Take a fresh look at your lifestyle.

తొలిసారి రెండులక్షలకు దిగువన..

  • కొత్తగా లక్షా 95 వేల 485 కొరోనా కేసుల నమోదు
  • దేశంలో తగ్గుముఖం పడుతున్న కేసులు
  • 24 గంటల్లో మూడు వేల 496 మంది మృత్యువాత
  • ఢిల్లీలో ఇప్పటివరకు 500 బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసులు నమోదు
  • 19,420 యాంఫోటెరిసిన్‌ ‌వయల్స్‌ను అదనంగా కేటాయింపు

దేశంలో కొరోనా వైరస్‌ ‌సెకెండ్‌ ‌వేవ్‌ ‌కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా రెండు లక్షలకు దిగువగా కొరోనా వైరస్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కొరోనా మృతుల సంఖ్య కూడా తగ్గింది. గడచిన 40 రోజులుగా దేశంలో ప్రతిరోజూ రెండు లక్షలకుపైగా కొరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అయితే గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా ఒక లక్షా 95 వేల 485 కొరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌-19 ఇం‌డియా ఆర్గనైజేషన్‌ ‌వెల్లడించిన గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో కొరోనా కారణంగా మూడు వేల 496 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 14 ‌న దేశంలో తొలిసారిగా రెండు లక్షలకుపైగా కొరోనా వైరస్‌ ‌కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 25 లక్షల 81 వేల 741 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. గడచిన 24 గంటల్లో మూడు లక్షల 26 వేల 671 మంది కొరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కొరోనా బాధితుల సంఖ్య రెండు కోట్లు 69 లక్షల 47 వేలు దాటింది. ఇప్పటి వరకూ మూడు లక్షల 7 వేల 249 మంది కొరోనా కారణంగా మృతిచెందారు.

ఇప్పటివరకు 2 కోట్ల 40 లక్షల 47 వేల 760 మంది కొరోనా బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇదిలావుంటే దేశంలో కొరోనా సెకెండ్‌ ‌వేవ్‌ ‌తాండవిస్తున్న ప్రస్తుత సమయంలో బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసులు అంతకంతకూ పెరుగుతూ కలవరానికి గురి చేస్తున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,424 బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు దేశంలోని 18 రాష్ట్రాల్లో నమోదయ్యాయి. ఢిల్లీలో ఇప్పటి వరకు 500 బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వం బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసుల చికిత్సకు లోక్‌నాయక్‌ ‌జయప్రకాష్‌ ‌హాస్పిటల్‌, ‌గురు తేగ్‌ ‌బహదూర్‌ ‌హాస్పిటల్‌, ‌రాజీవ్‌ ‌గాంధీ సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటళ్ల ను కేటాయించింది. కాగా ఢిల్లీలో రోజుకు 40 బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసులు నమోదవుతూ వస్తున్నాయి.దేశవ్యాప్తంగా బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసులు పెరుగుతుండటంతో వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 19,420 యాంఫోటెరిసిన్‌ ‌వయల్స్‌ను అదనంగా కేటాయించినట్టు కెమికల్స్ అం‌డ్‌ ‌ఫెర్టిలైజర్స్ ‌మంత్రిత్వ శాఖ మంగళవారంనాడు ప్రకటించింది.

మే 21న ప్రకటించిన వాటితో కలిపి ఇంతవరకూ 23,680 వయల్స్‌ను కేటాయించినట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ తెలిపారు. బ్లాక్‌ ‌ఫంగస్‌ను 1897 అంటువ్యాధుల చట్టం కింద బ్లాగ్‌ ‌ఫంగస్‌ను నోటిఫియబుల్‌ ‌డిసీజ్‌గా గుర్తించాలని రాష్ట్రాలు యూటీలకు కేంద్రం ఇటీవల ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిరిగా బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసులను ఇంటిగ్రేటెడ్‌ ‌డిసీజ్‌ ‌సర్వెయలెన్స్ ‌పోగ్రాం (ఐడీఎస్‌పీ)కి రిపోర్ట్ ‌చేయాలని కూడా ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో రాజస్థాన్‌, ‌గుజరాత్‌, ‌పంజాబ్‌, ‌హర్యానా, కర్ణాటక, ఒడిశా, తెలంగాణలు బ్లాగ్‌ ‌ఫంగస్‌ను నోటిఫియబుల్‌ ‌డిసీజ్‌గా ప్రకటించాయి. సోమవారం వరకూ ఢిల్లీలో 500కు పైగా బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌వెల్లడించారు.

Leave a Reply