Take a fresh look at your lifestyle.

అం‌దరికీ కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌

  • ఇప్పటికే అవసరమైన కార్యాచరణను రూపొందించాం
  • పీఎం మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌

‌కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌కోసం ప్రజలంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారనీ, శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్‌ ‌రావా ల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ, ఇప్పటికే అవసరమైన కార్యాచరణను రూపొందించినట్లు చెప్పారు. మంగళవారం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ ‌గవర్నర్లతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌ ‌పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి వచ్చిన తరువాత వాటిని ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు.

ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ ‌తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్‌ ‌నుంచి బయటపడటానికి వ్యాక్సిన్‌ ఒక్కడే మార్గమని పేర్కొన్నారు. శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్‌ ‌రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ ‌వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఏమైనా ఉంటాయా ? లేదా ? అనే విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయనీ, కొరోనా వైరస్‌ ‌కూడా దేశమంతా ఒకే విధమైన ప్రభావాన్ని చూపలేదన్నారు. ఈ కారణంగా వ్యాక్సిన్‌ ‌కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన దుష్ప్రభావాన్ని చూపే అవకాశం ఉందన్నారు. దేశంలోని ప్రతీ రాష్ట్రానికీ మొదట కొన్ని చొప్పున వ్యాక్సిన్‌ ‌డోసులు పంపి వాటిని కొంత మందికి ఇవ్వాలనీ, అనంతరం 15 రోజులు పరిస్థితిని పరిశీలించి మిగతా వారికి ఇవ్వాలని సూచించారు. కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి రానుండటం శుభపరిణామమనీ, ఇప్పటికే కొవిడ్‌తో దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు అన్ని రంగాలు కుదేలయ్యాయని పేర్కొన్నారు.

రాష్ట్రం, జిల్లా, మండల స్థాయిలో కమిటీలు : సీఎం కేసీఆర్‌ ఆదేశం
రాష్ట్రంలో కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌పంపిణికి అవసరమైన మౌలిక సదుపాయాలను వెంటనే సమకూర్చుకోవాలని సీఎం కేసీఆర్‌ ‌వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్‌ అం‌దరికీ అందేలా అవసరమైన కార్యాచరణను రూపొందించాలని సూచించారు. ప్రధానితో సమీక్ష అనంత•రం ఆయన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను సరఫరా చేసేందుకు అవసరమైన కోల్డ్ ‌చైన్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్రం, జిల్లా, మండల స్థాయిలో కమిటీలుగా ఏర్పడి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. ముందుగా ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, ఇతర శాఖల సిబ్బంది, 60 ఏళ్లు దాటిన వృద్దులకు, తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని తెలిపారు. ఇందుకోసం ప్రాధాన్యతా క్రమంలో జాబితా రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

Leave a Reply