Take a fresh look at your lifestyle.

విద్యారంగంలో కొరోనా కష్టాలు

దేశంలోని అన్నిరంగాలపై పడినట్లుగానే కొరోనా ప్రభావం విద్యారంగం పైన కూడా చూపుతోంది. గడచిన మూడు నెలలుగా విద్యార్దులు పాఠశాలలకు దూరంగా కొరోనా సెలవుల్లో గడుపుతున్నా, ఆ తర్వాత పరిస్థితేమిటన్నది పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది. దేశంలో నాలుగు విడుతలుగా లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే, మరో పక్కన ఆర్థిక పరిస్థితుల రీత్యా దశల వారీగా సడలింపులను ప్రకటిస్తున్నా విద్యారంగంలో మాత్రం స్థబ్ధతే కొనసాగుతోంది. భావి భారత పౌరులవిషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఆచీతూచీ అడుదులేయాల్సిన పరిస్థితులున్నాయి. దానితో ప్రభుత్వాలు సత్వర నిర్ణయాలను తీసుకోలేక పోతున్నాయి.. కింది తరగతుల విద్యార్దులనైతే ప్రమోషన్‌చేసి పై తరగతులకు పంపవచ్చు, కాని , ఉన్నత తరగతి విద్యార్దుల పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు ప్రభుత్వాల ముందున్న పెద్ద ప్రశ్న. సరిగ్గా పరీక్షల సమయంలోనే లాక్‌డౌన్‌ ‌ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వార్షిక పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పుడు వారికి పరీక్షలు నిర్వహించడమే ప్రభుత్వానికి పరీక్షగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలోనే లాక్‌డౌన్‌ ‌ప్రకటించాల్సి వచ్చింది. పదకొండు సబ్జెక్టులకుగాను రెండు సబ్జెక్టులకు సంబందించి మూడు పేపర్లకు పరీక్షలు మాత్రమే జరిగాయి. ఈలోగా రాష్ట్రంలో ప్రభలుతున్న కొరోనా వైరస్‌ను దృష్టిపెట్టుకుని పరీక్షలను వాయిదావేయాలంటూ కొందరు కోర్టుకు వెళ్ళడంతో కోర్టు ఆదేశాలతో వాటిని వాయిదా వేయక తప్పలేదు. అయితే ప్రస్తుత పరిస్థితిలో వివిధ రంగాలపైన లాక్‌డౌన్‌ ‌తొలగింపులు జరుగుతున్నప్పటికీ, పాజిటివ్‌ ‌కేసుల సంఖ్యమాత్రం తగ్గటంలేదు. ఈ నేపద్యంలోనే తిరిగి పదవ తరగతిలో మిగిలిన సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ అభిప్రాయంపై తీవ్ర వ్యతిరేకత రావడం, ప్రభుత్వం ఈవిషయంలో ఆ రంగంలోని నిష్ణాతులతో చర్చించి, చివరకు పరీక్షలు జరుపకుండానే పదవ తరగతి విద్యార్దులందరినీ ప్రమోట్‌ ‌చేస్తున్నట్లు ప్రకటించడం జరిగిపోయింది. కేవలం తెలంగాణరాష్ట్రానిదేకాదు, దేశంలోని అనేక రాష్ట్రాలు ఇదే సమస్యను ఎదుర్కుంటున్నాయి. తమిళనాడు, పుదుశ్చేరి, పంజాబ్‌, ‌మధ్యప్రదేశ్‌లుకూడా తెలంగాణ బాటలోనే పరీక్షలను రద్దుచేసి, ఉన్నత తరగతులకు ప్రమోషన్‌ ‌చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నాయి.

