Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌లో కరోనా వైరస్‌.. ?

Like Hyderabad Corona virus Virus

‌హైదరాబాద్‌కు కరోనా వైరస్‌ ‌సోకినట్లుగా రెండుమూడు రోజులుగా సాషల్‌ ‌మీడియాలో వొస్తున్న వార్తలను రాష్ట్రప్రభుత్వం కొట్టిపారేస్తున్నప్పటికీ ఇక్కడ జరుగుతున్న హడావిడి చూస్తే ప్రభుత్వం ఈ విషయాన్ని గుప్తంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఈ ‌విషయంలో ప్రజలు భయపడాల్సి ందేమీలేదని, ఇంకా ఇక్కడ కరోనా వైరస్‌ ‌సోకినట్లు నిర్దారణ కాలేదని తాజాగ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే హుటాహుటిన ఢిల్లీనుంచి వైద్య నిపుణుల బృందం రావడం పలు అనుమానాలకు కారణంగా మారుతోంది. ఏకంగా ముప్పై అయిదు మందితో కూడిన వైద్య బృందం రావడం ప్రజలకు ఆందోళన కలిగిస్తున్న విషయం. అంతర్జాతీయ విమానాశ్రమమైన శంషాబాద్‌కు వివిధ దేశాలనుండి నిత్యం వేల సంఖ్యలో ప్రయాణీకులు వొస్తుంటారు. ఈ వ్యాధి విస్తృతంగా ప్రభలిన చైనా నుండి వచ్చే ప్రయాణీకులను శంషాబాద్‌ ఏయిర్‌పోర్టు సిబ్బంది నిశితంగా పరిశీలించి, ఏ కాస్తా అనుమానం ఉన్నా వైద్య పరీక్షలకు పంపిస్తోంది. తాజాగా చైనా, థాయిలాండ్‌ ‌నుంచి వచ్చిన కొందరిలో కరోనా వ్యాధి లక్ష్మణాలు కనిపిస్తున్నట్లు అనుమానించి, వారిని వైద్య పరీక్షలకు పంపించారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధానిలోని గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రిలో వీరికి పరీక్షలు జరుపుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చైనా నుంచి శంషాబాద్‌ ‌చేరుకున్న హైదరాబాద్‌కు చెందిన ఓవ్యక్తి ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించినట్లు తెలుస్తున్నది. అతని రక్తం నమూనాలను పుణే ల్యాబ్‌కు పంపించడమైంది. ఈ నేపథ్యంలోనే ఒకేసారి ముప్పై అయిదు మందితో కూడిన వైద్య నిపుణులు ఢిల్లీనుంచి సరాసరి హైదరాబాద్‌ ‌రావడంతో విదేశీ ప్రయాణీకుల ద్వారా హైదరాబాద్‌కు ఈ వ్యాధి చేరిందా అన్న అనుమానం కలుగుతున్నది.

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ వైరస్‌ ‌పుట్టినిల్లు చైనాకాగా, ఇప్పటికే చైనాలో నూటా ఇరవై మంది వరకు ఈ వ్యాధి కారణంగా మృత్యువాత పడినట్లు వార్తలొస్తున్నాయి. వారికి చికిత్స చేసే డ•క్టర్లుకూడా ఈ వ్యాధి భారిన పడుతున్నట్లు తెలుస్తున్నది. చైనాతోపాటుగా హాంకాంగ్‌, ‌మెక్సికో, థాయిలాండ్‌, ‌జపాన్‌, ‌దక్షిణ కోరియా, కెనాడా, శ్రీలంక, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, ‌జర్మనీ లాంటి పలు దేశాలకు ఈ వ్యాధి ప్రభలినట్లు చెబుతున్నా, మెల్లగా మనదేశానికికూడా పాకి ఉండవచ్చంటున్నారు. చైనా ప్రజలు ఇంచుమించు అన్ని దేశాల్లో ఉండడంతో వారి రాకపోకలద్వారా ఈ వైరస్‌ ‌ప్రపంచమంతా వ్యాప్తి జరిగే అవకాశాలను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ ‌హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. మనదేశంలోకూడా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో అప్రమత్తమైంది. ఇప్పటికే ఈ వ్యాధిసోకిన కొందరిని గుర్తించి, సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వొస్తున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా కేంద్ర వైద్య నిపుణులను అన్ని రాష్ట్రాల రాజధానులకు కేంద్రప్రభుత్వం పంపిస్తున్న క్రమంలో హైదరాబాద్‌కు ఈ బృందం వొచ్చిందని చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం భయానుమానాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే అనేక రకాల వైరస్‌లతో చాలామంది ప్రజలు చాలాకాలంగా ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే. సైన్‌ఫ్లూ, ఎబోలా వైరస్‌లు దాదాపుగా ప్రపంచాన్నే వణికించాయి. వాటితోపాటుగా నిఫా, జికా, సార్స్ ‌లాంటి వ్యాధులతో వేలాదిమంది ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కరోనా వైరస్‌కూడా అంతే తీవ్రమైనదిగా గుర్తించారు. దీన్ని ఎంత ప్రమాదకారిగా గుర్తించారంటే చైనాలో వందలాది రైళ్ళ రాకపోకలను కొద్దిరోజులపాటు నిలిపేశారంటేనే దాని తీవ్రతేమిటో అర్థమవుతున్నది. చైనా నుండి ఇతర దేశాలకు వెళ్ళేవారి ప్రయాణాలను వాయిదా వేసుకోమని ప్రభుత్వం హెచ్చరించింది.

వివిధ దేశాలనుండి వొచ్చి చైనాలో ఉద్యోగాలు చేసుకునేవారు, చదువుకునేవారిని ఆయా దేశాలకు వెనక్కుపంపే కార్యక్రమం చేపట్టింది. ఆవిధంగా మన దేశానికి చైనానుండి తిరిగి వొచ్చిన వారి సంఖ్య దాదాపు వెయ్యివరకు ఉండవచ్చన్నది ఓ అంచనా. ఇలా తిరిగి వచ్చేవారికోసం ప్రత్యేక విమానాలను కూడా మనదేశం సిద్దంచేస్తోంది. ఇక మనదేశంలోకూడా వివిధ దేశాలనుండి వొచ్చేవారిని ధర్మల్‌ ‌స్కానింగ్‌ ‌ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆవిధంగా ఇప్పటివరకు దాదాపుగా ముప్పైవేల మందికి వైద్యపరీక్షలు జరిపినట్లు తెలుస్తున్నది. హైదరాబాద్‌ ‌శంషాబాద్‌ ‌విమానాశ్రయంలో దిగిన వారిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే వైద్య పరీక్షలు, చికిత్సకోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటుచేస్తున్నారు. మొత్తంగా దీని ప్రభావం ఆర్థిక రంగంపై పడింది. స్టాక్‌ ‌మార్కెట్‌ ‌పడిపోయింది. చైనా మేడ్‌ ‌యాపిల్‌ ‌సెల్‌ఫోన్‌ ‌తయారి విక్రయాలపైనకూడా ప్రభావం పడింది. మనదేశంలో కొత్త సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ మంత్రం చదవండి కరోనా వైరస్‌ ‌మాయమవుతుందని ఒకరంటే సాక్షాత్తు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ‌కరోనాను పిశాచితో పోలుస్తూ ఈ వైరస్‌ ఎక్కడున్నా వదలమని ప్రకటించడం గమనార్హం. ఈ వైరస్‌ను అరికట్టేందుకు తారా మంత్రం పఠించాలని దలైలామా చైనాలోని తన శిష్య బృందానికి సలహా ఇవ్వడంతోపాటు, ఆ మంత్రాన్ని జపిస్తున్న వీడియో ను ఫేస్‌బుక్‌లో పెట్టిన విషయం విస్తృత ప్రచారంలో ఉంది. కాగా, ఈ వ్యాధిలక్షణాలను గుర్తించి సత్వరం చికిత్సచేయించుకోని పక్షంలో ప్రాణాలకే ప్రమాదమన్న విషయాన్ని ప్రజలు గుర్తించాల్సిఉంది.

Tags: Hyderabad Corona,virus Virus

Leave a Reply