- ఇంటింటి సర్వే నిర్వహించి రెండు డోసులూ వేయించాలి
- ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచండి
- సిద్దిపేట నుంచి టెలీ కాన్ఫరెన్స్‌లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
హై••దరాబాద్, ప్రజాతంత్ర ప్రతినిధి : తెలంగాణలో డిసెంబర్ లోగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.ఇంటింటికీ వెళ్లి మొదటి డోస్ వేసుకున్న వారు ఎంత మంది, రెండో డోసు వేసుకున్న వారు ఎంత మంది అనే వివరాలు పక్కాగా సేకరించాలనీ, అలాగే, మొదటి డోస్ వేసుకోని వారు, రెండో డోసు వేసుకోని వారి వివరాలను సైతం సేకరించాలని పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట నుంచి టెలీ కాన్ఫరెన్స్‌లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆశాలు, ఏఎన్ఎంలు, డాక్టర్లు, గ్రామ స్థాయి, సబ్ సెంటర్, పిహెచ్సి స్థాయిలో ప్రణాళికలు వేసుకుని ప్రతీ వ్యక్తిని రెండు డోసులు వేసుకునేలా చూడాలని సూచించాలి.ప్రజల్లో కోవిడ్ వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాలని ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 5 కోట్ల 55 లక్షల వ్యాక్సిన్లు వేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 3 కోట్ల 60 లక్షల డోసులు వేశామనీ, మరో కోటి 90 లక్షల డోసులు వేయాల్సి ఉందని వివరించారు. తొలి కోటి డోసులు వేయడానికి 165 రోజులు పట్టగా, రెండో కోటి డోసులు వేయడానికి 78 డోసులు, మూడో కోటి డోసులు పూర్తి చేయడానికి 27 రోజులు పట్టిందన్నారు. ఆశా వర్కర్లు మాతా శిశు సంరక్షణపై దృష్టి సారించాలనీ, రక్తహీనతపై అవగాహన కలిగించి వారికి అవసరమైన పోషకాహారం అందించేలా కృషి చేయాలన్నారు. సీఎం కసీఆర్ ఆదేశాల మేరకు మరింత దీక్షతో పనిచేసి రాస్ట్ర ప్రజలకు మంచి వైద్య పరీక్షలు అందజేసి రాష్ట్రాన్ని ప్రజారోగ్య రంగంలో దేశంలోని ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రసవాల సంఖ్యను మరింత పెంచేలా చూడాలనీ, పిల్లలు పుట్టిన తొలి గంటలోనే తల్లి పాలు అందేలా తల్లులకు అవగాహన కలిగించాలని ఈ సందర్భంగా హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.