Take a fresh look at your lifestyle.

అం‌తుబట్టని ‘దుబ్బాక’ వోటరు నాడి

*అన్ని పార్టీల మీటింగులకూ భారీగా జనం
*స్వచ్ఛందంగా వస్తున్నారా… నేతలు తరలిస్తున్నారా?
*టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ‌బిజెపి  మధ్య ప్రధాన పోటీ
*యువత వోటుకు అన్ని పార్టీల వల
*టిఆర్‌ఎస్‌కు ప్రతిష్ట…కాంగ్రెస్‌, ‌బిజెపికి చావోరేవో..
*రసవత్తరంగా దుబ్బాక బై పోల్‌

 

సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసింది. బై పోల్‌కు తేదీ దగ్గరపడుతుండటంతో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. చైతన్యానికి, ఉద్యమాలకు పేరిన్నికగల దుబ్బాక నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రజల నాడి అంతుబట్టడం లేదు. అన్ని పార్టీలు నిర్వహించే మీటింగులకు ప్రజలు తండోపతండాలుగా హాజరవుతున్నారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి నిర్వహించే ఎన్నికల ప్రచార సభకు భారీ వానల్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు వొస్తున్నారు. అన్ని గ్రామాల్లోనూ టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి సుజాతకు, ఈమెకు మద్దతుగా ప్రచారాన్ని చేపడుతున్న మంత్రి హరీష్‌రావు సభలకు, సమావేశాలకు జనం, ముఖ్యంగా మహిళలు పెద్దయెత్తున వొస్తున్నారు.

