కొరోనా వైరస్ అంటే.. భయపడాల్సిన అవసరం లేదు
ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తే వ్యాధి నిర్మూలన సాధ్యం మిరుదొడ్డి మండలం మాదన్నపేట, దౌల్తాబాద్ మండలం అహ్మద్ నగర్ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు
కొరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తే ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గంలోని మిరుదొడ్డి మండలం మాదన్నపేట, దౌల్తాబాద్ మండలం అహ్మద్ నగర్ గ్రామాలలో శనివారం సాయంత్రం దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డితో కలిసి పర్యటించి ఆ ప్రాంత ప్రజలకు కొరోనా వైరస్ నివారణకు ఎదుర్కోవాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల ఏప్రిల్ 15 వరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటూ తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లొద్దని.. ఎవరి ఇంట్లో వారే ఉన్నట్లయితే మన కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడుకున్న వాళ్లమవుతామని ప్రజలకు పిలుపునిచ్చారు.
గజ్వేల్ పట్టణానికి చెందిన వ్యక్తితో పాటు ములుగు మండలం, అక్కన్నపేట, మద్దూరు, చేర్యాల మండలాలకు చెందిన వ్యక్తులు వెళ్లారని, వారిలో ఒక్కరికీ నెగటివ్ వచ్చిందని, ఆ గజ్వేల్ వ్యక్తి సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్నదని, మార్చి 19న కాచీగూడకు చేరుకున్న గజ్వేల్ వ్యక్తి 19,20 తేదీలలో గజ్వేల్ పట్టణంతో పాటు దౌల్తాబాద్ మండలం గాజులపల్లి, అహ్మద్‌నగర్, మిరుదొడ్డి మండలం వీరారెడ్డిపల్లి మధిర గ్రామమైన మాదన్నపేటకు వెళ్లారని 20న సాయంత్రం నుంచి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారని వివరించారు. జిల్లా కలెక్టర్, సీపీల ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంతో పాటు గాజులపల్లి, మాదన్నపేట, అహ్మద్‌నగర్‌లలో పూర్తిస్థాయిలో వైద్య బృందాలను ఏర్పాటు చేశామని, ఇంటింటా సర్వే చేపడుతున్నామని, ఆయా గ్రామాలలో ప్రజలను పూర్తిస్థాయిలో గృహా నిర్భంధంలోనే నిలుపుతున్నట్లు తెలిపారు. కరోనా పట్ల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వానికి సహాకరిస్తే చాలని ప్రజలకు మంత్రి విన్నవిస్తూ.., కరోనా వైరస్ అంటే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. అధికారుల సూచనలు పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు.
ఎవరికైనా జలుబు దగ్గు లాంటివి ఉంటే వైద్యాధికారులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని తెలిపారు. డిల్లీ మత ప్రార్ధనల్లో సిద్ధిపేట జిల్లా నుంచి ఐదుగురు వెళ్లి వచ్చారని, వారి సమాచారం అధికారుల వద్ద ఉందని, క్వారంటైన్‌లో ఉన్న వీరికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ ఒక్కరోజులో తెలిసేది కాదని, 14 రోజుల తర్వాత తెలుస్తుందని వివరించారు. తెలిసి ఉన్నా చెప్పక పోవడం తప్పు చేసిన వారవుతారని, కరోనా వైరస్ సోకిన వ్యక్తిని కలిసినా, వారితో కరచాలనం చేసినా, వారితో కలిసి మెలసి ఉన్నా అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని ఆ ప్రాంత ప్రజలను కోరారు. మంత్రి వెంట జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, డీఏంహెచ్‌ఓ మనోహర్, ఇతర వైద్యాధికారులు పీటర్, తదితరులు పాల్గొన్నారు.