Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహం కాదన్న సుప్రీమ్‌

‌ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడం దేశ ద్రోహమని అనలేమని సుప్రీమ్‌ ‌కోర్టు స్పష్టం చేసింది. 2019 ఆగస్టు ఐదవ తేదీన జమ్ము, కాశ్మీర్‌ ‌ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లును వ్యతిరేకించినందుకు మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌నాయకుడు డాక్టర్‌ ‌ఫరూక్‌ అబ్దుల్లాపై దాఖలైన పిటిషన్‌ ‌ను సుప్రీమ్‌ ‌కోర్టు కొట్టివేయడమే కాకుండా, పిటిషనర్‌ ‌కు జరిమానా విధించింది. జమ్ముకాశ్మీర్‌ ‌విభజనను కూడా ఫరూక్‌ అబ్దుల్లా వ్యతిరేకించారు. సరిహద్దులో ఉన్న రాష్ట్రాన్ని విభజిస్తే దాని ప్రభావం పొరుగుదేశాలపై పడుతుందని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, లడఖ్‌ ‌ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం పట్ల చైనా చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించారు. భారత్‌ అం‌తర్భాగమైన కాశ్మీర్‌ ‌లో చోటు చేసుకునే పరిణామాలపై వ్యాఖ్యానించే హక్కు చైనాకు లేదన్నది వాస్తవమే. చైనాని సమర్ధించడం సమంజసం కాదు.అయితే, చైనాను మన దేశంలో గుడ్డిగా సమర్ధించేవారు మన దేశంలో చాలా మంది ఉన్నారు.

చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు కలిగిన పార్టీలూ ఉన్నాయి. 1964లో చైనా దురాక్రమణ సమయంలో కూడా చైనాను సమర్ధించిన పార్టీలు ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీలో ఒక వర్గం మార్క్సిస్టు పార్టీగా ఏర్పడింది అప్పుడే. ఇలాంటి సందర్బాల్లో దేశద్రోహ నేరాన్ని ఆపాదించడాన్ని ప్రజలు ఏమనలేదు.పైగా అప్పట్లో చైనా కమ్యూనిస్టు పార్టీకి మద్దతు పలికిన దేశంలోని నక్సలైట్లు,అతివాద భావాలు కలిగిన వారిని అరెస్టుకూడా చేశారు. ఆ పరిస్థితి వేరు. ఇప్పుడు డాక్టర్‌ ‌ఫరూక్‌ అబ్దుల్లాచేసిన విమర్శలు వేరు. ఫరూక్‌ అబ్దుల్లా కాశ్మీర్‌ ‌లో సీనియర్‌ ‌నాయకుడు, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పని చేశారు. వాజ్‌ ‌పేయి నేతృత్వంలోని ఎన్‌ ‌డిఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. వాజ్‌ ‌పేయి ఆయనను ఎంతో గౌరవించేవారు. కాశ్మీర్‌ ‌లోయలో రెండు ప్రధాన పార్టీలైన నేషనల్‌ ‌కాన్ఫరెన్స్, ‌పీడీపీలలో నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌నే ఆయన విశ్వసించేవారు. అందుకు భిన్నమైన వైఖరిని ప్రస్తుత ప్రధాని మోడీ అనుసరించారు.

అధికారం చేపట్టిన వెంటనే కాశ్మీర్‌ ‌విషయంలో వాజ్‌ ‌పేయి విధానమే తనదని చెప్పిన మోడీ నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌ప్రత్యర్ధి పార్టీ అయిన పీడీపీని సమర్ధించారు.ఈ రెండు కాశ్మీర్‌ ‌లోయలో పట్టున్న పార్టీలే.అయినప్పటికీ, నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌కాస్తం త ఉదార వాదాన్ని కలిగిన పార్టీగా పేరుంది. పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మహ్మద్‌ ‌సయీద్‌ ‌కు వేర్పాటు వాదులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటి సయీద్‌ ‌ని ముఖ్యమంత్రిగా చేయడం కోసం మోడీ వాజ్‌ ‌పేయి విధానానికి తిలోదకాలు ఇచ్చారు. సయీద్‌ ‌కి కరుడుకట్టిన వేర్పాటు వాదులతో సంబంధాలుండేవి. జైలు నుంచి వారిని విడుదల చేయడం కోసం ముఫ్తీ సయీద్‌ ‌తీసుకున్న నిర్ణయాలను బీజేపీ రాష్ట్ర నాయకులు వ్యతిరేకించినా మోడీ లెక్క చేయలేదు. సయీద్‌ ‌మరణించిన తర్వాత ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ కేబినెట్‌ ‌లో బీజేపీ చేరేట్టు ఒత్తిడి తెచ్చిన మోడీ ఫరూక్‌ అబ్దుల్లా వంటి వారిపై దేశ ద్రోహ నేరం కింద కేసులు పెట్టడం, ఏడాది పైగా గృహ నిర్బంధంలో ఉంచడం కొద్దిగా అతిగానే కనిపించింది.

