Take a fresh look at your lifestyle.

‌రాజకీయ ముసుగులో నేరస్తులు

Criminals in the pursuit of politics

ఒకప్పుడు నేరస్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనుకునేవారు. వారితో జతకడితే సమాజం తమను కూడా నేరస్తుడిగానే ఎక్కడ భావిస్తుందోనని వారి చాయలకు కూడా వెళ్ళేవారు కాదు. కాని, నేరస్తులు రాజకీయ ముసుగులో చలామణి అవుతూ తామూ సంఘ సంస్కర్తలమే నన్నట్లుగా ప్రవర్తిస్తుండడంతో ఇప్పుడు సమాజమే వారికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంచుమించు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి వారికి రాజకీయాశ్రమాన్ని ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఎందుకంటే గత మూడు, నాలుగు ఎన్నికలను పరిశీలిస్తే దాదాపు అన్ని పార్టీల్లోనూ పోటీ చేసే అభ్యర్థుల్లో అనేకులు ఏదో నేరంతో సంబంధం ఉన్నవారేనన్న విషయాన్ని పలు స్వచ్ఛంద సంస్థలు వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలియంది కాదు. భూ అక్రమణలు, అత్యాచారాలు, ఆదాయానికి మించి కోట్లాది మేర అక్రమ ఆస్తులు, ఇతర కుంభకోణాల్లో ఉన్నవారనేకులు అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ ఉన్నత ప్రజాప్రతినిధుల పదవుల్లో కొనసాగుతున్న విషయం తెలియంది కాదు. ఎన్నికలకు ముందు, లేదా ఎన్నికల తంతు పూర్తి అయిన తర్వాత ఏ పార్టీ ఎంతమంది నేరచరిత్ర ఉన్నవారికి టికెట్లు కేటాయించిందన్న విషయాన్ని పలు సంస్థలు వెలుగులోకి తీసుకువచ్చినా వాటిని ఏ పార్టీ కూడా ఏనాడు పట్టించుకున్న దాఖలా లేదు. ఎందుకంటే ఎన్నికకు కావాల్సినంత డబ్బు ఖర్చుపెట్టుకునే స్థోమత వారికే ఉంటుందన్నది ఆయా పార్టీల అభిప్రాయమై ఉంటుంది. పార్టీ చేతికి మట్టి అంటకుండా వ్యయంచేసే వ్యక్తినే అభ్యర్థులుగా ఎంపిక చేయడమన్నది సహజమైపోయింది. అలాంటి పరిస్థితిలో అతని నేరచరిత్రను ఏపార్టీ కూడా పట్టించుకునే పరిస్థితి ఏపార్టీకి దాదాపు లేదనే చెప్పాలె. పూర్వం జరిగే ఎన్నికల్లో వ్యక్తులను చూసి ఎన్నుకునేవారు. కాని, ప్రస్తుత పరిస్థితిలో ఎవరైనాసరే ఎన్నికల్లో గెలవాలంటే డబ్బే ప్రధానమైకూర్చుంది. నేటిఎన్నికల్లో ఎలాంటి మార్పువచ్చిందంటే మొదట్లో వోటుకు యాభై నుండి ఇప్పుడు మూడు నుంచి అయిదు వేలరూపాయల వరకు చేరుకుంది.

