Take a fresh look at your lifestyle.

అధికారం చేతిలో… అక్రమాలు గుప్పిట్లో..

  • చక్రం తిప్పుతున్న సర్కిల్‌ ‌టౌన్‌ ‌ప్లానర్‌ !
  • అ‌క్రమార్జనే ధ్యేయంగా ప్రయత్నాలు
  • అక్రమ నిర్మాణదారుల నుండి లక్షల్లో వసూలు
  • కనీస చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు

అధికారం చేతిలో ఉంది కదా అని, స్థానిక అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్జనలలో మునిగి తేలుతున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని, చందానగర్‌ ‌జీహెచ్‌ఎం‌సీ సర్కిల్‌ టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారి మామూళ్ల మత్తులో కూరుకుపోయారని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయా ప్రాంతాలలో అక్రమ కట్టడాలను చూస్తే అద్దం పట్టినట్లు కనిపిస్తుంది. ఉన్నత అధికారి స్థానంలో ఉండి అక్రమ వసూళ్లకు హద్దూ అదుపు లేకుండా అక్రమాలకు పాల్పడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా ఉందని ఆయా ప్రాంత వాసులలో గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అక్రమ భవన నిర్మాణాల వద్ద లక్షల్లో వసూలు చేయడమే ఆయన ప్రధాన కర్తవ్యం. తాజాగా చందానగర్‌ ‌సర్కిల్‌ ‌పరిధిలోని,  మధీన గూడ, వైశాలి నగర్‌ ‌నందు (ప్లాట్‌ ‌నెంబర్‌ 4-223) ‌మరియు ఖానమేట్‌, ఎన్‌ ‌కన్వెన్షన్‌ ‌తదితర ప్రాంతాలలో, ప్లానింగ్‌ అధికారి సహకారంతోనే అనేక అక్రమ భవన నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం, టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారి సదరు బిల్లింగ్‌ ‌నిర్మాణ దారులతో కుమ్మక్కై కాసులకి కక్కుర్తి పడుతున్నారన్నది బహిరంగ రహస్యం. ఒక్కో విధమైన అపార్ట్‌మెంట్‌కి ఒక్కో విధమైన రేటు కట్టి, కావలసినంత  అక్రమ సొమ్ము  దండుకుంటున్న మహాఘనుడు జిహెచ్‌ఎం‌సి టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారి అని, అందుకోసమే ఇప్పటివరకు ఏ ఒక్క అక్రమ నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకోలేదని ఆ ప్రాంత వాసులకు చర్చనీయాంశమైంది. అక్రమ భవన నిర్మాణాలపై ‘‘నా వాటా ఎంత నీ వాటా ఎంత’’ అనే క్రమంలో సదరు అధికారి ప్రవర్తించే తీరు ఆ ప్రాంత వాసులకు ముక్కున వేలేసుకునేలా ఉంది.

 

అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు ఎన్ని వచ్చాయి ఎన్ని ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారని అడిగితే,  సమాధానం శూన్యం. తనకు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరు ఫిర్యాదుదారులు పాలిట శాపంగా మారింది. ఆయా ప్రాంతాలలో టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారి పుణ్యమా అంటూ, అడుగడుగునా  అక్రమ భవనాలే దర్శనమిస్తున్నాయి. ఇంటి యజమానులు నిబంధనలు గాలికి వదిలి అక్రమ పద్ధతులలో, తమ ఇష్టానుసారంగా బహుళ అంతస్తులు నిర్మిస్తున్న, కాసులకు కక్కుర్తి పడిన టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, అక్రమ పద్ధతిలో జేబులు నింపుకొని అటు వైపు కూడా వెళ్లడం లేదని ఆయా ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి నిర్మాణ అనుమతులు లేకుండా జి ప్లస్‌ ‌ఫైవ్‌ అం‌తకంటే ఎక్కువ అంతస్తులు వేసి, ఎటువంటి సెట్‌ ‌బ్యాక్‌, ‌లేకున్నా కమర్షియల్‌ ‌బిల్లింగ్‌లను ,సెల్లార్‌లతో  నిర్మిస్తూ నిబంధనలను గాలికి వదులుతున్నారు. అక్రమ కట్టడాలను ప్రారంభదశలో అరికట్టాల్సిన అధికారులు మాత్రం ఆమ్యంమ్యాలకు అలవాటు పడి, అక్రమ పద్ధతులను అవలంబించి సొమ్ము చేసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రజాప్రతినిధులను అడ్డుగా పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు సాధారణమే. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, స్థానిక టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారుల అక్రమ పద్ధతులను పక్కనపెట్టి, అక్రమ నిర్మాణదారులపై చర్యలు తీసుకొని, వారి బాధ్యతలు నిస్వార్థంగా నిర్వర్తించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a Reply