Take a fresh look at your lifestyle.

సీఎం నియోజకవర్గంలో దళితుని ఆత్మహత్య అమానుషం

టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితులు ఐక్యంగా పోరాడాలి : పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో దళితుడిని సీఎం చేస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక వారినే బలి తీసుకుంటున్నారని టీ పీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అంతమయ్యే వరకూ రాష్ట్రంలో దళితులకు న్యాయం జరగదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ‌నియోజకవర్గంలో దళితుడు నర్సింహులు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గురువారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్‌ ‌నియోజకవర్గంలోనే ఇంత దారుణమా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా దళిత, బడుగు, బలహీన వర్గాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ ‌నియోజకవర్గంలోని వేలూరు గ్రామానికి చెందిన నర్సింహులుకు చెందిన 13 గుంటల భూమిని బలవంతంగా రైతు వేదిక నిర్మాణానికి తీసుకుంటున్నారని ఆరోపించారు. దీంతో ఆవేదన చెందిన నర్సింహులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. నర్సింహులు ఆత్మహత్యకు కారకులైన వారందరిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దళితులకు 3 ఎకరాల భూమిని ఉచితంగా ఇస్తానని వాగ్దానం చేసిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు వారి భూమినే లాక్కోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇటీవల భూపాలపల్లి జిల్లా మల్లారంలో దళిత యువకుడు రాజబాబును హత్య చేశారనీ, దీనికి బాధ్యులపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ‌పాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయం దేశంలోని మరే రాష్ట్రంలోనూ జరగడం లేదని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ‌హయాంలో రాష్ట్రంలో ఎస్సీలపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయనీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. గతంలో కేటీఆర్‌ ‌నియోజకవర్గమైన నేరెళ్లలో ఇసుక మాఫియాను అడ్డుకున్న దళిత, బీసీ యువకులను పోలీసులతో థర్డ్ ‌డిగ్రీ చేసి విపరీతంగా కొట్టించి వారిని చిత్రహింసలకు గురి చేశారని గుర్తు చేశారు. తన పొలం నుంచి ఇసుక తీసుకుపోవద్దని అన్నందుకు దళిత యువకుడు నర్సింలు అనే రైతును లారీతో తొక్కించి హత్య చేసిన ఘటన వెనక టీఆర్‌ఎస్‌ ‌పెద్దలు ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టదంలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనీ, బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. దళితులకు కాంగ్రెస్‌ ‌పార్టీ ఎల్లవేళలా అందగా ఉంటుందనీ, వారికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply