“మతతత్వ వాదానికీ, లౌకిక వాదానికీ మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నపటికీ, గత ఏడేళ్లుగా వెనకబడ్డ వర్గాల ప్రజలు హిందూత్వ నుండి దూరం కావటానికి సమాజంలో తమ వాటా పొందటంలో వెనుకబడ్డామని క్రమంగా గ్రహిస్తుండటమే కారణం. సామాజిక న్యాయం తమకు దక్కటం లేదనీ, పరిపాలనలో, ఉద్యోగాలలో కూడా తమ వాటా తమకు దక్కకుండా పోతున్నదన్న విషయాన్ని వారు గ్రహించారు.”
త్వరలో ఐదు రా ష్ట్రాలలో జరగనున్న ఎన్నికల్లో మిక్కిలి ఆసక్తికరమైన రాష్ట్రంగా నిలుస్తున్నది ఉత్తరప్రదేశ్ అనటంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ ఎన్నికలు 80 శాతం ప్రజలకి, మిగిలిన 20 శాతం ప్రజలకు మధ్య పోరాటంగా ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించడం ద్వారా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా బిజేపీ కూటమి ఆ ప్రాతిపదికన తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలమధ్య మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టైనా విజయం సాధిస్తామన్నదే దీని అంతరార్ధం. ఈ రకమైన వివాదాస్పదమైన ప్రకటన వల్ల పుట్టిన రాజకీయ వేడిని చల్లార్చేందుకు ఆయన తన ప్రకటనకు ఒక భిన్నమైన కోణంలో అర్ధం చెప్పే ప్రయత్నం చేశారు. పై వ్యాఖ్యాల సంగతి ఎలా ఉన్నా బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ ప్రాయోజిత సామాజిక, కులపరమైన విభజన రాజకీయాలపై ఆయనకు అచంచల విశ్వాసం.
కానీ గతవారం వారు ఊహించని పరిణామం జరిగింది. బిజెపి – ఆర్‌ఎస్‌ఎస్ నిర్మిత కుల ఆధారిత విభజనరాజకీయ కోటకు పగుళ్లు చూపటం ప్రారంభంమైంది. ధరమ్ సింగ్ సైని మరియు స్వామిప్రసాద్ మౌర్య వంటి మంత్రులే కాక పలువురు శాసన సభ్యులు కూడా బిజెపికి రాజీనామా చేశారు. చాలా మంది సమాజ్ వాది పార్టీలో చేరారు. అంతేకాదు, త్వరలో మరికొంత మంది కూడా రాజీనామా చేస్తారన్నట్టు వార్తలు వినవస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా రాజీనామా చేసేవారిలో యాదవేతర ఇతర వెనుకబడిన కులాలకు(•దీ•) చెందిన వారేనని భోగట్టా. గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ కూటమి యూపీ లోని యాదవేతర వెనుకబడిన వర్గాలను హిందూత్వ రాజకీయాలకు అనుకూలంగా మలుచుకోవడం కోసం చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిపారు. అందులో వారు సఫలీకృతం అయ్యారని కూడా చెప్పవచ్చు.
గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ఎన్నికలను గెలుస్తూ వచ్చిన పార్టీ బిజెపి. అంతేకాదు, వ్యవస్థాగతంగా, ఆర్థికపరంగా బలమైన మూలాలు కలిగిన పార్టీ బిజెపి. అందుకే గత ఐదు సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆర్‌ఎస్‌ఎస్ కి ఒక ప్రయోగశాలగా మారింది. అందువల్లనే ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు నరేంద్ర మోడీ తరువాత ప్రధాని అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ ను భావిస్తున్నాయి. గత సంవత్సరం ఒక ఆర్‌ఎస్‌ఎస్ మేధావి వ్యక్తిగత సంభాషణల్లో భాగంగా నాతో మాట్లాడుతూ ‘‘యోగి ఆదిత్యనాథ్ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం లేకుండానే అతని ఆహార్యం, హిందూత్వ పట్ల అతనికి గల అచంచల విశ్వాసం వల్ల ఈ దేశాన్ని హిందూ రాష్ట్రం అని పిలవ్వచ్చు’’ అని అన్నారు. కానీ దురదృష్టవశాత్తు అతని నాయకత్వంలోనే సమాజ్వాది పార్టీలోకి కానీ, ఇతర రాజకీయ పార్టీల లోకి కానీ బిజెపి నుండి వలసలు ప్రారంభమయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వలసల వల్ల తమ పార్టీకి నష్టం జరగబోతుందన్న విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్ గానీ, దాని అనుబంధ సంస్థలు గానీ, కేంద్ర ఇంటలిజెన్స్ సంస్థలు గానీ గ్రహించినట్టు లేవు. కీలకమైన ప్రశ్న ఏమిటంటే ఈ వలసలన్నీ ఎలక్షన్స్ ముందు సాధారణంగాజరిగే, కోరుకున్న టిక్కెట్టు రాకపోవడం వల్ల జరిగే వలసలేనా? లేక అంతకన్నా లోతైన సంకేతం ఏదైనా ఇందులో ఇమిడి ఉందా? నిజంగా ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి కూటమికి వెనకబడిన తరగతులలోగల సామాజిక పునాది బీటలు వారుతున్నదా?
