- ఆరోగ్య మంత్రి హరీష్ రావు అకస్మిక సందర్శన
- సర్కారు దవాఖానలో సౌలత్‌లు ఎట్లున్నయ్..
- కేసీఆర్ కిట్టు ఇచ్చారా… మొదటి గంటలో బిడ్డకు తల్లి పాలు ఇచ్చారా..
- రోగులకు మంత్రి ఆత్మీయ పలకరింపు…ఆత్మవిశ్వాసంపెంపు
గజ్వేల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌ని సోమవారం నాడు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా సందర్శించారు.. ఈ సందర్భంగా హాస్పిటల్‌లోని అన్ని విభాగాలు కలియ తిరుగుతూ పేషంట్స్‌తో ఆత్మీయంగా మాట్లాడుతూ, హాస్పిటల్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యుల పనితీరు, సమయపాలనపై అరా తీసారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేద ప్రజలకు ప్రభుత్వ దవాఖానా అంటే నమ్మకం పెంచేలా అన్ని సౌకర్యాలను కల్పించామని, ఆదిశగా వైద్యులు ప్రజలకు ఆరోగ్య సేవలను అందించాలని సూచించారు. మంత్రి హాస్పిటల్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు మొబైల్ ఎక్స్ రే ఎందుకు ఉపయోగంలోకి తేవడం లేదని ఆర్‌ఎంఓను అడిగి తెల్సుకున్నారు. వెంటనే ఉపయోగంలోకి తేవాలని ఆదేశించారు.
గర్భిణీలను హాస్పిటల్‌కి తీసుకొచ్చే ఆశ, ఏఎన్‌ఎంలకి ప్రత్యేక గది ఏర్పాటు చేయాలని సూపరెండెంట్‌ను ఆదేశించారు. హాస్పిటల్‌లో సౌలత్ ఎట్లున్నాయ్..బెడ్ షీట్స్ మారుస్తున్నారా…స్కానింగ్ చేస్తున్నారా..ఎక్కడి నుండి వొచ్చారమ్మ..దవాఖానాలో సౌలత్‌లు ఎలా ఉన్నాయ్.. కేసీఆర్ కిట్టు ఇచ్చారా..స్కానింగ్ తీశారా… మందులు బయట తెచ్చుకున్నారా ఇక్కడే ఇచ్చారా.. అంటు దావాఖానాలోని బాలింతలతో, పేషంట్స్‌తో ఆత్మీయంగా మాట్లాడారు. వారు నవ్వుతూ దవాఖాల సౌలత్‌లు మంచిగున్నాయ్ సార్..
కేసీఆర్ కిట్టు ఇచ్చారు..ఏఎన్‌ఎం దవాఖానాకు తీసుకొచ్చింది..దవాఖానాల అన్ని సేవలు బాగున్నాయి అంటూ సంతోష పడ్డారు. ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు అని మంత్రి నవ్వుతూ అడగగా..ఇంకెవరు సర్ కేసీఆర్..మిరే హరీష్ రావు సర్ కదా అంటూ సమాధానం ఇచ్చారు. మందులు బయట తెచ్చుకోవద్దని, స్కానింగ్ ఇక్కడే ఫ్రీగా చేస్తున్నమని చెప్పారు. ప్రభుత్వ దవాఖానా సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..
ఆరోగ్య మంత్రి ఆకస్మిక సందర్శన..ఆత్మీయ పలకరింపుతో డాక్టర్ల ఆశ్చర్యం
మంత్రి హరీష్ రావు అంటూ ఆనందంలో పేషంట్స్ .ఒకే సారి హాస్యిటల్‌లో సామాన్యుడిగా ఇమెర్జెన్సీ వార్డులోకి వొచ్చి డాక్టర్ ఎక్కడ అని అడిగే సరికి వైద్యుల్లో ఒక్కసారే ఆశ్చర్యాన్ని కలిగించింది. మరో వైపు మంత్రే స్వయంగా హాస్పిటల్‌లోని అన్ని విభాగాలు తిరుగుతూ అటు పేషంట్స్‌కు డాక్టర్‌లా…వైద్యులకు వైద్య శాఖ డైరెక్టర్‌గా సూచనలు ఇచ్చారు. ప్రతి పేషంట్‌ను ఆత్మీయంగా పలకరించారు. మంత్రి వొచ్చారు అంటూ వారు ఆనంద పడ్డారు.
కేసీఆర్ కిట్ ఇచ్చారా అంటూ.మందులు బయట తెచ్చారా…ఇక్కడే ఇచ్చారా అంటూ ప్రతి విషయం ఒక వైద్యునిల అరా తీయడం అందరిని ఆశ్చర్యం కలిగించింది. కాగా మంత్రి వెంట ఎమ్మెల్సీ యాదవ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.