- Advertisement -

నిజానికి ముఫ్తీ హురియత్‌ ‌కాన్పరెన్స్ ‌లో పాకిస్తాన్‌ అనుకూల వర్గమైన జిలానీ నేతృత్వంలోని వర్గంతో సన్నిహితంగా ఉండేవారు.ఆ వర్గానికి చెందిన నాయకులను జైలు నుంచి విడుదల చేశారు. హురియత్‌ ‌కాన్పరెన్స్ ‌లోని మిత వాద వర్గంతో మాజీ ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌ ‌ప్రభుత్వం జరిపిన చర్చలను కొనసాగించకుండా మోడీ నిలిపివేశారు. దీనిపై అంతా ముక్కున వేలు వేసుకున్నారు. మోడీ అతివాద వర్గంతో పొత్తు కుదుర్చుకోవడం దేనికిందికి వస్తుందంటూ ప్రశ్నించిన వారున్నారు. మోడీ ఎవరితోనైనా స్నేహం చేయవచ్చు, సంబంధాలు పెంచుకోవచ్చు. సాక్షాత్తూ చైనా అధ్యక్షుడు జిన్‌ ‌పింగ్‌ ‌ను ఓసారి అహ్మదాబాద్‌ ‌కీ, మరోసారి తమిళనాడులోని మహాబలిపురానికి ఆహ్వానించి ఆతిధ్యం ఇవ్వొచ్చు. మళ్ళీ అదే జిన్‌ ‌పింగ్‌ ‌ని నిలువరించే రీతిలో వ్యాఖ్యలు చేయవచ్చు. ఆయన దేశాధినేత కనుక తప్పులేదు.అదే మాజీ ముఖ్యమంత్రి ఒకరు చైనా వాదాన్ని సమర్ధిస్తూ మాట్లాడటాన్ని దేశద్రోహ నేరంగా పరిగణిస్తారు. లడఖ్‌ ‌విషయంలో చైనా వ్యాఖ్యలను భారతీయులెవరూ సమర్ధించరు.

అటువంటి వ్యాఖ్యలను ఫరూక్‌ అబ్దుల్లా సమర్దించడం తప్పేఅయితే, తాను చైనాను సమర్ధించలేదనీ, లడఖ్‌ ‌ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని మాత్రమే అన్నానని ఫరూక్‌ ‌చెబుతున్నారు.ఒక వేళ ఆయన మనస్ఫూర్తిగా చైనాని సమర్దిస్తే దేశ ప్రజలు ఆయనను క్షమించరు. దేశంలో ఉంటూ దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అందుకు తగిన చర్యగా అరెస్టు చేసి జైళ్ళలో పెడుతున్నారు. ఫరూక్‌ ‌రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. లడఖ్‌ ‌ని జమ్ము, కాశ్మీర్‌ ‌నుంచి విడదీశారన్న ఆక్రోశంతోనే మాట్లాడారు అంతమాత్రాన వారిపై దేశ ద్రోహ నేరం ఆపాదించడం సమంజసం కాదు. వాక్‌ ‌స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న కోణంతో ఫరూక్‌ ‌పై పెట్టిన కేసును సుప్రీమ్‌ ‌కోర్టు కొట్టివేసింది. ఇది ఇలా ఉంచితే దేశంలో దేశంలో మోడీ వ్యతిరేకులంతా దేశద్రోహులేనని కమలనాథులు కొత్త నినాదాన్ని లేవనెత్తుతున్నారు. మోడీ తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తున్న వారిని తీవ్రమైన పరిభాషలో నిందిస్తున్నారు. తాజాగా బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీపై యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్‌ ‌చేసిన వ్యాఖ్యలు నిదర్శనం.

Leave a Reply