Take a fresh look at your lifestyle.

దగ్గు, గొంతునొప్పి, జ్వరం ఉంటే మందులు విక్రయించొద్దు

మెడికల్‌ ‌షాపులకు ప్రభుత్వం ఆదేశం
రాష్ట్రంలో కొరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ ‌నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటోంది. తమకు తెలియకుండానే కొరోనా వైరస్‌ ‌సోకిన రోగులు ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించకుండా సొంతంగా వైద్యం చేయించుకుంటున్నారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మెడికల్‌ ‌షాపులను ఫీవర్‌ ‌సర్వైలెన్స్‌లో భాగస్వామ్యం చేస్తూ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.. జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటివి కొరోనా వైరస్‌ ‌ప్రధాన లక్షణాలనే విషయం తెలిసిందే. మెడికల్‌ ‌షాపులకు ఇకపై డాక్టర్‌ ‌ప్రిస్క్రిప్షన్‌ ‌లేకుండా ఎవరైనా దగ్గు, జ్వరం, జలుబు కోసం మెడికల్‌ ‌షాపులకు వస్తే మందులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ విధమైన లక్షణాలో మెడికల్‌ ‌షాపులకు వచ్చే వారి వివరాలను సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని పేర్కొంది.

- Advertisement -

సాధారణ మందుల అమ్మకాలు, దగ్గు, టానిక్‌లపై సైతం నియంత్రణ విధించింది. రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌కట్టడికి ఇది ఎంతగానో దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దగ్గు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలతో మెడికల్‌ ‌షాపుల వద్దకు వచ్చిన వారి వివరాలు సేకరించి వారికి టెస్టులు నిర్వహించి క్వారంటైన్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జీహెచ్‌ఎం‌సితో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. కాగా, ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారు ప్రభుత్వం ఇచ్చే మందులను మాత్రమే వాడాలి. ప్రభుత్వం పేర్కొన్న లక్షణాలు ఉన్న ఏ వ్యక్తి అయినా ఇకపై వైద్యుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాలతో కలుగుతుంది.

Leave a Reply