- రుణాలకు మళ్లించకుండా ‘రైతు బంధు’ ను రైతుల సేవింగ్ అకౌంట్లలో జమచేయాలి
- ఎస్ఎల్బిసి సమావేశంలో బ్యాంకర్లను కోరిన మంత్రి హరీష్ రావు
- రూ. 1,86,035.60 కోట్ల ఆన్యువల్ క్రెడిట్ ప్లాన్‌కు ఆమోదం
రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు బ్యాంకర్లను కోరారు. సోమవారం బిఆర్కెఆర్ భవన్లో ఎస్ఎల్బిసి 29వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2021-22 సంవత్సరానికి సంబంధించి 1,86,035.60 కోట్లతో ఆన్యువల్ క్రెడిట్ ప్లాన్‌ను ఆమోదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నదని, ఒక వారంలో దాదాపు 61 లక్షల మంది పైగా రైతుల ఖాతాలలో 7360 కోట్లు పైగా జమ చేశామని తెలిపారు. రైతు బంధు ద్వారా ప్రభుత్వం అందించిన సహాయంతో ఇతర రుణాలకు మళ్లించకుండా వారి సేవింగ్ అకౌంట్లలో జమ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారని, బ్యాంకులు ఈ ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
బ్యాంకర్లు పంటరుణాలను సకాలంలో జాప్యం లేకుండా వారికి అందేలా చూడాలని మంత్రి కోరారు. తద్వారా రైతులు ఎరువులు, విత్తనాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తారన్నారు. కోవిడ్ సమయంలో బ్యాంకర్లు తమ సేవలు అందించారని, బ్యాంకింగ్ సిబ్బందికందరికి వ్యాక్సినేషన్‌కు చర్యలు తీసుకున్నామని తెలిపారు. చిన్న చిన్న వ్యాపారస్తులకు మరింత ముద్రా రుణాలను అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్, తృణధాన్యాలు తదితర పంటల సాగును ప్రోత్సహిస్తుందన్నారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని బ్యాంకర్లకు తెలిపారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎస్ఎల్బిసి ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ మిశ్రా, ఆర్బిఐ రీజినల్ డైరెక్టర్ శ్రీమతి నిఖిల, నాబార్డ్ సిజిఎం వై. కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.