Take a fresh look at your lifestyle.

కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం దృష్టి

  • మార్చి 21తో గడువు ముగిసిన మూడు కార్పొరేషన్లు
  • ఈనెల 15తో గడువు పూర్తి కానున్న సిద్దిపేట మున్సిపాలిటీ
  • జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ ‌కమిషనర్లతో ఎస్‌ఈసి పార్థసారధి వీడియో కాన్ఫరెన్స్

తెలంగాణలో కార్పొరేషన్‌లకు ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసి)  దృష్టి సారించింది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ముగిసిన వెంటనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేయాలని భావిస్తున్నది. రాష్ట్రంలోని గ్రేటర్‌ ‌వరంగల్‌, ‌ఖమ్మం మున్సిపల్‌ ‌కార్పొరేషన్ల పాలక మండలి గడువు మార్చి 21తో ముగిసింది. సిద్దిపేట మున్సిపాలిటీ పాలక మండలి గడువు ఈనెల 15తో పూర్తి కానుంది. వీటితో పాటు అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్‌, ‌కొత్తూరు మున్సిపాలిటీలకు సైతం ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసి భావిస్తోంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సి.పార్థసారధి బుధవారం సంబంధిత జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ ‌కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ ఇప్పటికే త్వరలో ఎన్నికలు జరుగనున్న మున్సిపల్‌ ‌కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించిన వోటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్‌ ‌కేంద్రాల గుర్తింపుకు నోటిఫికేషన్‌ ‌జారీ చేయడం జరిగిందనీ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతీ అంశంపై అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రత, బ్యాలెట్‌ ‌పేపర్‌ ‌ముద్రణ, తదితర అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులతో సంప్రదించి సిడిఎంఏ పర్యవేక్షిస్తారని చెప్పారు.

జనవరి 1 తేదీ వరకు అర్హత గల వోటర్ల జాబితాను భారత ఎన్నికల సంఘం ప్రచురించడం జరిగిందనీ, ఆ జాబితాను ఉపయోగించుకుని ఏప్రిల్‌ 5‌న ముసాయిదా వోటరు జాబితాను ప్రచురించడం జరిగిందనీ, దానిపై అభ్యంతరాలను పరిశీలించి ఏప్రిల్‌ 11‌న తుది జాబితా, 14న పోలింగ్‌ ‌స్టేషన్ల తుది జాబితాను ప్రచురించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణలో నిర్వహించేందుకు సంబంధిత పోలీస్‌ అధికారులతో చర్చించి తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, కోవిడ్‌ 19 ‌నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక సూచనలు జారీ చేయడం జరిగిందనీ, వీటిని తప్పనిసరిగా పాటించేలా సంబంధిత అన్ని శాఖలకు చెందిన అధికారులు చర్యలు తీసుకోవలని ఈ సందర్భంగా పార్థసారధి సూచించారు.

Leave a Reply