దీనివల్ల మెరిట్‌ ‌విద్యార్దులు నష్టపోతారని విద్యార్దుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు విద్యావేత్తలు మాత్రం హర్షం వ్యక్తపరుస్తున్నారు. అసెస్‌మెంట్‌, ఇం‌టర్నల్స్ ‌మార్కుల ఆధారంగా విద్యార్దులకు గ్రేడ్‌ ఇవ్వాలన్నది సముచిత నిర్ణయంగా భావిస్తున్నారు. క్వార్టర్లీ, ఆఫ్‌ ఇయర్లీ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా, అటెండెన్స్ ‌పర్సంటేజీనిబట్టి మిగిలిన ఇరవై శాతం మార్కులువేసి గ్రేడ్లు నిర్ణయిస్తారన్నది అందులోని సారాంశం. ఇదిలాఉంటే పక్కనే ఉన్న ఏపి ప్రభుత్వం మాత్రం తాము పరీక్షలను నిర్వహించేతీరుతామంటోంది. ఆమేరకు షెడ్యూల్‌నుకూడా ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం సాధ్యంకాదనుకున్న పరీక్షల నిర్వహణను తాము చేసి చూపుతామంటోంది. అందరినీ భయపెడుతున్న కొరోనా విషయంలో తల్లిదండ్రులెవరూ భయపడాల్సి అవసరం లేదని, తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతోంది. అయితే జూలై పది నుండి పదిహేనవ తేదీవరకు నిర్వహించ తలపెట్టిన ఈ పరీక్షలను మాత్రం కుదించింది. గతంలో మాదిరిగా పదకొండు పేపర్లు కాకుండా వాటిని ఆరుకు కుదించి, పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే తెలంగాణలో ఉన్నత విద్యకు సంబందించిన పరీక్షల నిర్వహణ మరో సమస్యగా మారింది. డిగ్రీ, పీజీ పరీక్షలు ఎలా నిర్వహించాలన్న విషయంలో ఉన్నత విద్యామండలి ఇప్పటికే కుస్తీపడుతోంది. అసలు పరీక్షలు నిర్వహించాలా, నిర్వహించకుండానే పదవ తరగతి విద్యార్దులను ప్రమోట్‌ ‌చేసినట్లు వీరినికూడా ప్రమోట్‌ ‌చేయాలా అన్నదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్నితీసుకోలేకపోతున్నది. అలాగే ఈ సంవత్సరం నిర్వహించాల్సి ఉన్న డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం సెమిస్టర్‌ ‌పరీక్షల విషయంలో ఏంచేయాలన్న ఆలోచనలో ఉన్నత విద్యా శాఖ తలమునకలవుతున్నది. పరీక్షల నిర్వహణ విషయం ఇలా ఉంటే వచ్చే విద్యాసంవత్సరాన్ని ఎలా కొనసాగించాలన్నదికూడా మరో పెద్ద ప్రశ్నగా ప్రభుత్వముందున్నది.

ప్రాధమిక స్థాయినుండి ప్రొఫెషనల్‌ ‌కోర్సుల్లోని విద్యార్దులకు తరగతుల నిర్వహణ విషయంలో అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా చిన్నపిల్లలు స్కూల్‌ ‌వెళ్ళేందుకు మారంచేయడంకద్దు, అయితే మా పిల్లలను పాఠశాలలకు పంపించమంటున్నారిప్పుడు తల్లిదండ్రులు. కొరోనా వైరస్‌ ‌ప్రభావం పూర్తిగా తగ్గేవరకు పిల్లలను పంపించేదిలేదంటున్నారు. చిన్న పిల్లకు, వృద్దులకు ఈ వైరస్‌ ‌త్వరగా సోకే అవకాశముందని ఒక పక్క ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ, ఇప్పుడు జూన్‌ ‌మొదటి వారంలో పాఠశాలలను ప్రారంభి తీవ్రంగా వ్యతిరేకించే ప్రయత్నంలో ఉండడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో అప్పుడే కొందరు కోర్టు గడప కూడా తొక్కారు. అయితే మరికొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పాఠశాల విద్యార్దుల్లో 48 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నవారంతా పేద, మద్యతరగతికి చెందినవారు. వారి తల్లిదండ్రులు కూలి పనిచేసుకుంటూ వారిని చదివించుకుంటున్నారు. వారికి మధ్యాహ్న భోజనం దీనివల్ల అందకుండా పోతుందంటున్నారు మరికొందరు. పైగా ఇప్పుడు ఆన్‌లైన్‌ ‌క్లాసులగురించి మాట్లాడుతున్నారు. పట్టణాలు,నగరాల్లో ఉన్న కొందరికే సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. సెల్‌ఫోన్‌లు, లాప్‌టాప్‌లు అందరివద్ద ఉండవు. గ్రామాలు,మారుమూల పల్లెల విషయంలో అయితే కనీసం సిగ్నల్స్‌కూడా సరిగారాని పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఆన్‌లైన్‌ ‌పాఠాలు విద్యార్దులందరూ వినడం సాధ్యంకాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్య ఇలాఉంటే ఆలస్యంగా ప్రారంభమవుతున్న విద్యాసంవత్సరంలో నిర్దేశిత సిలబస్‌ ‌పూర్తికావడం కష్టం కాబట్టి సిలబస్‌ను, పనిగంటలను కుదించే విషయంలో ఆ రంగంలోని నిష్ణాతులనుండి సలహాలను, సూచనలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తున్నదంటే విద్యారంగంపైన కొరోనా ఏమేరకు ప్రభావాన్ని చూపిస్తున్నదన్నది స్సష్టమవుతున్నది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply