడగాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. ‘1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు విపక్షాలు ఎలాంటి ప్రశ్నలు వేశాయో తెలుసుకోవాలి.. ఆనాడు విపక్షాలు భారత భూభాగం, మన సైనికుల పరిస్థితి గురించి ప్రశ్నించాయి.. మన సైనికుల చర్యను వాజ్‌పేయీ ప్రశంసించారు.. 1999లో శాంతియుత పరిస్థితిని కోరుతూ వాజ్‌పేయీ లాహోర్ యాత్ర చేపట్టారు.. పాకిస్థాన్‌తో భారత్ స్నేహం కోరుకుంటోందని ఆయన చెప్పారు.. స్నేహ హస్తం చాచడమే భారత్ గొప్పతనం.. ఆనాడు వాజ్‌పేయీ తీవ్ర నిర్ణయం తీసుకుంటే పాక్ మర్నాడు సూర్యోదయం చూసేది కాదు.. శాంతి కోరడం భారత్ రక్తంలోనే ఉంది.. యుద్ధాలు కోరుకోం.. ప్రతి విషయాన్ని మానవత్వ కోణంలో ఆలోచిస్తాం.. తుపాకులు పేలితే ఎవరూ మిగలర’ని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ అధికారులు పాల్గొన్నారని, దీన్నిబట్టి వారిని ఆ దేశం ఎలా పెంచి పోషిస్తోందో స్పష్టంగా తెలుస్తోందని, పాకిస్థాన్ చరిత్ర, అక్కడి ఉగ్రవాదం గురించి తెలుసుకుని మాట్లాడా. మనిషి.. నీతినిజాయతీతో బతకాలని తులసీదాస్ దోహాలో చెప్పారు. భారత స్నేహ హస్తాన్ని పాక్ అందుకోలేకపోయింది.. మన దేశ ప్రజలను చంపుతుంటే సైన్యం చూస్తూ ఊరుకోదు.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఆ దేశానికే ఇబ్బందిగా మారుతుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.




