Take a fresh look at your lifestyle.

కరోనా వైరస్‌ ‌చైనా స్వయంకృతం

Corona virus is china self mistake

యావత్‌ ‌ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న ‘కరోనా’ను శాస్త్రజ్ఞులు ముందే గుర్తించి ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ జిన్‌ ‌పింగ్‌ ‌నేతృత్వంలోని ప్రభుత్వం తమ దేశ ప్రతిష్ఠ కోసం, ఆర్థికాభివృద్ధికి గండి పడకుండా ఉండటం కోసం ఆ సమాచారాన్ని తొక్కి పట్టి ఉంచారన్న వార్తలు చైనా నాయకత్వం పట్ల ఏవగింపు కలిగిస్తున్నాయి. సాధారణ రోగాలు వ్యాపిస్తేనే ప్రభుత్వం ఆగమేఘాలపై చర్యలు తీసుకోవడం అత్యంత సహజం. ప్రాణాలను తోడేసే భయంకరమైన కరోనా వైరస్‌ ‌విషయంలో చైనా ప్రభుత్వం అనుసరించిన వైఖరి చెంగున నిప్పు కట్టుకున్న చందమే. ఏ దేశానికైనా ప్రతిష్ఠ అవసరమే కానీ, అంతకన్నా ప్రజల ప్రాణాలు ఎంతో ముఖ్యం. ఈ విషయంలో చైనా ప్రభుత్వం తీసుకున్న వైఖరి మానవాళికే మాయని మచ్చ. చైనాలో కరోనా వైరస్‌ ‌బారిన పడి ఇంతవరకూ దాదాపు 800 మంది మరణించారు. దాదాపు మూడు వేల మందికి ఈ వ్యాధి సోకింది. అంతేకాక, 28 ప్రపంచ దేశాలకు పాకింది. ఇంత దారుణానికి పూర్తి బాధ్యత జిన్‌ ‌పింగ్‌ ‌నేతృత్వంలోని ప్రభుత్వానిదే. చైనాలో ఇలాంటి ఉపద్రవాలు సంభవించడం ఇది మొదటి సారి కాదు. 2002, 2003లో సార్స్ అనే భయంకరమైన వ్యాధికి వేలాది మంది బలి అయ్యారు. చైనా అధ్యక్షుడు జిన్‌ ‌పింగ్‌ ‌కమ్యూనిస్టు నియంతగా పేరుమోసిన మావో జేడుంగ్‌ ‌కన్నా పచ్చినియంతగా వ్యవహరిస్తున్నారు. చైనాలో ప్రజల ఆహారపు అలవాట్ల వలన కూడా ఇలాంటి భయంకరమైన వ్యాధులు ప్రబలుతున్నాయి. చీమలు, పాములు, తేళ్ళు, గబ్బిలాలు, ఏది పడితే అది ఆహార వస్తువుగా ఉపయోగిస్తుండటం వల్లనే భయంకరమైన రోగాలు వ్యాపిస్తున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.

ప్రస్తుత కరోనా వైరస్‌ ‌ప్రబలడానికి గబ్బిలాలను తినడం వల్లేనని పరిశోదకులు గుర్తించారు. ఈ వైరస్‌ ‌గురించి బాహ్య ప్రపంచానికి తెలిస్తే ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతుందేమోనన్న భయసందేహాలతో ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం తొక్కి పట్టింది. రోగాన్ని రొష్టు చేసుకోమనీ, సంసారాన్ని గుట్టు చేసుకోమని తెలుగులో ఒక సామెత ఉంది. కానీ, చైనా ప్రభుత్వం ప్రతిష్ట కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టింది. చైనాలోని వూహన్‌ ‌రాష్ట్రంలో ఈ వ్యాధి మొదట బయటపడింది. ప్రపంచంలో వాణిజ్య నగరాల్లో ఇది ప్రసిద్ధి చెందిన నగరం, జనాభా కూడా ఎక్కువే. ప్రతిష్టాత్మకమైన మెడికల్‌ ‌కాలేజీలు ఉన్నాయి. మన దేశానికి చెందిన విద్యార్థులు వూహన్‌ ‌వైద్య కళాశాలల్లో చదువుతున్నారు. అక్కడ చిక్కుకుని పోయిన వారిని సురక్షితంగా రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంది. అమెరికా అయితే, వూహన్‌ ‌నుంచి అమెరికన్లను ఆగమేఘాలపై ఖాళీ చేయించింది. జిన్‌ ‌పింగ్‌ ఈ ‌వైరస్‌ ‌గురించి ఎంత తొక్కి పడదామనుకున్నా అగ్రరాజ్యాధినేత ట్రంప్‌కు ఈ విషయం తెలిసింది. ఆయన ఫోన్‌లో జిన్‌ ‌పింగ్‌ను సంప్రదించగా, ఈ వ్యాధి ప్రభావం తమ ఆర్థిక వ్యవస్థపై ఏమీ లేదని బుకాయించాడు.

దేశంలో వైద్యులకు స్వతంత్రత లేదు. వారు ఈ వ్యాధి గురించి బహిరంగంగా మాట్లాడకుండా ఆంక్షలు విధించాడు ప్రభుత్వం విడుదల చేసే బులిటన్లే ఆధారం. నిజానికి ఈ వైరస్‌ ‌గురించి వెలువడుతున్న వార్తల కన్నా అత్యంత దారుణమైన పరిస్థితులు చైనాలో నెలకొన్నాయి. పైకి బుకాయిస్తున్నా, ఈ వైరస్‌ ‌చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. జీడీపీలో ఒకటి లేదా రెండు శాతం తగ్గింది. అయతే, ఈ వ్యాధి సోకిన వారిని మామూలు ఆస్పత్రుల్లో కాకుండా ప్రత్యేక ఆస్పత్రుల్లో చికిత్స చేసేందుకు 9 రోజుల వ్యవధిలో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మింపజేయడం చైనా పట్టుదలకు నిదర్శనం. ఏమైనా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం మాత్రం క్షమార్హం కాదు. చైనాలో ఇప్పుడు ఆరోగ్యపరమైన ఆత్యయిక పరిస్థితి ఉంది. అన్ని దేశాలూ తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు ఏర్పాట్లు చేశాయి. చైనాలో ప్రస్తుత పరిస్థితి పూర్తిగా స్వయంకృతం. ఇందుకు జిన్‌ ‌పింగ్‌ ‌ప్రభుత్వానిదే బాధ్యత. ఆర్థిక రంగంలో అమెరికాను ఢీకొట్టాలన్న యావతో జిన్‌ ‌పింగ్‌ ‌చైనాలో పచ్చి నియంతృత్వ విధానాలను అనుసరిస్తున్నాడు. కరోనా వ్యాధి మన దేశంలో కేరళ విద్యార్థులకు సోకింది. ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. కరోనా వైరస్‌ని అదుపు చేసేందుకు ఇతర దేశాలన్నింటికన్నా మన దేశం ముందే మేల్కొన్నందుకు అభినందించాల్సిందే.

Leave a Reply