Take a fresh look at your lifestyle.

కోఠికి చేరిన కోవిడ్‌ ‌టీకా

  • పూణే నుంచి ప్రత్యేక కార్గో విమానంలో శంషాబాద్‌ ‌విమానాశ్రయానికి
  • అక్కడి నుంచి స్టేట్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌కేంద్రానికి చేర్చిన అధికారులు
  • తొలి దశలో 139 కేంద్రాలలో 13,900 మందికి

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. పది నెలల పాటు భయానక వాతావరణం సృష్టించిన కొరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడేందుకు మార్గం సుగమమైంది. ఈనెల 16న దేశవ్యాప్తంగా కొరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన కొరోనా వ్యాక్సిన్‌ ‌మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ ‌నగరానికి చేరుకుంది. పూణేలోనని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ‌నుంచి ప్రత్యేక కార్గో విమానంలో శంషాబాద్‌ ‌విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి భారీ భద్రత మధ్య మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కొరోనా టీకా కోఠిలోని కోఠిలోని స్టేట్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌సెంటర్‌కు చేరింది. పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇం‌డియా తయారు చేసిన 3.72 లక్షల డోసుల కోవిషీల్డ్ ‌వ్యాక్సిన్‌ను అక్కడ ఏర్పాటు చేసిన 40 క్యూబిక్‌ ‌మీటర్ల వ్యాక్సిన్‌ ‌కూలర్‌లో టీకాలను నిల్వ చేశారు.

కాగా, కొరోనా టీకా పంపిణీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1213 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్‌ను తరలించేందుకు 866 కోల్డ్‌చైన్‌ ‌పాయింట్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు 139 కేంద్రాలలో 13,900 మందికి కోవిడ్‌ ‌టీకా వేయనున్నారు. మొత్తంగా తొలుత 2.90 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకా వేయనున్నారు. వారంలో నాలుగు రోజుల పాటు సోమ, మంగళ, బుధ, గురువారాల్లో టీకా వేయనున్నారు. ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ టీకా పంపిణి కార్యక్రమం కొనసాగనుంది.

ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విధంగా ముందుగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది సహా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి, ఆ తరువాత కోవిడ్‌ ‌వ్యాప్తి నివారణలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, భద్రతా సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది తదితర ఫ్రంట్‌లైన్‌ ‌వర్కర్లకు టీకా వేయనున్నారు. అనంతరం 50 ఏండ్లకు పైబడ్డ వారికి, అనంతరం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్య క్రమంలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Leave a Reply