ఎవరికి ఎంత చేతనైతే అంత డబ్బు గుమ్మరించడమన్నది సహజమైపోయింది. కేవలం డబ్బు ఒక్కటేనా అంటే అనేక రకాలుగా వోటర్లను ప్రలోభపెడుతున్నారు. మద్యం, బిర్యానీ పొట్లాలు, ఆడవాళ్ళకు చీరలు, బంగారు ముక్కుపుడకలు, వోటర్ల ఖాతాలో నేరుగా డబ్బులువేయటం, యువకుల క్లబ్‌లకు కావాల్సిన క్రికెట్‌ ‌కిట్స్, ఇతర ఆటవస్తువులిచ్చి వారిని తాత్కాలికంగా సంతోషపెట్టడం ద్వారా ఎట్టి పరిస్థితిలోనూ ఎన్నికల్లో విజయం సాధించడమన్నదే లక్ష్యంగా మారింది. దీంతో ఎవరైనా ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునే వారు ఈ టక్కుటమార విద్యలను తట్టుకుని నిలబడలేని పరిస్థితి. అయితే రాజకీయ నాయకులంతా నేర చరిత్ర ఉన్నవారని, అందరూ డబ్బు వెదజల్లి గెలిచినవారనలేము. ఇందులో కొందరు మాత్రం తమ సేవా తత్పరతతో ఎన్నికవుతున్న వారూ లేకపోలేదు. ఇదిలా ఉంటే రాజకీయ అవతారమెత్తిన నేరచరితులకు శిక్షపడడమన్నది కూడా అంత సులభంగా లేదు. తమ రాజకీయ పలుకుబడితో తమపై ఉన్న కేసులు త్వరగా పరిష్కరింపబడకుండా చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని కాలయాపన జరిగేట్లుగా మేనేజ్‌ ‌చేస్తారనేందుకు పలువురు రాజకీయ నాయకులపై దశాబ్దాల తరబడి కొనసాగుతున్న కేసులే ప్రత్యక్ష నిదర్శనం. నేర చరిత్ర తేలకుండానే కేంద్ర మంత్రులుగానో, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులుగానో ఏళ్ళతరబడి అధికారాన్ని అనుభవిస్తూ, పాలకులుగా కొనసాగుతూనే ఉన్నారు. పార్లమెంటు, శాసనసభ సాక్షిగా వివిధ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు అవినీతిపై దుమ్మెత్తి పోసుకుంటున్నా కోర్టు పరిధిలోకి వొచ్చేసరికి అవేవీ నిలవకుండా పోతున్నాయి. ఈ విషయంలో గతంలో కూడా ఒకసారి అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. అయిదేళ్ళ కాలపరిమితిలో ఎంపిలు, ఎంఎల్‌ఏల ఆస్తులు పదింతలు ఎలా పెరుగుతున్నాయంటూ విస్మయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలియందికాదు. ఈ విషయంలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి ఆదాయానికి మించి ఆస్తులున్నవారి కేసులను ప్రత్యేకంగా, సత్వరంగా విచారించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది కూడా.

ప్రతీ అయిదేళ్ళకు ఒకసారి జరిగే ఎన్నికలు ఏవైనప్పటికీ అందులో పోటీ చేస్తున్న లేదా గెలిచిన వారిలో ఉన్న నేరస్థుల వివరాలను కొన్ని సంస్థలు వెల్లడిస్తున్నా ఏ రాజకీయ పార్టీకూడా ఆ విషయంలో పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. దీనిపై మరోసారి ఉన్నత న్యాయస్థానం తాజాగా మరో సూచన చేయడం గమనార్హం. నేర చరిత్రులకు టికెట్లు ఇచ్చి పోటీచేసే అవకాశాన్ని రాజకీయపార్టీలివ్వడంపై సుప్రీమ్‌ ‌కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి టికెట్లు ఇచ్చే విషయంలో ఎందుకు మొగ్గుచూపుతున్నాయన్న విషయాన్ని తమకు వివరించాలని కూడా కోర్టు పేర్కొంది. ఇప్పటికైనా గత నాలుగు సాధారణ ఎన్నికల్లో పోటీచేసిన తమపార్టీకి చెందిన నాయకులపై ఉన్న క్రిమినల్‌ ‌కేసులకు సంబంధించిన వివరాలను ఆయా పార్టీలు తమ పార్టీ అధికార వెబ్‌సైట్‌లో నలభై ఎనిమిది గంటల్లో పొందుపర్చాలని సూచించింది. ఇకముందు కూడా తమ వెబ్‌సైట్‌తోపాటు సోషల్‌ ‌మీడియాలో కూడా ఈ వివరాలను ఉంచాలని, ఇదే జాబితాను ఎన్నికల కమిషన్‌కు డెబ్బై రెండు గంటల్లో అందజేయాలని కూడా సూచించింది. విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి గెలువడం కాదు.. ఆభ్యర్థికున్న మెరిటేమిటన్నదే గెలుపుకు తార్కాణం కావాలని కూడా వ్యాఖ్యానించిన సుప్రీమ్‌ ‌కోర్టు తమ సూచనలను పాటించని పక్షంలో కోర్టు దిక్కారంగా పరిగణించడమవుతుందని హెచ్చరించడం చూస్తుంటే భవిష్యత్‌లో నేరచరిత్రులు పాలకులు కాలేరన్న ఆశ చిగురిస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply