Take a fresh look at your lifestyle.

కొరోనా పరీక్షలు, చికిత్సలకు…ప్రైవేటు దవాఖానాలకు అనుమతిస్తే పేదలు ఇబ్బంది పడతారు

హైకోర్టు ఆదేశాలపై త్వరలోనే నిర్ణయం : మంత్రి ఈటల

కొరోనా వైరస్‌ ‌సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించడంతో పాటు చికిత్స అందించాల్సిన అవసరం ఉంటుందనీ, ఇలాంటి వ్యాధులకు చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతిస్తే పేదలు ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సాధారణ వ్యాధులతో పోలిస్తే కొరోనా భిన్నమైందనీ, అందుకే ఈ వైరస్‌కు పరీక్షలు, చికిత్సలకు ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. గురువారం కోఠిలోని డీఎంఈ కార్యాలయం ప్రాంగణంలో గ్రేస్‌ ‌ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్‌ ‌మొబైల్‌ ఐసీయూని మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులలో కోరానా పరీక్షలు,.చికిత్స నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సమీక్షించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రైవేటు రంగంలో ఇష్టారీతిన కొరోనా పరీక్షలు నిర్వహించిన పక్షంలో పేద ప్రజలపై ఆర్థికంగా అధిక భారం పడే అవకాశం ఉందనీ, ఇష్టారీతిన కొరోనా పరీక్షలు చేయడం సాధ్యం కాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం ప్రకారమే పనిచేస్తున్నదని వెల్లడించారు. కొరోనా అనుమానితులకు వ్యాధి నిర్ధారణ పరీక్షల విషయంలో ఐసీఎంఆర్‌ ‌నిబంధనల ప్రకారమే నడచుకుంటామని స్పష్టం చేశారు.

గాంధీ ఆసుపత్రిలో కొరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే ఖననం చేశారనే ఆరోపణలను మంత్రి ఈ సందర్భంగా ఖండించారు. అలాగే,రాష్ట్రంలో కోరోనా పరీక్షలను సరైన విధంగా చేయడం లేదన్న ఆరోపణలను సైతం ఆయన ఖండించారు. ఐసీఎంఆర్‌ ‌మార్గదర్శకాల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నామనీ, అలా నిర్వహించని పక్షంలో పరిస్థితి వేరుగా ఉండేదనీ, ప్రభుత్వం శాస్త్రీయ పద్దతిలో ముందుకు వెళుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉందని స్పష్టం చేశారు.

Leave a Reply