Take a fresh look at your lifestyle.

వ్యాక్సిన్ పంపిణీ.. మరో వంక ఎన్నికల నగారా … ఏది ముందు

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ను జనవరి 16వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తోనే మొత్తం వైరస్ నశిస్తుందన్న భ్రమలు పెట్టుకోవద్దని నిపుణులు , ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు హెచ్చరిస్తున్నారు. ప్రాథమికంగా పౌరులు పాటించాల్సిన బాధ్యతలు తప్పని సరి. ముందుగా మూడు కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఈ టీకా వేయనున్నారు. తర్వాత ఏభై ఏళ్ళ పైబడిన వారు.. వ్యాధులతో బాధపడుతున్న 50 ఏళ్ళ లోపువారికి ఈ టీకాలను వేయనున్నారు. వీరి సంఖ్య 27 కోట్లు ఉంటుందని అంచనా. దేశంలో రెండో దశ కొరోనా ప్రారంభమైందన్న వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అంతేకాకుండా, బ్రిటన్ కి చెందిన కొత్తరకం కొరోనా కూడా మన దేశంలో ప్రవేశించి 50 మంది పైగా ఆ వ్యాధి బారిన పడ్డారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ వ్యాక్సిన్ పంపిణీ గురించి మాట్లాడనున్నారు. అత్యవసర వినియోగానికి మన దేశంలో తయారైన కోవాగ్జిన్, కోవీ షీల్డ్ టీకాలను ఉపయోగించనున్నారు. వీటి ప్రామాణికతపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ఆరోగ్య సంస్థ తెలిపింది. ముందుగా ఆత్మస్థయిర్యాన్ని ప్రజల్లో నింపే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు జేస్తోంది. అయితే, కోవిడ్ ఉన్నా ఎన్నికలు, ప్రజాసంబంధమైన ఇతర కార్యక్రమాలు జరిగి తీరాల్సిందేనన్న వాదనలు వికృతంగా ఉన్నాయి. సినిమా థియేటర్లలో వంద శాతం సీట్లను అనుమతించాలని కొన్ని రాష్ట్రాలు ఆదేశాలు జారీ చేయడం జనంలో ఆందోళన కలిగిస్తోంది. మామూలు రోజుల్లోనే సినిమా థియేటర్లలో వాయు కాలుష్యం ఎక్కువ ఉంటుందన్న అభిప్రాయం జనంలో ఉంది.అలాగే., కూరగాయల, చేపల మార్కెట్లలో కూడా కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. ప్రజలను వారి మానాన వారిని వదిలేసి ప్రభుత్వాలు వ్యాపారులు, రాజకీయ వేత్తల నుంచి వచ్చే ఒత్తిడులకు లొంగి నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు.

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఎన్నికల అధికారి సర్వస్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వొచ్చాయి. ప్రభుత్వ యంత్రాంగం అంతా టీకాల పంపిణీ, టీకాలు వేయించే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినీ, ఆరోగ్య కార్యదర్శినీ, ఇతర అధికారులను సమావేశపర్చినప్పుడు వారు ఇదే విషయం స్పష్టం చేశారు. అయితే, ఆ సమావేశం ముగిసిన వెంటనే ఎన్నికల ప్రధానాధికారి షెడ్యూలును విడుదల చేయడం, దానిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం, సోమవారానికి వాయిదా పడటం జరిగింది.ఇవేమీ ఆహ్వానించదగిన పరిణామాలు కావు. ఎన్నికల సంఘం ప్రభుత్వ వ్యవస్థలో భాగమే.అయితే, రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ దే తుది నిర్ణయమని వాదిస్తున్నారు.ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో ఒకటి రెండు కేసులున్నప్పుడే కొరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేశారు. కొరోనా పూర్తిగా తగ్గకుండా ఇప్పుడు ఎన్నికల షెడ్యూలు ప్రకటించడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ రాజకీయాలకు అతీతంగా, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహించాలి. కానీ, అంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషనర్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రభుత్వమూ, అధికార పక్షమూ వాదిస్తున్నాయి. రాజ్యాంగ పదవిలో ఉన్న వారిని గౌరవించాల్సిన మాట నిజమే కానీ, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, ప్రభుత్వ అభిమతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికలను నిర్వహిస్తే కొరోనా మరింత ఉధృతమైతే ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్న సహేతుకమైనదే.

- Advertisement -

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ఎన్నికల కమిషనర్ ఈ షెడ్యూలును విడుదల చేశారన్న ఆరోపణను కొట్టివేయలేం. ఒక వంక టీకాల కార్యక్రమానికి కేంద్రం షెడ్యూలును ప్రకటించిన సమయంలోనే ఎన్నికల షెడ్యూలును ప్రకటించడం ఏపాటి సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో నియమితులైన ఎన్నికల కమిషనర్ ఆయనకు అనుకూలమైన రీతిలో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వొచ్చాయి. ఆయన స్థానే కొత్త కమిషనర్ ను ప్రస్తుత ప్రభుత్వం నియమించడాన్ని వ్యతిరేకిస్తూ రమేష్ కుమార్ న్యాయపోరాటాన్ని సాగించి ఆ పదవిలో కొనసాగుతున్నారు. అయితే, తనపై ఆరోపణలు వొచ్చినప్పుడు ఆయన అనుమానాలకు అతీతంగా వ్యవహరించాలని ఏ పార్టీకీ చెందని వారు కోరుతున్నారు. సకాలంలో ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి నిధులు రావని చెబుతున్నారు.అది నిజమే కావచ్చు. ప్రజాస్వామ్యంలో కేంద్రం కూడా రాష్ట్రాల పరిస్థితులు,ఇబ్బందులను బట్టి నిబంధనలను సడలించుకోవాలి. కొరోనా అన్నది ఎన్నడూ కనీవినీ ఎరుగని అనుభవమైనప్పుడు కేంద్రం ఇప్పటికే పలు నిబంధనలను సరళీకరించింది.అందువల్ల కొరోనా తగ్గేవారకూ స్థానిక ఎన్నికలు వాయిదా వేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సహకరించాలి. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆయన వాదన సరైనదే కావచ్చు కానీ పాలనా యంత్రాంగం ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఎన్నికల విధులను నిర్వహించలేమంటూ ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ప్రకటించింది. ఈ తరుణంలో ఎన్నికలను బలవంతంగారుద్దడం న్యాయం కాదు.

Leave a Reply