Take a fresh look at your lifestyle.

నూతన చట్టం మారనున్న బల్దియా ముఖచిత్రం

జిహెచ్‌ఎం‌సి చట్టానికి సవరణ చేస్తూ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఆమోదం తెలిపింది. చట్టానికి ఐదు కీలకమైన సవరణలతో కూడిన బిల్లును శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రతిసారి రిజర్వేషన్లు మారుస్తూ ఉండటం వల్ల ఎన్నికైన కార్పొరేటర్ల లో జవాబుదారీతనం, శ్రద్ధ లోపిస్తుందని, డివిజన్ల రిజర్వేషన్లు రెండు పర్యాయాలు కొనసాగించాలని, మహిళలకు సగం సీట్లు కేటాయిస్తూ, అదేవిధంగా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధి లో మొక్కల నర్సరీ ల పెంపకంలో 85% మొక్కలు బతికేలా స్థానిక కార్పొరేటర్‌, అధికారుల బాధ్యత తీసుకోవాలని, 2.5 శాతం ఉన్న గ్రీన్‌ ‌బడ్జెట్‌ను పది శాతానికి పెంచుతూ చట్ట సవరణలు చేశారు. నాలుగు రకాల వార్డు కమిటీలు ఏర్పాటు మరో కీలక సవరణ. దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ ‌నగరంలో బల్దియా గా పిలువబడే స్థానిక ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ ఏర్పడింది. దినదినం విస్తరించడం, వార్డులు డివిజన్లు పెరగడం, కొత్త కొత్త కాలనీలు వెలువడం, శివారు ప్రాంతాలు మున్సిపాలిటీలో విలీనం అవుతు నగరం నలుమూలల విస్తరిస్తూ హైదరాబాద్‌ ‌నగరం మహానగరంగా, ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్నట్లుగా విశ్వనగరం గా రూపాంతరం చెందుతోంది.

ఈ చట్ట సవరణలు జిహెచ్‌ఎం‌సి పాలకమండలి పనితనాన్ని పటిష్టం చేస్తుందని చేస్తున్న ప్రభుత్వ వాదన సరి కాకపోవచ్చు. 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు కూడా ఉండాలని వార్డు కమిటీలలో కూడా మహిళలకు కూడా భాగస్వామ్యం ఉంటుందని నిర్ణయించడం మంచి. డివిజన్ల రిజర్వేషన్‌ ‌లు రెండు దఫాలుగా కొనసాగించాలన్న అంశం చాలా మంచిది. అవసరం కూడా. ఒక డివిజనుకు రెండు సార్లు ఒకే రిజర్వేషన్‌ ఉం‌టే ప్రజాప్రతినిధులకు బాధ్యత ఉంటుందన్న ప్రభుత్వం, మేయర్‌ ‌స్థానానికి ప్రత్యక్ష ఎన్నికలు జరిపితే బాగుంటుంది కదా. ఒక వార్డ్ ‌ద్వారా ఎన్నికైన ప్రతినిధి నగరం మొత్తానికి మేయర్‌ ‌గా ఉంటే నగరం కన్నా తన వార్డు ముఖ్యమని భావించే అవకాశం ఉంటుంది. అది నగర ప్రజలు మొత్తం ఒక ప్రతినిధిని ఎన్నుకుంటే అదే రిజర్వేషన్‌ ఇం‌కో అయిదు సంవత్సరాల దాకా ఉంటుంది కాబట్టి మేయర్గా నగరాభివృద్ధికి పని చేసే అవకాశం ఉంటుంది. చట్టసవరణ లో ఈ విషయాన్ని విస్మరించారు.

వార్డు కమిటీలతో వార్‌ ‌తప్పదా
అదేవిధంగా వార్డు వాలంటరీ ల కమిటీల ఎన్నిక.. ఈ విషయంలో మంచి చెడులకు ఆస్కారం ఉంది. ఎంత మంచి జరుగుతుందో అంత చెడు జరిగే అవకాశం కూడా ఉంది. చట్ట సవరణలో ప్రతిపాదించిన నాలుగు రకాల కమిటీలు యూత్‌ ‌కమిటీ లు, సీనియర్‌ ‌సిటిజన్స్ ‌కమిటీ, మహిళా కమిటీ, ఎమినెంట్‌ ‌పర్సన్స్ ‌కమిటీలు నియమించడానికి జిహెచ్‌ఎం‌సి, ప్రభుత్వానికి వీలు కల్పిస్తూ చట్ట సవరణ జరిగింది. దీనికి సంబంధించి విధివిధానాలు త్వరలో రూపొందిస్తామని ప్రభుత్వం తెలిపింది. వార్డులలో వివిధ కమిటీలు ఉండడం, వార్డు ప్రజలు, వివిధ వర్గాలు ఇందులో భాగస్వామ్యం కావడం సమస్యలపై వారి ఆలోచనలను కార్పొరేటర్‌ ‌కు తెలియజేయడం వార్డు సమస్యలలో వారు భాగస్వామ్యం కావడం వల్ల కొన్ని సమస్యలను సత్వరం పరిష్కరించవచ్చు.

