Take a fresh look at your lifestyle.

పద్యమే ఆయుధంగా ఉద్యమించిన కవి దాశరథి

పద్యాన్ని హృద్యంగా మలిచి ఉద్యమంగా ఉరకలెత్తించిన తెలంగాణ సాహితి శిఖరం దాశరథి కృష్ణమాచార్య పూర్వపు వరంగల్‌ ‌జిల్లా నేటి మహాబూబాబాద్‌ ‌జిల్లాలోని చిన్న గూడూరు లో క్రి.శ 1925 జూలై 25 తేదీన జన్మించారు. తల్లి వెంకటమ్మ తండ్రి వెంకటాచార్య . ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ పట్టాను పొంది, తెలుగు తో పాటు సంస్కృతం, ఆంగ్లము, ఉర్దూ భాషల్లో ను పాండిత్యం సంపాదించాడు. నిజాం నవాబు ఉసిగొల్పిన రక్కసి మూకలైన రజాకార్ల అండతో దొరలు దేశ్‌ ‌ముఖ్‌ ‌లు చేస్తున్న ఆగడాలపై తెలంగాణ ప్రజానీకం తిరుగబడ్డ తీరును కళ్ళారా చూసిన దాశరథి తన అక్షర శరాలను సంధించారు. తాను కూడా ఉద్యమం లో భాగస్వామ్య మై తన అనుభవాలకు అనుభూతులకు కావ్యరూపం ఇచ్చారు.పద్యాన్ని ఆయుధంగా చేసి ప్రజలను ఉద్యమ బాట పట్టించిన కవి దాశరథి. అంగారము నుండి శృంగారం వరకు అల్లుకున్న రచనా సారములో అంతర్లీనంగా ధ్వనించినది ప్రజల ఆకాంక్షలు మాత్రమే.నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల పదఘట్టనలో కుదేలైన తెలంగాణ బతుకు చిత్రాన్ని దృశ్యమానం గా కళ్ళముందు నిలిపిన అక్షర శిల్పి దాశరథి. తెలంగాణ ప్రజా జీవితంలో అలుముకున్న చీకట్లను అగ్నిధార కవితా ఖండికల్లో చీల్చి చెండాడాడు. ఆయన ఎక్కుపెట్టిన అక్షర శరాలకు భీతిల్లిన నిజాం ప్రభుత్వం దాశరథిని నిజామాబాద్‌ ‌జైళ్ళో బంధించింది .

జైలు ఊచలను లెక్కచేయకుండా ‘‘ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలోదింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ అని రాసిన పంక్తులు తెలంగాణ ప్రజల్లో ఉద్యమావేశాన్ని రగుల్కొలిపినాయి.తర తరాల బూజు మా నిజాం రాజు, ముసలి నక్కకు రాజరికం దక్కునే అని ఈసడించినాడు’’.ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో’’ గేయం లో రాజులు,ధనవంతులు చేసిన అకృత్యాలకు పేదప్రజలు బలియైన తీరును ,చరిత్ర లిఖించని అట్టడుగు పొరల్లో దాగిన విషాదాలను ధ్వనింప జేశారు.ప్రాచీనమైన పద్యానికి ఆధునిక భావావేశాన్ని అందంగా సమన్వయ పరిచి అద్భుతమైన కావ్యాల సృష్టి కర్త గా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయాడు.మూగవోణయిన కోటి గళాలను తన కవన శక్తితో కదిలించాడు. తెలంగాణ ప్రజల పోరాట పటిమ,నిజాం పాలన నుండి విముక్తి పొందిన తీరును రుద్రవీణ కావ్యం లో అద్భుతంగా వర్ణించారు.దుర్మార్గుల కబంధ హస్తాలల్లో చిక్కుకున్న తెలంగాణ ప్రజల బతుకుల్లో కొత్త వెలుగులు నిండాయని తెల్పాడు.దాశరథికి ఈనేల మీద మమకారం ,ప్రజల శక్తియుక్తుల అపారమైన విశ్వాసం కలవాడు. అందుకే ఇలా అంటాడు.కోటిమంది నీ బిడ్డలకు కత్తుల నిచ్చి నవాబు తో యుద్ధం చేయడానికి పంపించావు.ఈ నేల ఎంత జిగి బిగి కల్గి యున్నదో కదా! జరుగుబాటు లేనప్పుడు తిరుగుబాటు తప్పదనే సంకేతాన్ని రుద్రవీణ లోని పద్యాల ద్వారా తెలియజేశాడు. సామాన్యప్రజలు నవాబు పై తిరుగబడిన సన్నివేశాన్ని’’తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్‌ ‌కృపాణమ్మున్‌’’ అనగా తెలంగాణ లో గడ్డిపోచ కూడా కత్తిబట్టి ఎదిరించిందని చక్కని ప్రతీకను చూపించాడు.

