- వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు
- 24 గంటల్లో 155 రోజుల్లో అత్యల్పంగా 25,166 కొత్త కేసులు
కోవిడ్ వ్యాక్సినేషన్లో ఇండియా కొత్త రికార్డు సృష్టించింది. తాజాగా 24 గంటల్లో భారత్లో 88.13 లక్షల మందికి కోవిడ్ టీకా ఇచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తన ట్విట్టర్లో వెల్లడించారు. ఒకే రోజు అత్యధిక సంఖ్యలో టీకాలు ఇవ్వడం ఇదే తొలిసారి. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 55.47 కోట్ల మందికి కోవిడ్ టీకాలు ఇచ్చినట్లు ప్రభుత్వం చెప్పింది. ఇందులో 46 శాతం మంది వయోజనులు మొదటి డోస్ తీసుకోగా, రెండు డోసులూ తీసుకున్నవారు 13 శాతం.
టీకాల కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మరిన్ని టీకాలు అందుబాటులో ఉండేట్టు చేయటం, 15 రోజులు ముందుగానే ఎంత పరిమాణంలో టీకాలు అందుబాటులో ఉండబోతున్నాయో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలియజేయటం ద్వారా వారు సరైన ప్రణాళికల ద్వారా పంపిణీచేయటానికి వెసులుబాటు కల్పించిందని ప్రభుత్వం వెల్లడించింది. ఇండియాలో 155 రోజుల్లో అత్యల్ప సంఖ్యలో కోవిడ్ 24 గంటల్లో కేవలం 25,166 కేసులు నమోదు కాగా 437 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. డెయిలీ పాజిటివిటీ రేటు 1.61 శాతంగా ఉంది.