మండల్ నుండి కమండలానికి
ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి వ్యూహకర్తలు ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చిందేమిటంటే గుజరాత్, మధ్యప్రదేశ్ లో వలే యూపీలో సైతం మేము ఇతర వెనుకబడిన వర్గాలలో చీలికలు తేగలిగాము. వారిని మండల్ రాజకీయాల నుండి కమండల రాజకీయాల వైపు, అంటే హిందుత్వ వైపు, తేగలిగామని. ఒకవేళ వారన్నది నిజమే అయితే పెద్దఎత్తున ఈ వలసలకు కారణం ఏమిటో వారే వివరించాలి. దారాసింగ్ చౌహాన్ ధరమ్ సింగ్ సైని వంటి పెద్ద నాయకులు తమ టికెట్లకు ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ ఎందుకు తిరుగుబాటు చేశారో వివరించాల్సిన అవసరం ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి కూటమికి ఉంది. స్వామిప్రసాద్ మౌర్యకు సన్నిహితుడైన, ఆయన కులానికే చెందిన, లక్నో వాస్తవ్యుడు, నా స్నేహితుడైన ఒక రచయితను రాజకీయంగా స్వామి ప్రసాద్ మౌర్య ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏమిటని నేను అడిగాను. అప్పటికి ఆయన బిజెపిలోనే ఉన్నారు. ఆ విషయాన్ని వివరిస్తూ నా మిత్రుడైన రచయిత ఇలా చెప్పారు ‘‘ స్వామి ప్రసాద్ బిజెపిలో చేరిన తర్వాత నుంచి నేను ఆయన్ని కలవడం మానేశాను. అయితే ఆయన అప్పుడప్పుడు కలుస్తూ ఉండు అని అంటూ ఉండేవారు. కానీ నేను ఆయనకు ఒక విషయం స్పష్టంగా చెప్పాను. ‘‘మీరు ఎంతకాలం బిజెపిలో, అంటే హిందూత్వ రాజకీయాలలో, ఉంటారో అంతకాలం నీతో నాకు కుదరదు అని తెగేసి చెప్పాను.’’
ఇతర వెనుకబడ్డ వర్గాల నాయకులు బీజేపీలో చేరిన తర్వాత తమ ప్రజలకు ఎలా దూరమయ్యారో, తమ సామాజిక పునాదిలో తమపై విశ్వసనీయతను ఎలా పోగొట్టుకున్నారో చెప్పటానికే నేను ఇదంతా చెబుతున్నాను. మతతత్వ వాదానికీ, లౌకిక వాదానికీ మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నపటికీ, గత ఏడేళ్లుగా వెనకబడ్డ వర్గాల ప్రజలు హిందూత్వ నుండి దూరం కావటానికి సమాజంలో తమ వాటా పొందటంలో వెనుకబడ్డామని క్రమంగా గ్రహిస్తుండటమే కారణం. సామాజిక న్యాయం తమకు దక్కటం లేదనీ, పరిపాలనలో, ఉద్యోగాలలో కూడా తమ వాటా తమకు దక్కకుండా పోతున్నదన్న విషయాన్ని వారు గ్రహించారు. ప్రజా పాలనలో కూడా తమ భాగస్వామ్యం లేకుండా పోతోందనీ, తాము నామమాత్రంగా మిగిలిపోతున్నామనీ వారు భావిస్తున్నారు. కానీ బిజెపి నాయకత్వం ఈ సమస్యను గుర్తించడానికిగానీ, పరిష్కరించడానికిగానీ ఎంత మాత్రం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనర్గళ ఉపన్యాసాలూ, ఎల్లెడలా కనిపించే సంఘ్ పరివార్ యొక్క యంత్రాంగం, పార్టీ దగ్గర ఉన్న లెక్కలేనన్ని నిధులు, అలాగే ఎలక్షన్ల నిర్వహణలో దానికి ఉన్నటువంటి నైపుణ్యం తమను రాబోయే ఎన్నికల్లో కూడా గట్టెక్కిస్థాయని వారికి అపారమైన విశ్వాసం ఉన్నట్టు ఉంది. యాదవేతర వెనకబడిన తరగతుల నాయకులను హిందూత్వం వైపు తీసుకు రాగలమని వారు ఎంతగా చెప్పుకున్నప్పటికీ ఈ తిరుగుబాటు మాత్రం వారిని కలవరపరుస్తున్నది.

జిల్లా అధ్యక్షులు,మానవ హక్కుల వేదిక, ఉమ్మడి వరంగల్ జిల్లా సెల్ 9494037288
(మిగతా రేపటి సంచికలో..)
ఉర్మిలేష్ ,న్యూ దిల్లీ,’ది హిందూ ‘ సౌజన్యంతో..
అనువాదం :టి. హరికృష్ణ