ఒక్క గునపం పోటు
బిర్రుగా తలెత్తుకు నిలబడ్డ
కోట గోడల బీటలుబారుస్తుంది
ఒక్క నిప్పు రవ్వ
దావానళంలా వ్యాపించి
కారడవిని బూడిద చేస్తుంది
ఒక్క బాణం పుల్ల
విర్రవీగిన కొదమ సింహాన్ని
నిలువునా ప్రాణాలు తీస్తుంది
ఒక్క చిన్న గింజ
నేలను చీల్చి పుట్టుకొస్తుంది
ఒక్క చిట్టి పిట్ట పాట
మహా ప్రభంజనం సృష్టిస్తోంది
ఒక్క మాట తూటలా పేలి
సామ్రాజ్యాలనే కూలదోస్తుంది
ఇక్కడ
బలహీనమైనవి ఏవి లేవు
సుప్త చేతనలో ఉండబోవు
అవసరమైన సమయంలోన
తమ ప్రతాపం చూపుతాయి
ఆస్తిత్వం భేషుగ్గా చాటుతాయి
ఓయి దురహంకారి !
బలవంతున్నని మురిసి
బడుగు బలహీనుల మీద
పెత్తనం చేలాయిస్తానంటే
ఏదో ఓరోజు పీడిత వర్గాలేకమై
తిరుగుబాటుకు తెగబడతాయ్
ఆధిపత్యానికి సామాది కట్టి
సరికొత్త చరిత్రను లిఖిస్తాయ్
– కోడిగూటి తిరుపతి, 9573929493