ఓ మనిషీ !
ఇకనైనా నిజం తెలుసుకో!
ఈ కంప్యూటర్
యుగంలోనైనా కళ్ళు తెరుచుకో!
గ్రద్దను చూసి ఎగరడం…
కాకిని చూసి కష్టపడడం…
పామును చూసి ప్రాకడం…
చీమను చూసి జాగ్రత్తపడడం…
నేర్చుకో…బ్రతుకును మార్చుకో…
ఐతే కాకిలా బ్రతకడం కన్నా
హంసలా బ్రతకడం మిన్న
అన్నది నిన్నటి మాట, కానీ
ఈ కంప్యూటర్ యుగంలో మనిషి
హాయిగా బ్రతకలేడు హంసలా…
కష్టపడక తప్పదు కలకాలం కాకిలా…
పాపం అదిగో ఆ నల్లనికాకికి…
కోకిలమ్మలా
కమ్మగా పాడడం తెలియదు
కానీ సూర్యుని
కంటే ముందేలేవడం తెలుసు
సుప్రభాతం పాడడం తెలుసు
కుంభకర్ణుల్లా కునుకు తీసేవారిని
నిర్దయగా నిద్రలేపడం తెలుసు
పాపం ఆ నల్లని కాకికి…
తెల్లనికొంగలా దొంగజపం చేస్తూ
చెరువు గట్టున చేరి
చేపలను తినడం తెలియదు
కానీ ఎర్రనిఎండలో ఎగరడం తెలుసు
జోరువానలో తడవడం తెలుసు
కర్రపుల్లలతో చెట్టుకొమ్మల్లో
గుట్టుగా గూడు కట్టుకోవడం తెలుసు
కష్టపడి కడుపు నింపుకోవడం తెలుసు
పాపం ఆ పిచ్చికాకికి బావిలో కప్పలా
హాయిగా… బ్రతకడం తెలియదు
కానీ పిల్లల తిండికోసం…. ఆకాశంలో
పిచ్చిగా తిరగడం తెలుసు…నేలమీది
మనిషికి పాఠాలు… నేర్పడం తెలుసు
అంటే
కష్టించి శ్రమచేయడం…
స్వేచ్ఛగా విహరించడం…
స్వతంత్రంగా జీవించడం…
ముప్పును పసిగట్టి ముందస్తు
హెచ్చరికలు చేయడం తెలుసు
ఔనుఈ కంప్యూటర్ యుగంలో సైతం
ఆకాకి అరుస్తూనే ఉంది… ‘‘……కావుకావు’’ మని
దానికర్థం….
చింతిస్తూ కూర్చుంటే చీకట్లు… ‘‘పోవుపోవు’’ అని
సోమరిపోతులకు సుఖాలు….. ‘‘రావురావు’’ అని
శ్రమజీవులు ఎక్కలేని శిఖరాలు.’’లేవులేవు’’ అని’’
అందుకే పాలను నీరును
వేరుచేసే ఆ హంసకన్నా….
కష్టేఫలి అనే ఆ కాకి కన్నా….
గొడ్డుచాకిరీ చేసే ఈ మనిషే మిన్న…
– రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
హైదరాబాద్……9110784502