Take a fresh look at your lifestyle.

ధైర్యమే కొరోనాకు మందు

  • త్వరలో అన్ని దవాఖానాలలో నాన్‌ ‌కోవిడ్‌ ‌చికిత్సలు
  • ప్లాస్మా దాతల వెబ్‌సైట్‌ ఆవిష్కరణలో మంత్రి ఈటల సమీక్ష
  • ప్లాస్మా దాతలు ప్రాణాలు కాపాడుతున్నారు: హోం మంత్రి అలీ

కొరోనా సోకిన వారికి ధైర్యమే మొదటి మందు అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కొరోనా బాధితులను వెలి వేయకుండా అక్కున చేర్చుకోవాలని పేర్కొన్నారు. గురువారం సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ప్లాస్మా డోనేషన్‌ ‌వెబ్‌సైట్‌ ‌ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ చైనాలో వైరస్‌ ‌వచ్చినప్పుడు అక్కడ ఏర్పాట్లు చూసి అంతా భయపడ్డారనీ, కానీ, వైరస్‌ను మనం సమర్థంగా ఎదుర్కొన్నామని చెప్పారు. గత 6 నెలలుగా దీనిని అతి సన్నిహితంగా పరిశీలిస్తున్నామనీ, మార్చి 2న మొదటి కేసు రాగానే సీఎం కేసీఆర్‌ 4‌న సమావేశం నిర్వహించి దీనికి మందు లేదు, ధైర్యమే మందు అని ముందుకు నడిపించారని చెప్పారు. ప్రాణం అన్నింటి కంటే విలువైనదనీ, ఆ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్యులు, నర్సులు, నాలుగో తరగతి ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. మందుల కంటే ప్లాస్మా థెరపీతో మంచి ఫలితాలు వస్తున్నాయని వైద్యులు,  చెబుతున్నారనీ, అలాగే, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి కూడా ప్లాస్మా ఇవ్వవచ్చని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు భయంతో ఇళ్లలో ఉండవద్దనీ, త్వరలో అన్ని ప్రభుత్వ దవాఖానాలలో నాన్‌ ‌కోవిడ్‌ ‌వైద్య చికిత్సలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

ప్లాస్మా దాతలు ప్రాణాలు కాపాడుతున్నారు. : హోం మంత్రి అలీ
రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ తనకు కోరోనా రాగానే చాలా భయపడ్డాననీ, కానీ చికిత్స తరువాత పోయిందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు వాడాలనీ, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్లాస్మా దాతలు ప్రాణాలు కాపాడుతున్నారనీ, వారిని అభినందించారు.

వైద్య, ఆరోగ్య శాఖపై మంత్రి ఈటల ఉన్నత స్థాయి సమీక్ష
రాష్ట్రంలో రానున్న రోజుల్లో  అంటు వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. . ఈమేరకు మంత్రి ఈటల గురువారం వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పీహెచ్‌సిల్లో సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలు అందుతున్నాయని చెప్పారు. ఈ సీజన్‌లో నీళ్ల ద్వారా కలరా, టైఫాయిడ్‌, ‌హెపటైటిస్‌, ‌సాధారణ ఫ్లూ జ్వరాలు వచ్చే అవకాశం ఉందనీ, వాటి నుంచి బయట పడేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సెప్టెంబర్‌లో స్నైన్‌ ‌ఫ్లూ వచ్చే అవకాశం ఉందనీ, అలాగే, డెంగీపై సైతం ప్రధానంగా దృష్టి సారించాలని ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఈటల ఆదేశించారు.

Leave a Reply