ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రాధాన్యతా క్రమంలో దశల వారీగా ప్రతి ఒక్కరికీ కోవిడ్ టీకా అందించేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైరన్ విజయవంతంగా కొనసాగింది.శుక్రవారం సిద్దిపేట పట్టణంలో నాసర్ పుర పట్టణ ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైరన్ జరుగుతున్న తీరును రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిలు పరిశీలించారు. డ్రైరన్ జరుగుతున్న తీరును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంత్రి , జిల్లా కలెక్టర్ వివరించారు. టీకా పంపిణీకి అన్ని విధాలుగా సర్వ సన్నద్ధంగా ఉండాలని మంత్రి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
డ్రై రన్ విజయవంతం: జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్
సిద్దిపేట జిల్లా హాస్పిటళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు మొత్తం 21 కేంద్రాల్లో డ్రైరన్ నిర్వహించామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తెలిపారు. మొత్తం 360 మంది హెల్త్ కేర్ వర్కర్స్ పై డ్రై రన్ చేపట్టారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన డ్రైరన్ విజయవంతం అయ్యిందన్నారు. టీకా నిర్వహణలో ఎదురయ్యే లోపాలను అధిగమించడంతోపాటు సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. డ్రైరన్‌లో గమనించిన సాంకేతిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ వెల్లడించారు.