Take a fresh look at your lifestyle.

లంచగొండితనం..దేశానికి పట్టిన విషకీటకం..!

“ఇం‌డియాలో లంచగొండితనం అత్యధికంగా 39 శాతం ఉందని తేల్చారు. దేశంలో లంచగొండితనం ఓ భయంకర అంటువ్యాధిలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పాకిందని తేల్చారు. సంక్లిష్ట ప్రభుత్వ పక్రియలు, ధన ఇంధనం కోసం నెమ్మదిగా కదిలే ఫైల్స్, అనవసర అధికారుల జోక్యం, అస్పష్ట నియమనిబంధనలు లాంటి అడ్డంకులను దాటడానికి లంచాలు ఇవ్వడమే ఏకైక మార్గమని ప్రజలు నమ్ముతున్నారని నివేదిక తెలిపింది. పోలీస్‌శాఖలో 42 శాతం, గుర్తింపు పత్రాల కోసం 41 శాతం, అత్యవసరాల కోసం 32 శాతం, ప్రజారోగ్యం కోసం 24 శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 22 శాతం మరియు కోర్టు పనుల్లో 32 శాతం లంచం ఇచ్చి పనులు చేయించుకున్నామని ప్రజలు అభిప్రాయం వెల్లడించారు.”

(ఆసియా దేశాల్లో అవినీతిపై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్‌ ‌తాజా నివేదిక వెల్లడి)
ఆసియా దేశాల్లోకెల్ల లంచగొండితనం ఇండియాలో అత్యధికంగా రాజ్యమేలుతుందని గ్లోబల్‌ ‌కరప్షన్‌ ‌బ్యూరో ఏసియా పేరుతో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్‌ ‌సంస్థ తాజా నివేదిక తెలియజేస్తున్నది. అధికారగణం వ్యక్తిగత పరిచయాలతో భారతదేశంలో 46 శాతం ప్రజలు లంచాల ఎరచూపి మాత్రమే ప్రభుత్వ కార్యాలయాల్లో తమ పనులను సకాలంలో పూర్తి చేయించుకోగలుగుతున్నారని సంస్థ విశ్లేషణలో బయట పడింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్‌ ‌సంస్థ జూన్‌ 17 ‌మరియు జూలై 17, 2020ల మధ్య నిర్వహించిన సర్వేలో సామాన్య ప్రజల అభిప్రాయాలు సేకరించారు. ఈ నివేదికలో పోలీస్‌, ‌కోర్టులు, ఆసుపత్రులు, విద్యాలయాలు, గుర్తింపు పత్రాలు అందించే రెవెన్యూ లాంటి కార్యాలయాలను సర్వేలో పొందుపరిచారు. ఇండియాలో లంచగొండితనం అత్యధికంగా 39 శాతం ఉందని తేల్చారు. దేశంలో లంచగొండితనం ఓ భయంకర అంటువ్యాధిలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పాకిందని తేల్చారు. సంక్లిష్ట ప్రభుత్వ పక్రియలు, ధనఇంధనం కోసం నెమ్మదిగా కదిలే ఫైల్స్, అనవసర అధికారుల జోక్యం, అస్పష్ట నియమనిబంధనలు లాంటి అడ్డంకులను దాటడానికి లంచాలు ఇవ్వడమే ఏకైక మార్గమని ప్రజలు నమ్ముతున్నారని నివేదిక తెలిపింది.

