Take a fresh look at your lifestyle.

ముక్కోటితో వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం

  • భారీగా తరలివచ్చి దర్శించుకున్న భక్తులు
  • సింహాచలం, ద్వారకా తిరుమల, అహోబిలంలో ప్రత్యేక పూజలు

విజయవాడ, జనవరి 13 : ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయాల్లో దర్శనాలు జరిగాయి. కరోనా విజృంభణతో పలు ఆలయాల్లో ఆలయ అధికారులు ఆంక్షలను కూడా విధించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం అప్పన్న స్వామిని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాత్‌ ‌కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు దైవం శ్రీవరహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయని అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరిగాయి. భక్తుల దర్శనార్థం వైకుంఠ ద్వారంలో గరుడ వాహనంపై జగదభిరాముడు కొలువు దీరారు. తెల్లవారు జామున 5 గంటల నుంచి సీతారామ లక్ష్మణుల దర్శనం కోసం భక్తజనం పోటెత్తారు. గోవింద నామ స్మరణతో కోదండ రామాలయం మార్మోగింది. భక్తుల సౌకర్యార్థం కోసం అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.

కోవిడ్‌ ‌నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శన భాగ్యం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్తరద్వారం గుండా స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. గోవిందనామ స్మరణలతో శేషాచల కొండ మార్మోగుతోంది. సాధారణ భక్తులు, వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రూ.100, రూ.200, రూ.500 టిక్కెట్లపై ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా నియోజకవర్గంలో ముక్కోటి ఏకాదశి మహా పర్వదినం సందర్భంగా వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భారీ క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ప్లలెపాలెం గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్‌ ‌కుమార్‌ ‌దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశాఖ నగరంలో వైష్ణవ దేవాలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి.. వైభవ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయం, పెందుర్తి వేంకటాద్రి దేవాలయం, శ్రీ భూ నీల సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయం, సింహాచలం శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలను విద్యుత్‌ ‌దీపాలు, ప్రత్యేకమైన పూలతో సుందరంగా అలంకరించారు..

ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారినుంచే నుంచే భక్తులు దేవాలయాలకు చేరుకున్నారు.. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కోవిడ్‌ ‌నేపథ్యంలో దేవాలయంలోకి అనుమతికి మస్కును తప్పనిసరి చేశారు. క్యూలైన్లో ఎక్కడికక్కడ శానిటైజేషన్‌ ‌చేస్తున్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి.. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని అప్పన్న స్వామి ఆలయాన్ని విద్యుత్‌ ‌కాంతులతో ప్రత్యేకమైన పుష్పాలతో అందంగా అలంకరించారు.. భక్తులు తెల్లవారు జాము నుంచే అప్పన్న స్వామి దర్శించుకునేందుకు సింహాచలం కొండ పైకి చేరుకున్నారు.. విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి ఉత్తర ద్వారం ద్వార స్వామివారిని దర్శించుకున్నారు.. కరోనా బారినుండి ప్రజలందరిని రక్షించాలని అప్పన్న స్వామి కోరుకుంటున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలోని నంద్యాలలో సంజీవ నగర్‌ ‌రామాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహించారు.

సంజీవనగర్‌ ‌రామాలయంలో వెంకటేశ్వర స్వామి వారిని కన్యాకుమారి నుండి తెప్పించిన గవ్వలు, శంఖులతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి వారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సంధర్భంగా ఉదయం 4 గంటల నుండి ఆలయం తెరుచుకుంది. ఉత్తర ద్వారం ద్వారా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. కోవిడ్‌ ‌నిబంధనలతో ఆలయ కార్యనిర్వహణ అధికారి భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నారు. శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామిఅమ్మవార్లకు భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనమిస్తుంది. ఆలయ మాడవీధుల్లో రావణ వాహనంపై స్వామిఅమ్మవార్ల ఊరేగింపు సాగుతుంది. ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి.

Leave a Reply