Take a fresh look at your lifestyle.

దేశంలో మూడు లక్షలు దాటిన రోజువారీ కేసులు

చాప కింది నీరులా కొరోనా వ్యాప్తి
కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ‌కూడా తీవ్ర రూపం
టీకా తీసుకున్న ఆరునెలలపాటు మాత్రమే యాంటీబాడీలు
అధ్యయనంలో గుర్తించిన శాస్త్రవేత్తలు

న్యూ దిల్లీ, జనవరి 20 : దేశంలో కొరోనా వ్యాప్తి చాపకింది నీరులా వ్యాప్తి చెందుతున్నది. కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో భారీగా పాజిటివ్‌ ‌కేసులు నమోదవుతున్న తీరు ఆందోళనకరంగా ఉంది. అయితే కేసుల విషయంలో వాస్తవ సంఖ్య భిన్నంగా ఉంటుంది. దేశంలో కొరోనా థర్డ్ ‌వేవ్‌ ‌విజృంభిస్తుందనడానికి ఇదే రుజువని అంటున్నారు. తాజాగా 24 గంటల్లో రోజూవారి నమోదవుతున్న పాజిటివ్‌ ‌కేసులసంఖ్య 3 లక్షల మార్క్ ‌దాటింది. దేశవ్యాప్తంగా గురువారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో 3,17,532 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు..ఈ మహమ్మారి కారణంగా 491 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ ‌బులెటిన్‌ను విడుదల చేసింది. మరోవైపు పాజిటివిటి రేటు ప్రస్తుతం 16.41 శాతానికి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 19,24,051 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా కొరోనా నుంచి 2,23,990 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో కొరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ‌సైతం అలజడి సృష్టిస్తుంది. రోజురోజుకూ ఒమిక్రాన్‌ ‌కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటివరకు దేశంలో 9,287 ఒమిక్రాన్‌ ‌కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ‌పక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు దేశంలో మొత్తంగా 1,59,67,55,879 మందికి టీకాలు వేసినట్లు కేంద్రం తెలిపింది.

తాజాగా 24 గంటల్లో 73,38,592 టీకా డోసులు వేసినట్లు కేంద్రం తెలిపింది. ఇదిలావుంటే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నమోదైన కొవిడ్‌ ‌కేసుల జాబితాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెలువరించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 43,697 కేసులు వెలుగు చూశాయి. కర్ణాటకలో 40,499 కేసులు నమోదవగా… కేరళ రాష్ట్రంలో 34,199 కేసులు, గుజరాత్‌లో 20,966 కేసులు, తమిళనాడులో 26,981 కేసులు, వెస్ట్ ‌బెంగాల్‌ ‌రాష్ట్రంలో 11,447 కేసులు, దేశ రాజధాని ఢిల్లీలో 13,785 కేసులు, హర్యానాలో 8847 కేసులు, జమ్ము కశ్మీర్‌లో 5818, గోవాలో 3936 కొవిడ్‌ ‌కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సాధారణంగా కొరోనా టీకా తీసుకుంటే శరీరంలో యాంటీబాడీలు పెరుగుతాయి. కానీ టీకా తీసుకోవడం ద్వారా దీర్ఘకాలం పాటు రక్షణ లభించే అవకాశమే లేదని ఏషియన్‌ ‌హెల్త్‌కేర్‌ ‌ఫౌండేషన్‌తో కలిసి ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌గ్యాస్టో ఎంటరాలజీ(ఏఐజీ) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

అయితే టీకా తీసుకున్న ఆరు నెలల్లోనే 30 శాతం మందిలో యాంటీబాడీలు తగ్గిపోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటి మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారిలో యాంటీ బాడీల తగ్గుదల ఎక్కవగా కనిపిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. సర్వేలో మొత్తం 1,636 మంది కార్యకర్తలు పాల్గొనగా వారు రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. వీరిలో 93 శాతం మంది కోవిషీల్డ్, 6.2 ‌శాతం మంది కొవాగ్జిన్‌, 1 ‌శాతం మంది స్పుత్నిక్‌ ‌టీకాలు తీసుకున్నారు. ఆరునెలల అనంతరం వీరిలో ఐజీజీ-ఎస్‌1, ఐజీజీ-ఎస్‌2 ‌యాంటీబాడీలు తగ్గినట్టు గుర్తించారు. 30 శాతం మంది ఆరోగ్య కార్యకర్తల్లో 100 ఏయూ/ఎంఎల్‌ ‌కంటే తక్కువ స్థాయిలో యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు. అంటే వీరికి వైరస్‌ ‌ముప్పు పొంచి ఉన్నట్లే. ఇలాంటి వారు ఆరు నెలల తర్వాత బూస్టర్‌ ‌డోసు తీసుకోవడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. అయితే మిగతావారు కూడా 9 నెలల తర్వాత బూస్టర్‌ ‌డోసు తీసుకోవచ్చని వివరించారు.

Leave a Reply