Take a fresh look at your lifestyle.

‘‘‌కొరోనా పట్ల అనుక్షణ అప్రమత్తం అవసరం’’

మానవాళి మనుగడకు సవాలు విసురుతూ, క్షణ క్షణ గ్రసనాసక్తయై విజృంభస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణ పట్ల సంపూర్ణ అవగాహన కలిగి, అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.మానవుని జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసిన ఒక విచిత్రమైన పరిస్థితిని మనం ప్రస్తుతం అనుభవిస్తున్నాం. గతంలో కనీ వినీ ఎరుగని కొత్త జీవన విధానాన్ని అనుసరిస్తున్నాం. ఒక సూక్ష్మాతి సూక్ష్మ మైన క్రిమి, ఇంకా చెప్పాలంటే క్రిమికూడా కాదు ఒక చిన్నRNA  మాలిక్యూల్‌’. ‌ప్రాణం లేని మాలిక్యూల్‌ ‌ప్రాణం ఉన్న కణంలోనికి వెళ్ళి దాని జీవనాన్ని సంతరించుకొని, కణాలను పెంచుకుంటూ, అగణిత సంఖ్యలో  వృద్ధి చెందుతూ,  మానవుని నాశనం చేయడ మేమిటి? అంత అణువంత పార్టికల్‌ ఒకరి నుండి  ఇంకొకరికి అంత వేగంగా వ్యాపించడ మేమిటి? మొత్తం ప్రపంచ మంతా భయాందోళనలకు గురి కావడం ఏమిటి? ఆర్థిక సామాజిక వ్యవస్థ తల్లడిల్లి పోవడమేమిటి? బహుశ ఏ సైంటిఫిక్‌ ‌ఫిక్షన్లోనూ కూడా చూడనటు వంటి విచిత్ర పరిస్థితిని  మనం ప్రపంచ వ్యాప్తంగా కళ్ళెదుట చూస్తున్నాం.

శాస్త్రీయంగా  కరోనా అనేది ఒక జెనిటిక్‌ ‌మెటీరియల్‌. RNA  మరియు  DNAలలో RNA  అనే ఆ వైరస్‌ ఏదైనా కణంలో ప్రవేశించిన తరువాత, ఆ కణంలో తనయొక్క RNA ప్రతిరూపాలను వేలు, లక్షలు తయారు చేసుకుని వదిలి వేస్తుంటే ఆ కణాలు బ్రద్దలయి కొత్త కణాలను పట్టు కుంటాయి. ఆ విధంగా ఆ వైరస్‌ ‌శరీరంలో చేరి రకరకాల వ్యవస్థలను అనగా కొన్ని ఊపిరితిత్తుల లోనికి, కొన్ని రక్తకణాల లోనికి ఇలా అన్నిటిలో ప్రవేశించి వాటిని పాడుచేస్తూం టాయి. పిన్న వయస్కులు,  పెద్ద వయసువాళ్ళు, షుగర్లాంటి రుగ్మతలున్నవారయితే ఈ దాడికి తట్టుకోలేక ప్రాణాలు విడవడం చూస్తున్నాం. వాస్తవానికి ఇది ఫ్లూ కి సంబంధించిన ఒక వైరస్‌. ‌ప్రతి ఏటా తొలకరి వానలు పడిన సమయంలో జలుబు, జ్వరాలు వస్తూంటాయి. అవి అన్నీ దాదాపు ఫ్లూ జ్వరాలే. అవి వస్తాయి – పోతాయి. మనలాంటి దేశాల్లోనయితే ఫ్లూ వస్తే ఒక వారం పడక వెయ్యడం మామూలే. దానికి వ్యాక్సిన్‌ ‌వాడడం అలవాటే. కరోనా లాంటి వైరస్‌ ‌చాలా కాలం నుండి ఉందని, ప్రాచీన గ్రంథాల లోనూ పేర్కొనడం జరిగిందని,  ఆధారాలతో సహా చెప్పడం జరుగుతున్నది. యోగ వాసిష్ఠంలో ‘ఉత్పత్తి ప్రకరణం’ అనే  అధ్యాయంలో  ‘కర్కటి’ అనే అంటువ్యాధి రాక్షసి ప్రస్తావన 68వ సర్గ నుంచి ఆరంభం అయిందని, ఆ కర్కటికే – విషూచిక, అన్యాయ బాధిక అనే మరో రెండు పేర్లున్నాయని పౌరాణికులు స్పష్టం చేస్తున్నారు. అయితే సాధారణ ఫ్లూ వైరస్‌ ‌లాగా పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఉండేది. ఈ వైరస్‌ ‌లు ఎప్పుడూ ఒకే ఆకారంలో ఉండవు. వాటికి మ్యుటేషన్స్ అని చెప్పి వాటి జనెటిక్‌ ‌మెటీరియల్‌ ‌మారిపోతూ ఉంటుంది. కొన్ని కొన్ని మ్యుటేషన్స్ ‌రావడంలో భాగంగా వచ్చిందే ఈ క్రొత్త కరోనా. కొంతమంది ‘మ్యుటేషన్స్ ‌వలన క్రొత్త మార్పు వచ్చిందంటే, ఇంకొందరు ‘శత్రు దేశాలమీద దాడికోసం అప్పటి వరకు వున్న కరోనా వైరస్‌ ‌కు సంబంధించిన స్వరూపాన్ని ప్రయోగాలు చేసి, భయంకరమైన వైరస్‌ ‌గా మార్చార’ని ఆరోపిస్తున్నారు.

‘‘corona’’ అను పదంలోని మొదటి రెండక్షరాలతో, ‘virus’’ అను పదంలోని మొదటి రెండక్షరాలు, అలాగే ‘‘disease’’ అను పదంలోని మొదటి అక్షరంతో కలిపి ‘‘covid’’ అను పదం సృష్టించారు. ఈ ‘‘virus’’  2019లో బయల్పడింది కనుక ‘19’ని చేర్చి ‘‘‘‘covid19’’అని నామకరణం గావించారు. ఈ కోవిడ్‌ -19 ‌వైరస్‌ అత్యంత శక్తి వంతమైనది. మొదటి రోజుల్లో ఈ వైరస్‌ ‌గురించి మన దేశంలో కొంత నిర్లిప్తత ప్రదర్శించిన మాట వాస్తవం. తరువాత మన దేశంలో కూడా విజృంభించిన కారణంగా లాక్‌ ‌డౌన్లతో చాలా జాగ్రత్తపడ్డాం. ఇది ఒకరి నుంచి మరొకరికి అంటుకునే వైరస్‌. ‌వైరస్‌ ‌ప్రవేశించిన తరువాత రెండు వారాలు ఎప్పుడైనా మరొకరికి అంటుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొంతమంది లక్షణాలు లేకుండానే వైరస్‌ ‌ను వెంటబెట్టుకు తిరుగుతూంటారు. వారు ఇతరులకు అంటిస్తూంటారు. అందుకని ప్రభావితులైన వారిని వెంటనే గుర్తించి నియంత్రణలో ఉంచాలి. నిజానికి వైరస్‌ ‌సహజంగానే అంతరించి పోవాలి. కాని పైవంటి వారి వల్లనో లేక విదేశాలనుండి వచ్చినవారి వల్లనో వైరస్‌ ‌వ్యాప్తి పొందుతున్నది.

Leave a Reply