పోలీస్‌శాఖలో 42 శాతం, గుర్తింపు పత్రాల కోసం 41 శాతం, అత్యవసరాల కోసం 32 శాతం, ప్రజారోగ్యం కోసం 24 శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 22 శాతం మరియు కోర్టు పనుల్లో 32 శాతం లంచం ఇచ్చి పనులు చేయించుకున్నామని ప్రజలు అభిప్రాయం వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలలో పాలనను సరళీకరించడం, ప్రజాపక్షపాత నియమాలు, అవినీతి మరియు బంధుప్రీతిని కట్టడి చేయడం, వినియోగదారుల హితం కోరుతూ ఆన్‌లైన్‌ అత్యవసర సేవలు అందించడం లాంటి చర్యలు లంచగొండితనాన్ని తగ్గిస్తాయని సంస్థ బాధ్యులు సూచించారు. ఇండియాలో అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పితే కక్ష సాధింపుతో పనుల్లో జాప్యత జరుగుతుందని 63 శాతం ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇండియా, మలేసియా, థాయ్‌లాండ్‌, ‌శ్రీలంక మరియు ఇండోనేషియా దేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పనులు పూర్తి చేయటానికి డబ్బులతో పాటు లైంగిక అకృత్యాలకు లొంగుతున్నారని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సకాలంలో పూర్తి చేసుకోవడానికి లంచగొండితనాన్ని ఆశ్రయిస్తున్నారని 89 శాతం ప్రజల అభిప్రాయంగా తెలుస్తోంది. ఓట్ల కోసం నోటుతో 28 శాతం థాయ్‌లాండ్‌ ‌మరియు ఫిలిప్పీన్స్, 26 ‌శాతం ఇండోనేషియా, 18 శాతం ఇండియా ప్రజలు అవినీతికి పాల్పడ్డారని సర్వే బయట పెట్టింది. లైంగిక సంబంధాలతో 28 శాతం ఇండోనేషియా, 17 శాతం థాయ్‌లాండ్‌, 15 ‌శాతం శ్రీలంక మరియు 11 శాతం ఇండియాలో ప్రభుత్వ పనులు జరుగుతున్నాయని తెలుస్తున్నది. లంచగొండితనం నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని 63 శాతం మరియు అవినీతి నిరోధక శాఖ చక్కగా పనిచేస్తోందని 73 శాతం నమ్ముతున్నారు. ప్రభుత్వంపై నమ్మకం లేదని థాయ్‌లాండ్‌ (71 ‌శాతం), జపాన్‌ (56 ‌శాతం), మాల్దీవ్స్ (55 ‌శాతం) మరియు ఇండియా (51 శాతం) ప్రజలు అభిప్రాయ పడ్డారు.

సంస్థ సర్వే కోసం ఏసియాలోని 17 దేశాల్లో 20,000 మంది ప్రజల అభిప్రాయాలు తీసుకున్నామని వివరించింది. ఇండియాలో లంచగొండితనం ఓ పెద్ద సమస్య అని ప్రతి నలుగురిలో ముగ్గురు (75 శాతం) నమ్ముతున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు (22 శాతం) లంచం ఇచ్చి ప్రభుత్వ విద్యాలయాలు మరియు ఆరోగ్య సంబంధ పనులు చేయించుకుంటున్నారు. అవినీతిలో ఇండియా (39 శాతం) తరువాత 37 శాతంతో కాంబోడియా మరియు 30 శాతంతో ఇడొనేషియా ఉన్నాయి. అతి తక్కువ లంచగొండితనం ఉన్న దేశాల్లో 2 శాతంతో జపాన్‌, 10 ‌శాతంతో దక్షిణ కొరియా మరియు 12 శాతంతో నేపాల్‌ ఉన్నాయి. నేపాల్‌ (58 ‌శాతం) మరియు థాయ్‌లాండ్‌ (55 ‌శాతం) దేశాల్లో అవినీతి క్రమంగా పెరిగిందని ప్రజలు అభిప్రాయ పడ్డారు. చైనా (64 శాతం), ఫిలిప్పీన్స్ (64 ‌శాతం) మరియు కాంబోడియా (55 శాతం) దేశాల్లో లంచగొండితనం క్రమంగా తగ్గుతోందని ప్రజలు నమ్ముతున్నారని తేలింది. అవినీతి అధికారులను పట్టుకొని, దర్యాప్తు చేసి వెంటనే శిక్ష పడేలా కఠిన చర్యలు, నియమనిబంధనలు చేపడితే లంచగొండితనం తగ్గుతుందని సూచిస్తున్నారు. సంస్థ సర్వే ప్రకారం కరప్షన్‌ ‌పర్సెప్షన్‌ ఇం‌డెక్స్ ‌జాబితాలో 180 దేశాల్లో భారత్‌ 80‌వ స్థానంలో ఉన్నదని తేలింది. ఇండియాలో అవినీతి చెదలును అదుపు చేయడానికి ప్రతి ఒక్క బాధ్యతగల భారతీయుడు సహకరించాలని, అవినీతిపరులను సత్వరమే కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛంద సేవా కేంద్రాలుగా రూపాంతరం చెంది సామాన్యుల పక్షపాతిగా మారాలని ఆశిద్దాం. లంచగొండితనమనే భూతాన్ని పొలిమేరలు దాటేదాకా తరిమేద్దాం.

Dr. Burra Madhusudan Reddy Recipient of the National Best Faculty Award, Retired Principals, Government Degree PG, College Karimnagar
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్‌ – 99497 00037

Leave a Reply