- జాగ్రత్తలు తీసుకుంటూనే ఎదుర్కోవాలి
- ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై దృష్టి పెట్టాలి
- ఈ-క్రాపింగ్‌లో వివరాలు నమోదు చేయాలి
- నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
- కలెక్టర్లతో స్పందన కార్యక్రమంపై సిఎం జగన్ సమీక్ష
అమరావతి, జూన్ 16 : కోవిడ్ ఎప్పటికీ కూడా జీరోస్థాయికి చేరుతుందని అనుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మనం జాగ్రత్తలు తీసుకుంటూనే.. కోవిడ్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని మరిచి పోవద్దన్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని, మాస్కులు, శానిటైజర్లు తదితర చర్యలన్నీ కొనసాగాలి. ఇవి మన జీవితంలో భాగం కావాలన్నారు. కోవిడ్ నియంత్రణ విషయంలో కలెక్టర్లు, వైద్య సిబ్బంది అద్భుతంగా పనిచేశారని సిఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ మంచి ఫలితాలను ఇచ్చిందని సీఎం తెలిపారు. కేసుల సంఖ్య తగ్గుతుండటంతోపాటు పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందన్నారు. ఈనెల 20 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని, 20 తర్వాత కూడా కొన్ని సడలింపులతో కర్ఫ్యూ ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని, గ్రామాల్లో ఫీవర్ సర్వే కూడా కొనసాగించాలన్నారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ ప్రగతి.. ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులు, రుణాల అందుబాటు.. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్ నిర్మాణంపై సక్ష చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఫోకస్‌గా టెస్టులు చేయాలని, గ్రామాల్లో చేస్తున్న ఫీవర్‌సర్వే కార్యక్రమాలు ప్రతి వారం కొనసాగించాలన్నారు. ఎవరు కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నా.. పరీక్షలు చేసి వెంటనే వైద్యం అందించాలని ఆదేశించారు. ఫీవర్ సర్వే కార్యక్రమం ప్రతి వారం కొనసాగాలన్నారు. సీఎం ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ’టెస్టులు ఇష్టానుసారం కాకుండా ఫోకస్‌గా, లక్షణాలు ఉన్నవారికి చేయాలి. ఎవరైనా కోవిడ్‌పరీక్షలు చేయమని అడిగితే వారికి కూడా చేయాలి. అన్ని టెస్టులు కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలి.
ఆరోగ్య శ్రీ అమల్లో కలెక్టర్లను అభినందిస్తున్నా. 89శాతం మంది కోవిడ్ ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీ కింద తీసుకున్నారు. పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికంగా భారంపడకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకున్నారు. అందరికీ అభినందనలు తెలియచేస్తున్నా. ఈరోజు 16వేలమందికిపైగా కోవిడ్ ట్రీట్ మెంట్ జరుగుతుంటే.. 14 వేలమందికిపైగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారు. ప్రయివేటు ఆస్పత్రులపై కూడా కలెక్టర్లు దృష్టిపెట్టాలి. వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రేట్లుకన్నా.. ఎక్కువ ఛార్జి చేయకూడదు. ఎవరైనా వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలి. అలా చేసిన ఆస్పత్రులను మూసివేయడానికి కూడా కలెక్టర్లు సంకోచించవద్దు. మహమ్మారి సమయంలో ప్రజలను పీడించుకుతినే ఆలోచనలు ఉన్న వారిపై కఠినంగా వ్యవహరించాలి. మొదటిసారి ఉల్లంఘిస్తే పెనాల్టీలు వేయాలి. రెండోసారి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. 104 నంబర్‌ను తప్పనిసరిగా ఓన్ చేసుకోవాలి. కోవిడ్ సంబంధిత అంశాలకు 104 అనేది ఒన్‌స్టాప్ సొల్యూషన్ కావాలి. కలెక్టర్లు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. కేసులు తగ్గినప్పుడు కాస్త రిలాక్స్ మూడ్వస్తుంది. ఇలాంటి సమయంలో ఒకసారి మొత్తం సక్షించుకుని తిరిగి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 439 ఆస్పత్రులు ప్రస్తుతం ఆపరేట్ చేస్తున్నాం. ఈ ఆస్పత్రుల్లో సూపర్ విజన్, పర్యవేక్షణ అన్నది చాలా ముఖ్యమని గుర్తు చేశారు.
వారానికి ఒకసారి ఫీవర్‌క్లినిక్స్ కూడా కచ్చితంగా నిర్వహించాలి. థర్డ్‌వేవ్‌లో పిల్లలు ప్రభావితం అవుతారని చెప్తున్నారు. ఈ అంశాలను కలెక్టర్లు దృష్టిలో ఉంచుకోవాలి. చక్కటి కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. పిల్లలకు చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. జిల్లాస్థాయిలో వచ్చే 2 నెలలకు కార్యాచరణ సిద్ధంచేసి అమలు చేయాలి. పిల్లల వైద్యం కోసం మూడు అత్యాధునిక ఆస్పత్రులను తీసుకొస్తున్నాం. వైజాగ్‌లో ఒకటి, కృష్ణా,గుంటూరు ప్రాంతంలో ఒకటి తిరుపతిలో ఒకటి తీసుకు వస్తున్నాం. దీనికి సంబంధించి అవసరమైన భూములను కలెక్టర్లు గుర్తించాలన్నారు. వ్యాక్సినేషన్కెపాసిటీ దేశంలో పెరగాల్సిందే. ఆలోగా మనకు వచ్చే వ్యాక్సిన్లను ప్రజలకు సమర్థవంతంగా అందించాలన్నారు. నిర్దేశించుకున్న విధివిధానాల ప్రకారం వ్యాక్సినేషన్ ఇవ్వాలి. వ్యాక్సినేషన్ విషయంలో మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్నారు. ఇ- క్రాపింగ్ బుకింగ్అనేది చాలా ముఖ్యం. ఇ – క్రాపింగ్ చేయకపోతే… కలెక్టర్ విఫలయం అయ్యారని భావించవచ్చు. కనీసం 10శాతం ఇ క్రాపింగ్‌ను కలెక్టర్, జేసీలు పరిశీలించాలి. దిగువనున్న సిబ్బంది కూడా ఇ క్రాపింగ్‌ను పర్యవేక్షించాలన్నారు. డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్తోపాటు భౌతికంగా రశీదు కూడా ఇవ్వాలి. ఇ క్రాప్ వివరాలన్నీ కూడా ఇందులో ఉండాలి. ఈ వివరాలు ఆధరంగా నే ఇన్‌పుట్‌సబ్సిడీ వస్తుంది, బీమా వస్తుంది. మన అలసత్వం వల్ల రైతులకు నష్టం రాకూడదన్నారు. ఇ క్రాపింగ్ చేసేటప్పుడు ప్రతి ఎకరం, ప్రతి పంట… కూడా నమోదు చేయాలన్నారు. వివాదాస్పదమైన భూమి అయినా సరే పర్వాలేదు. కాని కచ్చితంగా ఇ క్రాపింగ్ నమెదు కావాలన్నారు.