నగరంలో వివిధ డివిజన్ల లో ఇతర ప్రముఖులు, వివిధ రంగాల్లో నిష్ణాతులు, అనుభవజ్ఞులు, నగర సమస్యలపై పరిష్కార మార్గాలపై అవగాహన ఉన్న వారు అనేకులు వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారు.డివిజన్లలోని వారు ఈ కమిటీలలో భాగస్వామ్యం కావడం, వారి ఆలోచనలను పంచుకోవటం మంచి పరిణామమే. ఎన్నికైన కార్పొరేటర్లకు వారు కూడా సలహాలుసూచనలు ఇచి అభివృద్దిలో బాగం పంచుకునే అవకాశం ఈ కమిటీల ద్వారా కలుగుతుంది. ఇదే సందర్భంలో మరొక ప్రమాదకరమైన పరిణామాలకు దారితీసే అవకాశాలు దీని ద్వారా ఉన్నాయి. ఒకవేళ కొన్ని డివిజన్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల నుండి కార్పొరేటర్లు ఎన్నికైతే ఆ ఎన్నికల్లో ఓడిపోయిన వారు కాని, ఆ ప్రతినిధి కి వ్యతిరేకంగా ఉన్న వారిని ఈ కమిటీలో నియమిస్తే అభివృద్ధి మాట దేవుడెరుగు వీరి మద్య పరోక్ష ప్రత్యక్ష యుద్ధాలే జరుగుతాయి. వార్డులో ప్రజల నుండి ఎన్నుకోబడిన ప్రజ ప్రతినిధికి పోటీగా వీరు వార్డు అభివృద్ధి విషయాలలో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం.

ఇప్పటికే జిహెచ్‌ఎం‌సి లో వార్డుకు పది మంది చొప్పున వార్డు మెంబర్లు గా కొందరు కొనసాగుతున్నారు. వారిలో కొందరు కార్పొరేటర్‌ ‌కు అనుచరులుగా పనిచేస్తూ వసూల్‌ ‌రాజాలు గా పేరు పొందారు. మరికొందరు స్థానిక జిహెచ్‌ఎం‌సి కార్యాలయాల్లో పైరవీ కారులుగా కూడా మారారు. ఇప్పుడు వార్డు కమిటీలలో కూడా ఇటువంటి వారికి చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉంటాయి. కొన్ని డివిజన్లలో పార్టీ టికెట్‌ ఆశించిన వారు, ఓడిపోయిన వారు కమిటీలలో స్థానం సంపాదిస్తే ప్రజల చేత ఎన్నికైన కార్పొరేటర్‌ ‌తో సఖ్యతగా ఉండే అవకాశం ఉండదు. పాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం వికేంద్రీకరణ లో భాగంగా నాలుగు రకాల కమిటీలు ఒక్కో కమిటీ లో 25 మంది చొప్పున ప్రతి డివిజన్లో వందమంది వీటిలో ఉంటారని మొత్తం 150 డివిజన్లలో 15వేల మందితో గ్రేటర్‌ ‌పౌర సైన్యం తయారవుతారని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ ఆశయం మంచిదే కానీ ఈ పదిహేను వేల సైన్యం 150 మంది కార్పొరేటర్ల తో యుద్ధం చేస్తే నగర పాలన కు అంత మంచిది కాదు.

ఈ చట్టం ద్వారా జిహెచ్‌ఎం‌సి స్టాండింగ్‌ ‌కమిటీ రద్దు అయినట్లే అని నిష్ణాతులు చెబుతున్నారు. ఇదే జరిగితే ఇక నుండి ఎన్నికైన కార్పొరేటర్ల కన్నా అధికార యంత్రాంగం ఆధిపత్యం సాగే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ ‌నగరం గుండెకాయ లాంటిది. ఇక్కడ పౌర పాలనకు ప్రజల నుండి ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులకు సరైన గౌరవం ఉండాలి. జిహెచ్‌ఎం‌సి స్థానిక ప్రభుత్వంలా ఉండాలి. కానీ ప్రభుత్వ అజమాయిషీలో ఉండే ఒక సంస్థ లాగా, సాధారణ కార్పొరేషన్‌ ‌లాగా, మామూలు మున్సిపల్‌ ‌విభాగంలా ఉండటం శ్రేయస్కరం కాదు.

Rupa Jyoti Freelance Journalist
రూపా జ్యోతి
ఫ్రీ లాన్స్ ‌జర్నలిస్ట్

Leave a Reply