- కొరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం
- అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ
- టీకా వేయించుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
దేశంలో కోవిడ్ టీకా పంపిణీ వేగవంతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీకా పంపిణీపై ఇప్పటి వరకూ ఉన్న సమయ పరిమితిని కేంద్రం తొలగించింది. దేశంలోని పలు రాష్ట్రాలలో కొరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రజలు తమకు అనువైన సమయంలో ఎప్పుడైనా టీకా తీసుకునేందుకు 24 గంటలూ అందుబాటులో ఉంచాలని ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యం, సమయం విలువ దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈమేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్ ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. ఇకపై టీకా పంపిణీకి ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు నిర్ణీత షెడ్యూల్‌కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదనీ, ఏ సమయంలోనైనా టీకా పంపిణీ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రస్తుతం కోవిన్ యాప్ పోర్టల్‌లో కేవలం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అని ఉన్నప్పటికీ అంతకు ముందు లేదా సమయం గడచిన తరువాత కూడా వ్యాక్సిన్ పంపిణీ చేసుకోవచ్చని పేర్కొన్నారు. దవాఖానాల సామర్థ్యాన్ని బట్టి టీకా పంపిణీ సమయాలను నిర్దేశించుకోవచ్చన్నారు.
అలాంటి సమయాంల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. అయితే, ఇదే సందర్భంలో టీకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ భారీగా నిల్వ ఉంచుకోవద్దని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. కేరళ, చత్తిస్గఢ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండగా, మహారాష్ట్ర, పంజాబ్, దిల్లీ, కర్ణాటక,గుజరాత్ రాష్ట్రాలలో కొరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.