Take a fresh look at your lifestyle.

‌ప్రతి దళిత కుటుంబానికి ‘దళిత బంధు’

  • ప్రభుత్వ కాంట్రాక్టుల్లో దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు
  • దళితులకు రక్షణ నిధి(బీమా) పథకంపై విపక్షాల కుట్రలు
  • హుజూరాబాద్‌లో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం అమలు చేస్తామని, దళిత బంధు ప్రభుత్వ పథకం కాదు, ప్రజా ఉద్యమం కావాలని, ప్రభుత్వ ఉద్యోగులకు సైతం చివరి దశలో వర్తింపజేస్తామని, పథకంపై విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. హుజూరాబాద్‌ ‌నియోజకవర్గం లోని శాలపల్లిలో దళిత బంధు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ‌సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడుతూ 2018 మే 10న ఇదే వేదికగా రైతు బంధు ప్రారంభించి దేశానికే ఆదర్శంగా నిలిచామని, దళిత మహా ఉద్యమానికి కరీంనగర్‌ ‌జిల్లా ఇదే స్థలంలో నాంది పలికామన్నారు. రానున్న 4 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందిస్తామని, విపక్షాలు చేస్తున్న ఆరోపణలు మాటలు వినకుండా పూర్తి ప్రణాళిక బద్దంగా పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి అనేక అనుమానాల మధ్య కాళేశ్వరం, మిషన్‌ ‌భగీరథ, రైతు బంధు, రైతు బీమా, 24గంటల ఉచిత విద్యుత్‌ ‌వంటి విజయాలను సాధించామని, దళిత మేధావులు, యువత, విద్యార్థులు దళిత ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని సూచించారు.

విద్యార్థులు దళిత బంధు పధకంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం హుజూరాబాద్‌ ‌నియోజకవర్గం లో 21000 దళిత కుటుంబాలు ఉన్నాయని, అప్పటినుండి ఇప్పటివరకు మరో 1000 కుటుంబాలు అదనంగా ఉన్నా రెండు నెలలో అందరికి దళిత బంధు అందిస్తామన్నారు. 25 సంవత్సరాల క్రితం సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే దళిత చైతన్య జ్యోతి కార్యక్రమం నిర్వహించామని, దళితుల కోసం చిత్తశుద్ధితో ఆలోచనలు చేశామని అన్నారు. హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలో దళిత బందు పథకం భారతదేశంలోని దళిత ఉద్యమానికి పునాది రాయి కావాలని అన్నారు. ప్రభుత్వ పనులు, కాంట్రాక్టులలో దళితులకు రిజర్వేషన్‌ ‌కల్పిస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తానని హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రం లోని 119 నియోజకవర్గంలో దళిత బంధు పధకానికి 1.7 లక్షల కోట్ల ఖర్చు చేస్తామని, దళిత ప్రజానీకం ధనిక ప్రజానీకం కావాలని, దళిత బంధు అందించిన తర్వాత కూడా మిగిలిన వృద్ధాప్య పింఛన్లు వితంతు పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా లాంటి సంక్షేమ పథకాలు యథావిధిగా అమలు అవుతాయని అన్నారు. దళిత బంధు పథకంలో లబ్ధి పొందే దళితులకు ప్రత్యేకంగా నూతనంగా బ్యాంక్‌ ‌ఖాతా తెరిచి ఖాతాలోనే దళిత బంధు మొత్తాన్ని జమ చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని గ్రామ వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులకు 20 వేలకు పైగా ఉన్న ప్రజాప్రతినిధులు దళిత బంధు పథకంలో భాగస్వామ్యం కావాలన్నారు. ప్రతి గ్రామంలో 6, మండలంలో 15, నియోజకవర్గ పరిధిలో 24, జిల్లాలో 24, రాష్ట్రంలో 48 మందితో దళిత బంధు కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు.

దళితులకు రక్షణ నిధి(బీమా)
దళిత బంధు పథకంలో దళితులకు భరోసా కల్పించేలా రక్షణ నిధి ఏర్పాటు చేస్తామని, లబ్ధిదారుల నుంచి10వేలు, ప్రభుత్వం మరో 10 వేల కలిపి రక్షణ నిధి ఏర్పాటు చేస్తామని, దళితులు ఏ కారణం చేత అయినా గాని మరణించినచో వారికి రక్షణ నిధి దోహదపడుతుందని, వారి కుటుంబాలకు రక్షణ కల్పిస్తుందని సిఎం కెసిఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 11 వేల కోట్ల వ్యయంతో యాదవులకు గొర్రెలు పంపిణీ చేశామని అన్నారు. గ్రామాల్లో దళితులు పేదరికంలో ఉంటే మనకు బాధ, సమాజంలో ఒక వర్గం వెనుకబడకూడదని, యావత్తు తెలంగాణ దళిత జాతి అభ్యున్నతికి సహకరించాలన్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ‌హుజూరాబాద్‌ ‌నియోజకవర్గం లోని అన్ని మండలాలకు సంబంధించిన 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించి దళిత బంధు పధకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ఎస్సి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు జ్ఞాపిక అందజేశారు. దళిత బంధు సీఎం కేసీఆర్‌ అనే నినాదాలతో సభా ప్రాంగణం మారు మ్రోగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌ ‌రావు, కేటీఆర్‌, ‌కొప్పుల ఈశ్వర్‌, ‌శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌లతోపటు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జడ్పీటీసీలు, సుమారు లక్షమంది నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply