ఎప్పుడూ కాంగ్రెస్ వాదినేనంటూనే తను పార్టీలో చేరలేదంటూ డిఎస్ ట్విస్ట్
కుమారుడి కోసమే గాంధీభవన్ వెళ్లానని వివరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27 : సీనియర్ రాజకీయ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆదివారం నాడు కాంగ్రెస్ గూటికి చేరిన డీఎస్.. ఒక్కరోజు కూడా గడువక ముందే హస్తం పార్టీకి రాజీనామా చేసేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు డీఎస్ పంపారు. మరోవైపు…ఆయన సతీమణి విజయలక్ష్మి కూడా మరో లేఖను విడుదల చేశారు. మొదట్నుంచీ కాంగ్రెస్ వాది అయిన డీఎస్.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు ధర్మపురి సంజయ్ కూడా టీఆర్‌ఎస్ తీర్థమే పుచ్చుకున్నారు. ధర్మపురి అరవింద్ మాత్రం మొదట్నుంచీ బీజేపీలో ఉంటూ వొస్తున్నారు. ఇలా తండ్రి ఒక పార్టీలో.. కుమారుడు మరో పార్టీలో ఉంటూ వొస్తున్నారు. ఇలా చాలా రోజులు డీఎస్ కుటుంబంలో చేరికల చిచ్చు నడుస్తుంది. ఆ మధ్య రెండు, మూడేళ్ల పాటు డీఎస్ పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన..మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. వాస్తవానికి డీఎస్ చాలా రోజులు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వార్తలు వొస్తూనే ఉన్నాయి. చివరికి డీఎస్ చేరికకు అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా..ఆయన తనయుడు ధర్మపురి సంజయ్ చేరిక ప్రతిపాదనపైన నిజామాబాద్ కాంగ్రెస్ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
దీంతో డీఎస్ చేరిక వాయిదా పడుతూ వొస్తుంది. ఇటీవల అనారోగ్య సమస్యతో హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకున్న డీఎస్.. గాంధీభవన్‌కు వీల్ చెయిర్‌లోనే వొచ్చారు. తన కుమారుడు సంజయ్ రాజకీయ భవిష్యత్తు, తన ఎదుగుదలకు దోహదపడిన కాంగ్రెస్ లోనే చివరి వరకు కొనసాగాలన్న ఆకాంక్షతో పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ థాక్రే, రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీలో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. దీంతో 24 గంటల్లోనే ఏం జరిగిందో అని తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ నడుస్తుంది. అయితే తన కుమారుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిన సందర్భంగా, ఆశీస్సులు అందజేయడానికి గాంధీ భవన్‌కు వెళ్లిన తనకు కండువా కప్పి, తాను కూడా మళ్లీ పార్టీలో చేరినట్లుగా వి•డియాలో ప్రచారం చేయడం జరిగిందని,
అయితే తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే కానీ, ప్రస్తుతం తన వయస్సు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నానని, పార్టీలో తన చేరికకూ, తన కుమారుడు సంజయ్ టికెట్‌కు ముడిపెట్టడం భావ్యం కాదని, కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు, సంప్రదాయాలు, ప్రజామోదం మేరకే పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతుందన్న విషయం మనకు తెలియనిది కాదని, ఆరోగ్య రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్టీలో నేను మళ్లీ చేరానని భావిస్తే తన లేఖను రాజీనామాగా భావించి, ఆమోదించవల్సిందిగా కోరుకుంటున్నానని డీఎస్ తన లేఖలో రాసుకొచ్చారు.