Take a fresh look at your lifestyle.

‌ప్రతి దళిత కుటుంబానికి ‘దళితబంధు’

  • నాడు చప్పట్లు కొట్టిన వారు నేడు వ్యతిరేకిస్తారా
  • దళితులకు మేలు చేస్తుంటే అడ్డుకుంటారా
  • వారి ఆగ్రహంలో మాడి మసై పోతారు
  • ఈటలకు, బండి సంజయ్‌లకు హరీష్‌ ‌హెచ్చరిక

హూజూరాబాద్‌ ‌నియోజకవర్గంలోని ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు అందుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సోమవారం హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ ‌దళితబంధును ప్రారంభిస్తారని అన్నారు. హుజూరాబాద్‌లో మంత్రి శనివారం మిడియాతో మాట్లాడుతూ దళిత బంధుకు సీఎం కేసీఆర్‌ ‌హుజూరాబాద్‌ను పైలట్‌ ‌ప్రాజెక్ట్‌గా ఎంచుకున్నారని అన్నారు. అర్హులైన 15 మందికి సీఎం స్వయంగా చెక్కులు అందజేస్తారని అన్నారు. హుజూరాబాద్‌ ‌బీజేపీ నేతకు ఆర్థిక మంత్రి హరీశ్‌ ‌రావు అదిరిపోయే పంచ్‌ ఇచ్చారు. నాడు రైతుబంధు ప్రవేశపెడితే చప్పట్లు కొట్టిన చేతులే నేడు దళిత బంధు ప్రారంభిస్తుంటే గుండెలు బాదుకుంటున్నాయని ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. హరీశ్‌ ‌రావు.. దళితబంధుపై ఎవ్వరూ చెప్పుడు మాటలు వినవద్దని సూచించారు. దళితబంధు విషయంలో అపోహలు, అనుమానాలు అక్కర్లేదన్నారు. రైతుబంధు ప్రారంభించినప్పుడు ఇదే బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకులు ఇలాగే మాట్లాడారు. రైతుబంధును కరోనా కాలంలో కూడా అమలు చేశాం. హుజూరాబాద్‌లో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన నాయకులే.. నేడు దళిత బంధు ప్రారంభిస్తామంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారు. ఆ రోజు రైతుబంధు ప్రారంభించినప్పుడు ఇలాంటి అనుమానాలు, అపోహలు సృష్టించారు. హుజూరాబాద్‌లో రైతుబంధు ప్రారంభిస్తే ఒప్పు.. దళితబంధు ప్రారంభిస్తే తప్పు ఎట్ల అయితది.

ఆరోజు ఒప్పయింది.. ఇవాళ కూడా ఒప్పు అయితది కదా. మేలు జరుగుతుందంటే ఆహ్వానిస్తారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ నిరసనలు తెలుపుతున్నారు. అక్కసు వెళ్లగక్కుతున్నారు. కుట్రలు,కుతంత్రాలు, అపోహలు, అనుమానాలు సృష్టించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా ప్రేమ ఉంటే కేంద్రం నుంచి మరో రూ. 10 లక్షలు తెప్పించండి. లేదంటే మాకంటే ఎక్కువ ఇవ్వాలనిపిస్తే రూ.20 లక్షలు ఇవ్వండి. బండి సంజయ్‌ 50 ‌లక్షలు ఇవ్వాలంటున్నారు. రాష్ట్రం 10 లక్షలు ఇస్తుంది కదా. మిగతా 40 లక్షలు కేంద్రం నుంచి తెప్పిస్తే మికు, మి నరేంద్ర మోదీకి పాలాభిషేకం చేస్తాం’ అని హరీశ్‌రావు బీజేపీ నేతల దుమ్ముదులిపారు. దళిత బంధు పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్న బండికి హరీశ్‌ ‌హెచ్చరిక చేశారు. ఈ పథకాన్ని అడ్డుకుంటే దళితుల ఉసురు తగిలి.. ఆ కుట్రల్లో మాడి మాసై పోతారని హెచ్చరించారు. పేదరికాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ క్రమంలోనే దళితులను బాగు చేసేందుకు దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చామన్నారు. హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలో 20 వేల కుటుంబాలకు దళిత బంధు అమలు చేస్తామంటే.. బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఆరునూరైనా సరే అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి దళిత బంధు అందించి తీరుతామన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ దళిత కుటుంబానికి దళితబంధు అందుతుంది. ఈ విషయంలో ఎవరికి ఎటువంటి అనుమానాలు, అపోహలు అవసరం లేదు. కాంగ్రెస్‌, ‌బీజేపీ నేతలు అపోహలు సృష్టిస్తున్నారు. రైతుబంధు విషయంలో కూడా ఇటువంటి అపోహలే సృష్టించారు. ఎన్నికల కోసమే దళిత బంధు అని అంటున్నరు. దళిత ఎంపవర్‌మెంట్‌ ‌పేరుతో ఓ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్‌ ‌ప్రసంగంలో నేనే చెప్పాను. తన నియోజకవర్గ ప్రజలకు మంచి జరుగుతుంటే ఆహ్వానించాలి. కానీ దురదృష్టం ఏంటంటే దళితబంధును వ్యతిరేకిస్తున్నారు. బండి సంజయ్‌ ‌రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తున్నడు. రాష్ట్ర ప్రభుత్వం శక్తి మేరకు రూ.10 లక్షలు అందిస్తున్నాం. మిగతా రూ.40 లక్షలు కేంద్రం నుంచి బండి సంజయ్‌ ఇప్పించాలి.

కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందజేస్తే పాలాభిషేకం చేస్తాం. ప్రభుత్వ చర్యను ఆహ్వానించాల్సిందిపోయి కుట్రలు చేస్తే ఆ కుట్రల్లో మిరే మాడి మసైపోతారని హరీశ్‌ ‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలోని 20 వేల దళిత కుటుంబాలకు వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌ ‌రావు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ‌పైలట్‌ ‌ప్రాజెక్టు కింద ఈ పథకాన్ని అమలు చేసేందుకు రూ. 2 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. తర్వాత ప్రతి గ్రామానికి, మున్సిపల్‌ ‌వార్డుకు ప్రత్యేక అధికారిని నియమించి, సర్పంచ్‌, ఎం‌పీటీసీ, దళితబంధు కో ఆర్డినేటర్‌ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి.. అక్కడే లబ్దిదారులను ఎంపిక చేస్తాం. అత్యంత పారదర్శకంగా ఈ ఎంపిక పక్రియ నిర్వహించి, అందరికీ పథకం వర్తింపజేస్తామన్నారు. ఈ నియోజకవర్గంలోని అర్హుడైన ప్రతీ కుటుంబానికి ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. రాబోయే రోజుల్లో బ్జడెట్‌ ‌పెంచుకుని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తామని మంత్రి హరీశ్‌ ‌రావు స్పష్టం చేశారు.

Leave a Reply