Take a fresh look at your lifestyle.

ఏపి ని చూసైనా…

ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వానికి సాధ్యపడినట్లు దేశంలోని ఇతర రాష్ట్రాలకు కోవిడ్‌ ‌చికిత్సలను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకురావడానికి ఎందుకు సాధ్యపడదన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్రా ఉత్పన్నమవుతున్నది. ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కోవిద్‌ 19 ‌చికిత్స విషయంలో దేశంలోని అన్ని ప్రభుత్వాలు స్పందించినప్పటికీ ఇప్పటివరకు ఏపి తరహాలో నిర్ణయం తీసుకోలేకపోయాయి. కొరోనా వైరస్‌ను గుర్తించినప్పటి నుండి ప్రభుత్వ పరంగానే, ప్రభుత్వ దవాఖానా ల్లోనే చికిత్స చేయించుకునే విధంగా దాదాపు అన్ని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. కాని, రోజు రోజుకు తీవ్రమవుతున్న కేసుల దృష్ట్యా ప్రభుత్వ దవాఖానాల్లో ప్రతీ పాజిటివ్‌ ‌వైరస్‌ ‌వ్యక్తికి తగిన చికిత్సను చేయలేకపోతున్న విషయం బహిరంగ రహస్యమే. తెలంగాణ విషయానికొస్తే ప్రభుత్వ దవాఖానాల చుట్టు ఏవిధంగా తిరుగుతూ ఎలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నది సామాజికి మీడియా ద్వారా నిత్యం అనేక కేసులు వెలుగులోకి వొస్తూనేఉన్నాయి. ప్రైవేటుగా దీనికి చికిత్సలు చేయించుకోవడానికి ప్రభుత్వం ముందుగా అనుమతించకపోయినా, వైరస్‌ ‌సోకిన విఐపిలు, రాజకీయ నాయకులు మాత్రం ప్రైవేటు వైద్యం చేయించుకుంటూ సామాన్యులను ప్రభుత్వ ఆసుపత్రులకు పరిమితంచేయడమేంటన్న విమర్శలొస్తున్నాయి. పోనీ తామే స్యయంగా ప్రైవేటు హాస్పిటల్స్ ల్లో వైద్యం చేయించుకోవాలనుకునే సామాన్యులకు వారు వేసే ఛార్జీలను చూస్తేనే భయమేస్తున్నది. అవి సాధారణ ప్రజలకు ఏమాత్రం అందుబాటులోలేనంతగా ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వొస్తున్నది.

ప్రైవేటు హాస్పిటల్స్ పై ప్రభుత్వానికి అజమాయిషీలేదన్న విషయం తాజాగా వెలుగులోకి వొచ్చిన పలు సంఘటనలు తేటతెల్లంచేస్తున్నాయి. అన్ని హంగులతో వైద్యం చేయాలంటే కనీసం రోజుకు లక్ష రూపాయలకు తక్కువ ఉండటంలేదు. ఒక బెడ్‌తో సరిపుచ్చుతేనే రోజుకు ముప్సైవేల ఖర్చు భరించాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. ఇటీవల వైరస్‌ ‌సోకిన ఇద్దరు డాక్టర్లకు సంబందించిన వీడియోలు ఎలా వైరల్‌ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. స్వయంగా వారు డాక్టర్లు అయినా వైద్యంకోసం ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్ళితే ఒక్క రోజుకు లక్షకు పైగా ఎలా వసూలు చేశారన్నది వారు సెల్ఫీ రికార్డుచేసి సామాజిక మీడియా పెట్టిన ఉదంతం ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్ళాలంటే సూటుకేసు తీసుకెళ్ళాల్సిందేనన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళింది. అలాగే సామాన్యులనెవరినీ ప్రైవేటు హాస్పిటల్స్ వర్గాలు గేటు లోపలికికూడా రానివ్వడంలేదన్న ఆరోపణలు మరికొన్ని ఉన్నాయి. ఇంతటి ఘోర పరిస్థితులను చూసి, ఏపి ప్రభుత్వం దేశంలోనే మొదటిసారి సముచిత నిర్ణయం తీసుకోవడంపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. డబ్బుకన్నా ప్రజలకు మేలైన వైద్య సదుపాయం అందుబాటులోకి తీసుకురావాలన్న దృక్పథంతో కోవిద్‌ 19‌ని ఆరోగ్యశ్రీ కిందకు అక్కడి ప్రభుత్వం చేర్చింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో ఉన్న దాదాపు అన్ని ప్రైవేటు హాస్పిటల్స్ ల్లో ఈ వైరస్‌ ‌బాధితులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దేశవ్యాప్తంగా కొరోనా పాజిటివ్‌ ‌కేసులు ఎలా విస్తృతమవుతున్నాయో, ఏపిలోకూడా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సాధ్యమైనంతవరకు సత్వర వైద్యం అందించేందుకు దీన్ని ఒక మార్గంగా ఎంచుకుంది. ఒక పక్క ప్రభుత్వ దవాఖానాల్లో చికిత్స అందిస్తూనే, ప్రైవేటు హాస్పిటల్స్ ప్రభుత్వ డబ్బుతోనే వైద్యం అందించే ఏర్పాట్లును చేస్తోంది. అయితే ఎలాగూ ప్రభుత్వం అనుమతిచ్చిందికదా అని అడ్డగోలుగా ఛార్జి చేయకుండా, ప్రభుత్వం నిర్ధేశించిన పరిధిలోనే చికిత్స వ్యయం ఉండాలని కూడా సూచించడం మంచి పరిణామం. నాన్‌ ‌క్రిటికల్‌ ‌కొరోనా పేషంట్లకు చికిత్స చేయడానికి రోజు ఒక్కంటికి 3వేల 250 రూపాయలుగా ప్రభుత్వం నిర్దేశించింది. సీరియస్‌గా ఉన్న పేషంట్లకు అయితే ఐసీయులో వెంటీలేటర్లు, ఎన్‌ఐవీ లేకుండా ఉంచితే రోజుకు 5వేల 480 రూపాయల ఛార్జీని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్‌ఐవితో ఐసీయులో ఉంచి వైద్యం అందిస్తే రోజుకు 5వేల 980గా, వెంటిలేటర్స్‌తో వైద్యం అందిస్తే రోజుకు 9వేల 580 రూపాయలు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అలానే మరికొన్ని సూచనలు చేసింది. అయితే ప్రభుత్వం సూచించిన రేట్లను అక్కడి ప్రైవేటు హాస్పిటల్స్ ఏమేరకు ఆచరిస్తాయన్నది వేరే విషయం. తెలంగాణలోకూడా కోవిద్‌ ‌పేషంట్ల సంఖ్య పెరుగుతున్నది. ప్రభుత్వ దవాఖానాలు పెరుగుతున్న సంఖ్యకు తగినట్లుగా వైద్య సేవలను అందించలేకపోతున్న దృష్ట్యా ఏపి తరహాలో ప్రైవేటు హాస్పిటల్స్ కోవిద్‌ ‌చికిత్స పొందేందుకు వీలుగా ఆరోగ్యశ్రీ పరిదిలోకి దీన్ని తీసుకు వొస్తే, కొంతలోకొంత సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధనిక తెలంగాణ ప్రభుత్వం ఇంతకన్నా మంచినిర్ణయం ఏమైనా తీసుకుంటుందేమో చూడాలిమరి.

Leave a Reply