Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో కొరోనా పరిస్థితి దారుణంగా మారుతోంది

  • 33 జిల్లాలకు వైరస్‌ ‌వ్యాప్తి చెందితే ఏం చేస్తున్నారు ?
  • రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
  • హెల్త్ ‌డైరెక్టర్‌, ‌గాంధీ సూపరింటెండెంట్‌ ‌విచారణకు హాజరు కావాలని ఆదేశం

రాష్ట్రంలో కొరోనా పరిస్థితి దారుణంగా మారుతోందని ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొరోనా నివారణపై ప్రభుత్వానికి ఆసక్తి, ఉత్సాహం పోయిందని వ్యాఖ్యానించింది. ప్రజలే ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలనే ధోరణి ప్రభుత్వంలో కనిపిస్తున్నదనీ, ఈ ధోరణి మంచిది కాదని అభిప్రాయపడింది. వైద్య సిబ్బందికి తగిన కోరోనా నివారణ కిట్లు ఇవ్వడం లేదని దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరపింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పీపీఈ కిట్లు, మాస్కులు కేంద్రం నుంచి ఎన్ని వచ్చాయి ? సిబ్బందికి ఎన్ని ఇచ్చారో నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. గురువారం లోగా వీటికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని గాంధీ, నిమ్స్, ‌ఫీవర్‌, ‌కింగ్‌కోఠి ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లను ఆదేశించింది. అలాగే, పబ్లిక్‌ ‌హెల్త్ ‌డైరెక్టర్‌, ‌గాంధీ సూపరింటెండెంట్‌లు స్వయంగా విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. గాంధీ ఆసుపత్రిలో జూడాలు సమ్మె చేయడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నదన్న హైకోర్టు రాష్ట్రంలోని 33 జిల్లాలకు కొరోనా విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు ఈ పరిస్థితులలో ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించింది.

రాష్ట్రంలో కొరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం వద్ద తగినంత సన్నద్ధత కనిపించడం లేదనీ, ప్రభుత్వ ఆసుపత్రులలో సదుపాయాలు పెంచాలని 3 వారాలుగా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నామనీ, అయినప్పటికీ ఏమాత్రం ఫలితం కనిపించడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొరోనా చికిత్సలను కేవలం గాంధీ ఆసుపత్రికే ఎందుకు పరిమితం చేశారనీ, నిమ్స్ ‌వంటి ఆసుపత్రులను ఎందుకు వినియోగించుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. కంటైన్మెంట్‌ ‌ప్రాంతాలలో ఇంటింటికీ పరీక్షలు ఎందుకు చేయడం లేదనీ, పరీక్షలు తక్కువ చేస్తే కొరోనా వ్యాప్తి తీవ్రత ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. కొరోనా కేసుల విషయంలో ప్రభుత్వం మీడియాకు విడుదల చేస్తున్న బులెటిన్లలో సైతం గణాంకాలు గజిబిజిగా ఉంటున్నాయనీ, ఇలా ఎందుకు జరుగుతున్నదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశించింది.

Leave a Reply