ఇట్లా నిరంకుశ నిజాం పాలన అంతమయ్యే వరకు మొక్క వోని దీక్ష తో ధిక్కార స్వరం వినిపిస్తూ అక్షరాల తో అగ్నిధార లు కురిపించాడు.సమ సమాజ స్థాపన కై కలలు కన్న సామ్య వాద ఆకాంక్షలను పునర్నవం ఖండకావ్యం లో ఇలా వినిపించాడు.ఉన్నదాన్ని ఉన్నవాళ్ళందరితో పంచుకొని,ఉన్నంతలో కలిసి భోజనం చేయడం సహాజీవనం,ఇది సామ్య వాదం ‘‘ ఈ మాటలు ఈనాటికైనా మనమంతా స్వాగతించి ఆచరణలో చూపిస్తే సమాజం ఎంత మానవీయంగా రూపుదిద్దుకొంటుందో ఆలోచించాలి.దాశరథి కవిగా రచయితగా బహుముఖ ప్రజ్ఞ ను ప్రదర్శించి తనకంటూ ఒక ప్రత్యేకతను నిలబెట్టుకొన్నాడు. అమృతాభిషేకం ఖండకావ్యం లో ఇరుల సోయగాన్ని,ఇంపుగా వర్ణిస్తూ’’ ఇరుల కన్న అందమెచట కానగ రాదు ,ఇరులె సౌఖ్యములకు దరులు సుమ్ము’’ అంటూ అద్భుత భావన శక్తితో ఆత్మ సౌందర్యాన్ని ప్రదర్శించారు . నేనురా తెలంగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత ఎత్తరచినాను. అని ‘‘మహాంధ్రోదయం’’ లో ఎలుగెత్తి చాటాడు. ‘‘తిమిరంతో సమరం’’ ‘‘కవితాపుష్పకం’’ ఆలోచనా లోచనాలు మొదలగు కవితా సంపుటాలు దాశరథిని శిఖర స్థాయిలో నిలబెట్టినవే.

కవిగా దాశరథి రచనా ప్రస్థానం లో సినిమా పాటలు ఆయనలోని మరో పార్శ్వాన్ని చూపించాయి.సినిమా పాటలకు సాహితి గౌరవాన్ని తీసుకొచ్చిన ఘనత దాశరథి ది. ఖుషీ, ఖుషీగా నవ్వుతూ,చలాకి మాటలు రువ్వుతూ,ఏ దివిలో విరిసిన పారిజాతమో,గోదారి గట్టుంది ,మదిలో వీణలు మ్రోగె,ఎన్నొన్నో జన్మల బంధం నీది నాది,లాంటి పాటలు ఇప్పటికి శ్రోతలను అలరిస్తున్నాయి.దాశరథి సాహితి కృషికి 1967 సంవత్సరం లో ఆంధ్రప్రదేశ్‌ ‌సాహిత్య అకాడమీ అవార్డు,1974 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1977నుండి1983ఆగష్టు వరకు ఆంధ్రప్రదేశ్‌ ఆస్థాన కవి గా కొనసాగారు.తెలుగు సాహిత్యం లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్న దాశరథి కృష్ణమాచార్య 1987 నవంబర్‌ 5 ‌వ తేదీన అకస్మాత్తుగా కన్నుమూసి తెలుగు సాహితి లోకాన్ని దుఃఖ సముద్రంలో ముంచారు.ఎలాగు బతకడం వేరు వెలుగుతూ బతకడం వేరు అన్న ఓ కవి మాటల ప్రకారం దాశరథి తాను వెలుగుతూ ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి తన కలాన్ని ఎక్కుపెట్టారు.ప్రశ్నించే గొంతులను నొక్కి వేస్తూ హక్కులు హరించబడుతన్న ప్రస్తుత తరుణంలో దాశరథి చూపిన బాటలో ముందుకు నడవడమే ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళి.
గన్‌ ‌రెడ్డి ఆదిరెడ్డి, 9494789731
(జూలై 22వ తేది దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా)

Leave a Reply