Take a fresh look at your lifestyle.

దండుపాళ్యం ముఠా

‘పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు 2014లో చందగ్రహణం పట్టింది. బిఆర్‌ఎస్‌ ‌నాయకులు దండుపాళ్యం ముఠాలుగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటూ తాజాగా ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో పర్యటిస్తున్న క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ ‌కమిటి రాష్ట్ర అధ్యక్షుడు ఏ. రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శ చేశారు. అంతేకాదు వరంగల్‌ ఈస్ట్, ‌వెస్ట్ ఎంఎల్యేలను బిల్లా, రంగాలుగా పోలుస్తూ, వారి అనుచరులు దండుపాళ్యం ముఠాలాంటి వారంటూ,  వీరంతా భూకబ్జాలు చేస్తున్నారంటూ ఆయన ఘాటైన విమర్శలు చేశారు. అంతటితోనే ఆగకుండా ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని, హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాము రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్రకు ప్రజలనుండి వొస్తున్న ఆదరణను చూసి  జీర్ణించుకోలేక బిఆర్‌ఎస్‌ ‌వర్గాలు దాడులకు పాల్పడుతున్నాయంటూ, యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌జిల్లా ఉపాధ్యక్షుడు తోట పవన్‌పై హనుమకొండ చౌరస్తాలో జరిగిన దాడిని ఊటంకించారు.

ఇది ముమ్మాటికీ వరంగల్‌ ‌పశ్చిమ ఎంఎల్యే ప్రోద్బలంతో జరిగిన దాడిగానే ఆయన పేర్కొన్నారు. వెంటనే పశ్చిమ ఎంఎల్యేపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్‌ ‌చేస్తూ వరంగల్‌ ‌సీపీ రంగనాథ్‌కు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రుల, ఎంఎల్యేలతో వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు పశ్చిమ ఎంఎల్యేను వెంటనే అరెస్టు చేయాలంటూ సీపీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే వారం రోజుల క్రితం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌కూడా దండుపాళ్యం మూఠా అంటూ ఆ పార్టీ వ్యతిరేక రాజకీయ పార్టీలన్నిటినీ మూటగట్టి సంభోదించారు. దాదాపు వారం రోజుల కింద ఆయన దిల్లీ నుండి మీడియాతో మాట్లాడుతూ  రానున్న శాసనసభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌, ఎంఐఎం, ‌కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తాయని, వీటిల్లో బిఆర్‌ఎస్‌ ‌రాష్ట్రాన్ని దోచుకుంటే, మరో పార్టీ దేశాన్నే దోపిడీ చేసిందంటూ ఈ పార్టీలన్నిటినీ కలిపి దండుపాళ్యం ముఠాగా ఆయన పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో తరుచుగా వాడుతున్న ఈ దండుపాళ్యం ముఠా గురించి కొంత్తైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్ణాటక రాష్ట్రం  హోస్‌కోట్‌ ‌తాలూకాలోని ఒక కుగ్రామం దండుపాళ్యం. ఈ గ్రామం నేరాలు చేసే ముఠాలకు నివాసంగా చెబుతారు. హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, దారిదోపిడీలు ఇక్కడి వారి ప్రవృత్తి. విచిత్రమేమంటే వీరంతా తెలుగు మాట్లాడేవారవడం. 1930 నుండి 1940 మద్య ప్రాంతాల్లో సుమారు నాలుగు వందల కుటుంబాలు తెలుగు ప్రాంతం నుండి ఇక్కడికి వలస వెళ్ళినట్లు తెలుస్తున్నది. వీరిలో చాలామంది బందిపోట్లుగా, హంతకులుగా మారినట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు వీరు పదుల సంఖ్యలో హత్యలు చేసి ఉంటారన్న ప్రచారం ఉంది. హత్యగావించబడిన వారిలో సుమారు ముప్పై మంది వరకు మహిళలున్నారని తెలుస్తున్నది. పట్టణాలకు దూరంగా, ఒంటరిగా ఉన్న వారిని గుర్తించి వారిపై దాడిచేసి, అందినకాడికి దోచుకుపోవడం వీరు వృత్తిగా జీవిస్తున్నట్లు తెలుస్తున్నది.

ఇలాంటి ఒక నేరంపైన ఈ గ్యాంగ్‌కు సంబంధించిన అయిదుగురిని పట్టుకున్న సంఘటనకు సంబంధించి కేసు సుమారు పదిహేడేళ్ళపాటు విచారణ జరిగిన అనంతరం వారికి జీవిత ఖైదు విదిస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఇటీవల హైదరాబాద్‌ ‌నగరంలో దండుపాళ్యం ముఠా తరహాలో చెడ్డీ గ్యాంగ్‌  ‌దోపిడీలపై తెలంగాణ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వీరు  దోపిడీకి పాల్పడుతున్నప్పుడు అడ్డుపడ్డ ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా, కిరాతకంగా చంపేస్తారు. నేర వార్తల్లో చోటుచేసుకున్న ఈ దండుపాళ్యం గ్యాంగుపై ఇప్పటికే సినీ చిత్ర పరిశ్రమవారు రెండు చిత్రాలను చిత్రీకరించారు కూడా.

ఇంత దారుణాలకు పాల్పడుతున్న వారితో తమ తోటి రాజకీయ పార్టీలను పోల్చడం ఎంతవరకు సమంజసమని ఆయా పార్టీల నుండి  తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.  కొండా దంపతుల మీద కోపంతో వరంగల్‌ను దండుపాళ్యం మూఠా చెత్తకుప్పగా చేసిందంటూ టిపిసీసీ ప్రసిడెంట్‌  ‌రేవంత్‌రెడ్డి  ఘాటైన విమర్శ చేశారు. ఎంతో ఘన చరిత్రగల వరంగల్‌కు స్థానిక నాయకుల వల్ల గ్రహణం పట్టింది. ప్రపంచానికి మేధావులను అందించిన కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇవ్వాళ నిర్వీర్యమవుతున్నది. యూనివర్సీటీలో నియామకాలు లేకుండా పోయాయి. తెలంగాణ పోరాటంలో ఘనమైన పాత్ర పోషించిన యూనివర్శిటీ విద్యార్ధులకు అధికార పార్టీ ఇచ్చే కానుక ఇదేనా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు.  ప్రజలకు దొంగ హామీలిచ్చి ఏ ఒక్కటి నెరవేర్చని  దండుపాళ్యం (కెసిఆర్‌ ‌సర్కార్‌) ‌మూఠాకు కౌంట్‌ ‌డౌన్‌ ‌స్టార్ట్ అయిందని. త్వరలో ప్రజలే బిఆర్‌ఎస్‌ను తరిమికొడుతారన్నారు.

మండువ రవీందర్‌రావు

Leave a Reply