నకిలీ విత్తనాలకు చెక్ పెట్టాలి
నకిలీలకు ఆస్కారం లేకుండా నాణ్యమైన విత్తనాలు అందించడంలో కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు ఆర్బీకేలద్వారా అందాలి. ప్రీమియం విత్తనాలు కూడా ఆర్బీకేలద్వారా రైతులకు అందించేలా చేయగలిగితే.. రైతులకు భరోసా ఉంటుంది. నకిలీలకు ఆస్కారం ఉండదు. బ్లాక్‌మార్కెటింగ్ కూడా ఉండదు. మిర్చి, పత్తి, తదితర పంటలకు సంబంధించి ప్రీమియం విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందించాలి. విత్తనాలు, ఎరువులు అమ్మే దుకాణాలపై క్రమం తప్పకుండా పరిశీనలు జరగాలి. డీలర్లు అమ్మే వాటిలో నాణ్యత ఉన్నాయా? లేదా? కచ్చితంగా పరిశీలించాలన్నారు. పోలీసుల సహకారంతో ఈరెయిడ్స్ జరగాలి. అప్పుడే బ్లాక్‌మార్కెటింగ్, కల్తీలకు మనం అడ్డుకట్ట వేయగలుగుతాం. కర్ఫ్యూ సమయంలో కూడా వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు అవకాశం ఉంటుందన్న విషయాన్ని మరిచిపోకూడదు. ఆమేరకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. స్టమ్ హైరింగ్ సెంటర్లు, హబ్స్ అనేవి వ్యవసాయరంగంలో పెనుమార్పులకు దారితీస్తాయి. స్థానిక రైతులకు అందుబాటు ధరల్లో యంత్రాల సేవలు అందిస్తాయి. జిల్లాస్థాయిలో కమిటీలను, రైతులే ఏర్పాటుచేసి వారి సహకారంతో రేట్లను నిర్ణయించాలి. ఏ యంత్రాన్ని ఎంత ధరకు అద్దెకు ఇవ్వొచ్చన్నదానిపై నిర్ణయించాలన్నారు. ప్రకటించిన ధరలకే ఈపరికరాలన్నీకూడా అందుబాటులో ఉండాలన్నారు. జులై 8న మొదట విడత 3వేల ఆర్బీకేల పరిధిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ప్రారంభిస్తున్నాం. అక్టోబరులో 2వ విడత, జనవరిలో మూడో విడత కస్టర్ హైరింగ్సెంటర్లు ప్రారంభిస్తున్నామని అన్నారు. బ్యాంకింగ్సేవలను ఆర్బీకేల స్థాయికి తీసుకు రావాలి. ఈమేరకు బ్యాంకులతో కలెక్టర్లు మాట్లాడాలన్నారు. వచ్చే స్పందన నాటికి అన్ని జిల్లాల్లో పూర్తికావా లన్నారు.
జగనన్న శాశ్వత భూహక్కు కార్యక్రమం కోవిడ్ కారణంగా ఆశించినంత వేగంగా కదల్లేదు. ఇది పూర్తయితే వివాదాలకు పూర్తిగా చెక్ పడుతుందన్నారు. పేదవాడికి ఇంటి పట్టాలు రాకూడదని టీడీపీ లాంటి ప్రతిపక్షాలు అన్యాయంగా కేసులువేసి అడ్డుకున్నాయి. ప్రతిరోజూ రివ్యూ చేసి చర్యలు తీసుకోండి. కలెక్టర్లు, జేసీలు ఈ కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు ఇవ్వడంపై దృష్టిపెట్టాలన్నారు. వీలైనంత త్వరగా భూసేకరణ చేసి పట్టాలు ఇవ్వాలన్నారు. జూన్ నెలాఖరు కల్లా తాగునీరు, కరెంటు సౌకర్యాలను ఏర్పాటు పూర్తికావాలి. సొంత స్థలాలు ఉన్నవారికి 3.84 ఇళ్లు ఇచ్చాం. వాటిని శరవేగంగా పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలి: ఇళ్లనిర్మాణం విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో క్రమం తప్పకుండా సక్షలు చేయాలన్నారు. జూన్ 20 తర్వాత కర్ఫ్యూలో కొన్ని సడలింపులు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ 22న చేయూత పథకాన్ని అమలు చేస్తున్నాం. దీనికి కలెక్టర్లు అంతా సిద్ధంకావాలి.జులైలో విద్యాదీవెన, కాపు నేస్తం పథకాలు అమలు చేస్తాం. దీనికి సంబంధించి కూడా కలెక్టర్లు సిద్ధంకావాలి. వైఎస్సార్ బీమా జులై 1న ప్రారంభం అవుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు.