Take a fresh look at your lifestyle.

‌ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా…

coronavirus,trending around,world,people worriedకరోనా వైరస్‌ అం‌టేనే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వణికిపోతున్నారు. ఎబోలా తర్వాత అత్యంత తీవ్రస్థాయిలో ఈ వైరస్‌ ‌ప్రభావం చూపుతుం డడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఇప్పటివరకు అంటార్కిటికా తప్ప ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు ఈ వైరస్‌ ‌వ్యాపించినట్లు సమాచారం. ప్రస్తుతానికైతే దాదాపు డెబ్బై దేశాల్లో ఈ వైరస్‌ ‌వ్యాధినపడినవారి సమాచారం వెలుగు చూస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించిన సమాచారం మేరకు కేవలం ఆరు దేశాల్లోనే దాదాపు లక్షమందికి ఈ వ్యాధి సోకినట్లు సమాచారం. వీరిలో దాదాపు మూడువేల మూడు వందల ఎనభై మంది ఇప్పటికే మరణించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ వైరస్‌ ‌పుట్టిన చైనాలో వేల సంఖ్యలోనే మరణాలు సంభవించినట్లు తెలుస్తున్నప్పటికీ వరల్డ్ ‌హెల్త్ ఆర్గనైజేషన్‌ ‌సమాచారం మేరకు ఇప్పటివరకు మూడువేల నలభైరెండు మంది మరిణించినట్లు రికార్డు అయింది. అలాగే దక్షిణ కోరియాలో నలభైమంది, ఇటలీలో నూటా నలభై ఎనిమిది మంది, ఇరాన్‌లో నూటా ఏడుమంది, క్రూయిజ్‌ ‌షిప్‌(‌డైమెండ్‌ ‌ప్రిన్సెస్‌)‌లో ఆరుగురు మరణించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. కాగా అల్జీరియాలో పదిహేడుగురు, స్వీడన్‌లో యాభైరెండు మంది ఈ వైరస్‌ ‌కారణంగా మృత్యువాత పడినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే మనదేశంలోకూడా ఈ వైరస్‌ ‌వణికిస్తూనేఉంది. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ ‌మీడియా, సోషల్‌ ‌మీడియాలో మొత్తం ఇవేవార్తలు వస్తుండడంతో జనం భయపడిపోతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రా ప్రజలు బయటికి పోవాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో పలు కేసులు నమోదు అయినప్పటికీ ఒకటి మాత్రమే నెగటివ్‌ అని తేలడంతో, రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది.

ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదని, ఒకవేళ వ్యాధి సోకినా చికిత్స చేసేందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్న విషయాన్ని పదేపదే ప్రభుత్వం గుర్తుచేస్తోంది. ఇందుకోసం ప్రధాన దవాఖానాల్లో ప్రత్యేక ఐసోలేషన్‌ ‌వార్డులను ఏర్పాటు చేసి ఉచిత వైద్యసేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పదివేల బెడ్స్ అం‌దుబాటులో ఉండేవిధంగా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ‌పేర్కొన్నారు. కార్పొరేట్‌ ‌దవాఖానాల్లోకూడా అలాంటి ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ ‌ప్రకారం దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా వైరస్‌ ‌సోకిన వారి సంఖ్య 31గా గుర్తించినట్లు తెలిపారు. రాష్ట్రాల వారీగా చూస్తే రాజస్తాన్‌లో ఈ వైరస్‌కు గురైన వారిసంఖ్య ఎక్కువగా ఉంది. రాజస్తాన్‌లో 16 మందికి నెగటివ్‌ అని తేలగా, ఢిల్లీలో ఇద్దరు, ఆగ్రాలో ఆరుగురు, తెలంగాణ, గర్‌‌గ్రావ్‌, ‌ఫజియాబాద్‌, ‌కేరళలలో ఒక్కొక్కరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు హర్షవర్ధన్‌ ‌చెబుతున్న మాట. అయితే అనుమానితుల సంఖ్యమాత్రం చాలానే ఉంది. ఇప్పటివరకు నమోదు అయినమేరకు ఇరవై ఎనిమిదివేల అయిదు వందల ఇరవై తొమ్మిదిమంది అనుమానితులను ఆసుపత్రుల్లోనే ఉంచి వారికి అన్నిరకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాణాంతకంగా భావిస్తున్న ఈ వ్యాధి భయంతో కొన్ని దేశాల్లోని వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులు కార్యాలయానికి రాకుండానే ఇంటివద్దనుండి పనులు చేయమని ఆదేశించాయి. ముఖ్యంగా దక్షిణ కోరియాలోని శ్యాంసంగ్‌ ‌స్మార్ట్ ‌ఫోన్‌ ‌ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేసి, అందులోని ఉద్యోగులను వర్క్ ‌ఫ్రం హోమ్‌ ‌చేయమన్నారు. ఢిల్లీలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జలుబు, ఆయాసం లాంటి సూచనలేమైనా ఉంటే టీచర్లుకూడా పాఠశాలకు రావద్దని ఆదేశించారు.

- Advertisement -

కర్ణాటక ప్రభుత్వం ఐటి ఉద్యోగులెవరికైనా ఈ వైరస్‌ ‌సోకినట్లైతే వారికి వేతనంతోకూడిన ఇరవై ఎనిమిది రోజుల సెలవుని వ్వాల్సిందిగా ప్రైవేటు ఐటి కంపెనీలను ఆదేశించింది. హైదరాబాద్‌ ‌లోని హైటెక్‌ ‌సిటీలోని రహేజా మైండ్‌ ‌స్పేస్‌లోని కంపెనీలో ఓ ఉద్యోగికి కోవిద్‌-19 ‌లక్షణాలు బయటపడ్డాయన్న అనుమానంతో ఆ కంపెనీ ఉద్యోగులందరినీ వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోం పద్దతిలో పనిచేయాలని పురమాయించింది. సికింద్రాబాద్‌ ‌కంటోన్మెంట్‌లో నివసించే ఐటి ఉద్యోగికి వ్యాధి లక్షణాలున్నాయన్న అనుమానంతో ఆ ప్రాంతంలోని పాఠశాలలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కరోనా ప్రభావం కేవలం ఆరోగ్యంమీదనే కాకుండా దేశాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నది. చైనాలాంటి దేశం ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటుంటే ఇతర దేశాలు కూడా అదే బాటలో ఉన్నాయి. మందులుకూడా అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. మందుల ఎగుమతిలో చైనాతోపాటు, భారతదేశం ప్రధాన భూమికను పోషిస్తు న్నాయి. అయితే భారత్‌ ‌మందుల తయారీలో ఉపయోగించే పదార్థాల్లో డెబ్బై శాతం చైనానుండే దిగుమతి చేసుకుంటుం డడంతో ఇప్పుడా పరిస్థితికి బ్రేక్‌ ‌పడింది. చైనాలోకూడా మందులను ఉత్పత్తి చేసే కంపెనీలు తాత్కాలికంగా మూతపడడంతో అంతర్జాతీయంగా మందుల కొరత ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయంటున్నారు. ఇప్పటికే మాస్క్‌ల్లాంటి చిన్న ఉత్పత్తులకే కరువు ఏర్పడింది. ఫలితంగా ప్రత్యామ్నాయ ఔషధాలు పుట్టుకొస్తున్నాయి. ముందు జాగ్రత్త కోసం ఇవి వాడండి, అవి వాడండి అంటూ రోజుకో ప్రకటన వస్తుండడంతో ప్రజలు ఆయోమయంలో పడిపోతున్నారు.

Tags: coronavirus,trending around,world,people worried

Leave a Reply