- నియంత్రణకు సలహా కమిటీని ఏర్పాటు చేయండి
- కొరోనా టెస్టు చేయించుకున్న వారినే రాష్ట్రంలోకి అనుమతించండి
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
కోవిడ్ నిబంధలను ఉల్లంఘిస్తున్న వైన్ షాపులు, రెస్టారెంట్లు, పబ్‌ల లైసెన్స్‌లు రద్దు చేసి, వారిపై క్రిమనల్ కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే కొరోనా టెస్టు చేయించుకున్న వారినే రాష్ట్రంలోకి అనుమతించాలని పేర్కొంది. తెలంగాణలో కోవిడ్ నియంత్రణ, పరీక్షలపై గురువారం మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. కొరోనా టెస్టులు, టీకాపై ప్రభుత్వం పూర్తి నివేదికను సమర్పించింది. కొరోనా టీకాను 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వారికి టీకా వెంటనే అందజేయాలని సూచించింది. 22 హాస్పిటళ్లలో ఆక్సిజన్ సిలెండర్లు అందుబాటులో పెట్టామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. కోవిడ్ హాస్పిటళ్లు 54 అని చెప్పి, 22 హాస్పిటళ్లలో మాత్రమే ఆక్సిజన్ సిలెండర్లు పెట్టడం ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది. 54 హాస్పిటళ్లలో ఆక్సిజన్ ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 17 ప్రకారం అడ్వైజర్లు కమిటీలో ప్రైవేటు వ్యక్తుల సలహాలు తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, పెళ్లిళ్లలో సామాజిక దూరంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటన్నింటిపై ఈ నెల 17వ తేదీ లోపు పూర్తి నివేదిక అందించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ ఈనెల 19 తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా టెస్టుల సంఖ్య, టీకా, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ సమర్పించింది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డీజీపీలు కూడా తమ రిపోర్టులను హైకోర్టుకు అందజేశారు. అయితే.. దీనిపై హైకోర్టు స్పందిస్తూ… ఆర్టీపీసీఆర్ టెస్టులు భారీగా పెంచాలని.. సేరో సర్వేలెన్స్ సర్వే రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. లిక్కర్ షాపులు, పబ్స్, క్లబ్స్, సినిమా హాల్స్, ఫంక్షన్ హాల్స్ పై ఆంక్షలు విధించాలని హైకోర్టు తెలిపింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉంటేనే రాష్ట్రంలోకి వచ్చేలా అడ్వైజరీ జారీ చేయాలని.. డిజాస్టర్ యాక్టు ప్రకారం నిపుణులతో అడ్వైజరీ కమిటీ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం చెప్పిన విధంగా 100 మంది ఉన్న కార్యాలయాల్లో వ్యాక్సినేషన్ చేయాలని…. మాస్కులు, సామాజిక దూరంపై నమోదైన కేసులు చాలా తక్కువ అని పేర్కొంది.
కొరోనా ప్రబలకుండా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ కేసులు ఎక్కువ ఉంటే వాటిని మైక్రో కంటైన్మెంట్ జోన్స్ కింద ఎందుకు ప్రకటించలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. తెలంగాణకు వొచ్చే ప్రతి ప్రయాణికుడి నుంచి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్ తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఫంక్షన్ హాల్స్, మ్యారేజ్ హాల్స్ వద్ద ఎక్కువమంది గుమికూడితే అలాంటివారిపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ప్రణాళికలు రూపొందించారో చెప్పాలని ప్రభుతాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. కొరోనా టీకా ఎంత వొచ్చింది? ఎంత వేస్టేజ్ అయిందో చెప్పాలని హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరాలతో మళ్లీ నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది.