చిన్నకోడూరు రాజీవ్ రైతు భరోసా దీక్షలో డిసిసి ప్రెసిడెంటు నర్సారెడ్డి ఆగ్రహం
కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని కేసీఆర్ ఇద్దరూ రైతుల పాలిట శాపాలుగా మారారనీ, ఈ ఇద్దరికి రైతుల ఉసురు తప్పకుండా తగులుతుందనీ సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్ ఆధ్వర్యంలో జరిగిన రాజీవ్ రైతు భరోసా దీక్షకు డిసిసి ప్రెసిడెంటు తుంకుంట నర్సారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలతో రైతులు అల్లాడిపోతున్నారనీ, రైతులపై చిన్నచూపు చూస్తున్న బిజెపి, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాలు తప్పకుండా తగు శిక్షను అనుభవిస్తారన్నారు.
రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలను తీసుకురావడమే కాకుండా పార్లమెంటు ఉభయ సభల్లో ఈ చట్టాలకు అనుకూలంగా తీర్మానం చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. అదే విధంగా గత 68రోజులుగా ఢిల్లీ కేంద్రంగా రైతులు చేస్తున్న దీక్షను బలవంతంగా భగ్నం చేయించడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల ఎంత వ్యతిరేకంగా పని చేస్తుందో అర్థమవుతుందన్నారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన చట్టాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందనీ, రైతులు చేసే ఏ పోరాటమైనా, ఉద్యమానికైనా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందన్నారు.
రైతులను ఏడిపిస్తున్న మోదీ, కేసీఆర్ సర్కార్లకు రానున్న రోజుల్లో రైతులే తగు గుణ పాఠం చెబుతారనీ డిసిసి ప్రెసిడెంటు నర్సారెడ్డి అన్నారు. ఈ దీక్షలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు లక్కరసు ప్రభాకర్‌వర్మ, దేవులపల్లి యాదగిరి, జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, జిల్లా కిసాన్‌సెల్ అధ్యక్షుడు కొన్యాల బాలకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు తుమ్మల శ్రీనివాస్, సుంచు రమేష్, అజ్జు యాదవ్, అర్జున్, చిరంజీవి, శ్రీనివాస్, కనకరాజు, బాల్‌రాజు, గుర్రం అంజిరెడ్డి, బర్మా రామచంద్రం, రాములు, మార్క సతీష్, అత్తు ఇమామ్, చెలికాని యాదగిరి, మధు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఒక రోజు దీక్షలో కూర్చున్న మిట్టపల్లి గణేష్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులకు డిసిసి ప్రెసిడెంటు తూంకుంట నర్సారెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.