అలాగే, కాంగ్రెస్‌ ‌పార్టీ చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు నామినేషన్‌ను పురస్కరించుకుని దుబ్బాకకు ఇసుకేస్తే రాలనంతగా జనం వొచ్చారు. టిఆర్‌ఎస్‌తో పాటు గ్రామాల్లో నిర్వహించే కాంగ్రెస్‌, ‌బిజెపి అభ్యర్థుల ప్రచారాల్లోనూ  జనం బాగానే కనిపిస్తున్నారు. అయితే, ఆయా పార్టీల అభ్యర్థుల,నేతల ప్రచారాలకు జనం స్వచ్ఛందంగా వొస్తున్నారా? లేదంటే ఆయా పార్టీల నేతలు, అభిమానులు తరలిస్తున్నారో తెలియదు. కానీ, మొత్తంగా అన్ని పార్టీల మీటింగ్‌ల్లోనూ జనం నిండుగానే కనిపిస్తున్నారు. అన్ని పార్టీల మీటింగ్‌ల్లోనూ జనం కనిపిస్తుండటంతో వోటరు ఏ పార్టీ అభ్యర్థికి వోటేస్తారన్నది  తెలియని అయోమయ, విచిత్ర పరిస్థితి నెలకొంది. అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీతో పాటు కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీల మీటింగ్‌ల్లోనూ జనం విపరీతంగా కనిపిస్తున్న తీరు ఆయా పార్టీల నేతలకు, అభ్యర్థులకు కూడా ఒకింత గుబులు పుట్టిస్తుందని సమాచారం. ఒక మాటలో చెప్పాలంటే.. సుదీర్ఘ అనుభవం ఉన్న నేతకే కాకుండా, విశ్లేషకులకు కూడా దుబ్బాక ప్రజల నాడి పట్టుకోవడం కష్టంగా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఇక్కడి నుంచి అధికార పార్టీ టిఆర్‌ఎస్‌తో పాటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, ‌భారతీయ జనతా పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు. ప్రధాన పోటీ మాత్రం అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత-రామలింగారెడ్డి, కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావు  మధ్యే నెలకొంది. తొలుత టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఎదురుడుందనీ అందరూ అనుకున్నప్పటికీ…నామినేషన్లతో కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీల  అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇస్తుండటంతో ప్రస్తుతం దుబ్బాకలో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ ‌పార్టీ  అభ్యర్థి ఎంపికలో కొంత గందరగోళం నెలకొనడంతో  టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకగా భావించారు. నామినేషన్‌ అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ఉత్కంఠను పెంచాయి. నోటిఫికేషన్‌ ‌వెలువడక ముందున్న పరిస్థితులు నేడు లేవు. ముగ్గురు అభ్యర్థులూ తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. త్రిముఖ పోటీ నెలకొనడంతో వోటరు నాడి అంతుచిక్కడం లేదు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజతా కావడంతో ఆమెకు సానుభూతి, అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కలిసి రానున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకో విషయమేమిటంటే టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి సుజాత తరపున టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ట్రబుల్‌ ‌షూటర్‌, ‌రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలకు చెందిన అసంతృప్త నాయకులను కారెక్కిస్తూ…హరీష్‌రావే అభ్యర్థి అన్నంతగా  ఊరూరా తిరుగుతున్నారు. సుజాత తరపున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అభివృద్ధి కేరాఫ్‌, ‌బై ఎలక్షన్ల స్పెషలిస్టుగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం, క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు, ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కేసీఆర్‌ ఇమేజ్‌ ‌తనకు  టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి సుజాతకు కలిసి వచ్చే అంశాలుగా చెప్పొచ్చు.  కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కూడా తన తండ్రి దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు, చనిపోయిన సానుభూతితో పాటు  కాంగ్రెస్‌ ‌రాష్ట్ర నేతలు బూత్‌స్థాయి నుంచి కష్టపడుతున్న పని తనకు కలిసి వచ్చి గెలుస్తానన్న ధీమాతో ఉన్నాడు.
ఇకపోతే బిజెపి నుంచి పోటీలో ఉన్న రఘునందన్‌రావు దుబ్బాక నుంచి రెండుపర్యాయాలు ఎమ్మెల్యేగా, మెదక్‌ ‌నుంచి ఒకసారి ఎంపిగా పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తనకు కలిసి వస్తాయన్న ధీమాతో ఉన్నట్లు సమాచారం. వరుసగా మూడు ఎన్నికల్లో ఓడినా ప్రజలతోనే ఉండడం, ముఖ్యంగా యువత బిజెపి పట్ల ఆకర్షితులుగా ఉండటం వల్ల ఈ ఉప ఎన్నికల్లో తాను గెలిచి తీరుతానన్న గట్టి విశ్వాసంతో రఘు ఉన్నట్లు తెలుస్తుంది. దుబ్బాక నియోజకవర్గం టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కి పుట్టినిలుగా పేరుంది. సిఎం కేసీఆర్‌ ‌బాల్య జీవితం(చదువు) అంత ఇక్కడే సాగింది. కేసీఆర్‌కు దుబ్బాకకు విడదీయరాని బంధం ఉంది. తను చదువుకున్న దుబ్బాక అభివృద్ధికి సిఎం కేసీఆర్‌ ‌ప్రత్యేకంగా 35కోట్ల రూపాయలను విడుదల చేశారు. కేసీఆర్‌తో దుబ్బాకకు ఉన్న బంధంతో టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఈ నియోజకవర్గంలో సంప్రదాయ వోటు పదిలంగా ఉంది. దీనికి తోడుగా మంత్రి హరీష్‌రావుకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిచయాలు, రాత్రింబవళ్లు ప్రచారం చేయడం,  సాగుకు కాలేశ్వరం ద్వారా గోదావరి జలాలు,  ఇంటింటికీ తాగునీటి సరఫరా వంటి అంశాలు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి సుజాతకు కలిసి వచ్చేవిగా కనబడుతున్నాయి. యువ వోటర్లు బిజెపి పట్ల ఆకర్షితులుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఈ వోటర్లపై టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రత్యేకంగా ఫోకస్‌ ‌పెట్టినట్టు సమాచారం. ఎవరికి వారుగా అభ్యర్థులు, నేతలు గెలిచేందుకు సర్వశక్తులు వొడ్డుతున్నారు. వోటర్లను తమ వైపు వచ్చేలా చేసేందుకు చేయని ప్రయత్నాలంటూ లేవు. వోటరు మాత్రం అన్ని పార్టీల అభ్యర్థులు, నేతలను సంతృప్తి పర్చేలా అన్ని పార్టీల మీటింగ్‌లకు హాజరవుతున్నారు. ఏ ఒక్కర్ని కూడా దుబ్బాక వోటరు నారాజ్‌ ‌చేయడం లేదు. అయితే, వారి మనసులో ఏముందో మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. తెలియడం లేదు. వోటరు నాడిని పట్టుకోవడమే  కష్టంగా మారింది. ఈ ఉప ఎన్నిక అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రతిష్టతో కూడుకున్నది కాగా, కాంగ్రెస్‌, ‌బిజెపి అభ్యర్థులకు మాత్రం చావో రేవో లాంటింది. దీంతోనే సర్వశక్తులొడ్డి పోరాడుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా పోలింగ్‌ ‌తేదీ సమీపిస్తుండటంతో దుబ్బాక నియోజకవర్గంలో ఆయా పార్టీల అభ్యర్థులు, నేతలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply