Take a fresh look at your lifestyle.

నెలరోజులుగా ప్రజలను బందీ చేసిన కొరోనా

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొరోనా వైరస్‌ ‌నుండి కాపాడుకునేందుకు ప్రజలు స్వీయ నియంత్రణకు కట్టుబడి ఇండ్లకే పరిమితమై నెలరోజులు గడిచింది. మనుష్యుల ప్రాణాలను కబళిస్తున్న ఈ వైరస్‌ ఎం‌తటి ప్రమాదకారన్న విషయాన్ని గ్రహించిన భారత ప్రభుత్వం మార్చ్ 22‌న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూను ప్రకటించింది. ప్రజలంతా ప్రధాని నరేంద్రమోదీ మాటకు కట్టుబడి ఇండ్లకే పరిమితమై జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు. అదే దూరదృష్టితో తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే లాక్‌డౌన్‌ ‌రెండోవిడుత కొనసాగుతోంది. ఈనెల 20వ తేదీన కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌లో కొంత సడలింపు ప్రకటించేనాటికి భారతదేశమంతా స్థంబించిపోయింది. వాయు, జల, రోడ్డు రవాణా మార్గాలన్ని మూతపడ్డాయి. పరిశ్రమలు, వ్యాపార వాణిజ్యసంస్థలన్నిటికి తాళాలు వేసేశారు. సభలు, సమావేశాలు చివరకు పెళ్ళిళ్ళు, దేవుడి కల్యాణాలపైన కూడా వైరస్‌ ‌ప్రభావం పడింది. అత్యవసర ప్రభుత్వ సిబ్బంది తప్ప మరే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయడం లేదు. ఐటి కంపెనీలన్ని తమ సిబ్బందిని ఇంటినుండే పనిచేయమని ఆదేశించాయి. దినసరి కూలీలు, వలస కార్మికులను ఆదుకునే ప్రయత్నాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నా వందశాతం ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. కడుపు చేతపట్టుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ఇతర రాష్ట్రాలవారు పనులు లేక, పస్తులుండలేక వందలాది కిలోమీటర్ల దూరం ఉన్న తమ రాష్ట్రాలకు కాలినడకన నేటికీ ప్రయాణిస్తూనే ఉన్నారు. పిల్లా పాపలతో, నెత్తిన బరువులు పెట్టుకుని కాలికి బుద్ధిచెబుతున్న వీరిలో ఎందరో అనారోగ్యానికి గురవుతున్నారు. ములుగు జిల్లా నుండి చత్తీస్‌ఘడ్‌కు కాలినడకన వెళ్ళేక్రమంలో తమ కన్నబిడ్డను పోగొట్టుకున్న కుటుంబం లాంటి విషాదగాథలెన్నో ఈ లాక్‌డౌన్‌ ‌సందర్భంగా గత నెలరోజులుగా మీడియాలో పుంకానుపుంకాలుగా వస్తూనే ఉన్నాయి. అయినా కొరోనా వెంటాడుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

- Advertisement -

ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అనూహ్యంగా ఎక్కువ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ ‌మే 3కు బదులుగా మరో నాలుగురోజులు ఎక్కువగానే అంటే మే 7వ తేదీవరకు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు కొనసాగుతున్న లాక్‌డౌన్‌కన్నా మరింత పటిష్టంగా ప్రజలను కట్టడిచేసేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. నిత్యావసర వస్తువులకోసం ఇప్పటివరకు ఉదయం సడలించిన సమయాలను ప్రజలు తేలిగ్గా తీసుకుని విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతుండడాన్ని మరింత కట్టడి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వముంది. ఈ వంకతో ప్రజలు ఉదయం నుండి సాయంత్రం వరకు తమకు ఇష్టమొచ్చిన చోటికి తిరుగుతూనే ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లాంటి నగరంలో ప్రధానంగా పాతబస్తీవాసులు ఈ లాక్‌డౌన్‌ను లెక్కచేయకపోవడం కూడా రాజధానిలో కేసుల సంఖ్య పెరగడానికి కారణంగా మారింది. దీన్ని మరింతకట్టడి చేస్తే తప్ప వైరస్‌ అదుపులో ఉండే అవకాశం లేదు. అందుకు ఉదయం 6గంటల నుండి సాయంత్రం 6గంటవరకు నిత్యావసర సరుకుల కొనుగోలుకోసం ఇచ్చిన సమయాన్ని తగ్గించే ఆలోచనలో ఉంది. ఈ సమయాన్ని ఉదయం ఏడు గంటలనుండి మధ్యాహ్నం 12 గంటలకే పరిమితం చేసి, మిగతా సమయమంతా కర్ఫ్యూ విధించడం ద్వారా కొరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చన్న ఆలోచనలో ప్రభుత్వముంది. దీనిపై క్యాబినెట్‌ ‌మంత్రులతో, ఉన్నతాధికారులతో ఇప్పటికే సమాలోచనలు జరుపుతోంది. కాగా రాష్ట్రంలో కోవిడ్‌ 19 ఉధృతంగా కొనాసగుతోందనడానికి మారుతున్న పాజిటివ్‌ ‌కేసుల సంఖ్యే ప్రత్యక్ష సాక్ష్యం. విమానాల రాకపోకలను నిలిపి విదేశాల నుండి ఎవరూ వైరస్‌ను మోసుకు రాకుండా కట్టడిచేశారు. అలాగే రాష్ట్ర సరిహద్దులు మూసి ఇతర రాష్ట్రాల నుండి వైరస్‌ ‌చొరబాటు కాకుండా చేశారు. రాష్ట్రంలో లాక్‌డైన్‌, ‌కర్ఫ్యూ ప్రభావంతో ఒకరి నుండి ఒకరికి సోకకుండా జాగ్రత్తపడ్డారు. అయినా ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ‌తరహాలో తాజాగా సూర్యాపేట రాష్ట్ర ఘటన ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. మంగళవారం ఒక్కరోజే ఇక్కడ 26 కేసులు నమోదుకాగా, జిహెచ్‌ఎం‌సిలో 19, నిజామాబద్‌లో 3, గద్వాల్‌, ఆదిలాబాద్‌లో రెండేసి, ఖమ్మం, మేడ్చల్‌, ‌వరంగల్‌ అర్బన్‌, ‌రంగారెడ్డి జిల్లాలో ఒక్కొక్కరి చొప్పున పాజిటివ్‌ ‌కేసులు రావడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. అంటే ఇంచుమించుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈవైరస్‌ ‌పొంచి ఉందన్న విషయాన్ని చెప్పకనే చెబుతోంది. తాజా పరిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో కొరోనా కేసుల సంఖ్య వెయ్యికి చేరుకోబోతున్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 23 మంది ఈ వ్యాధి •కారణంగా మృతిచెందారు. పక్క రాష్ట్రమైన ఎపిలో కూడా ఏడువందలకు పైగా కేసులు నమోదుకాగా 22 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా ఈ మరణాలసంఖ్య 603కు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షా 74వేల 839 మంది మృతిచెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు దీని నివారణకు కావాల్సిన వ్యాక్సిన్‌ ఏదీ బయటికి రాలేదు. కనుక స్వీయనియంత్రణే ప్రత్యమ్నాయం. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరికొంత కాలానికి లాక్‌డౌన్‌ ‌పొడిగిస్తూ,, కర్ఫ్యూ సమయాన్ని కూడా పొడిగించాలనుకుంటోంది. కర్ఫ్యూ సమయాన్ని ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం పోలీసు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే అనవసరంగా రోడ్లమీద తిరుగాడుతున్న సుమారు పదివేలపైగా వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకుని వేలాది మందిపై కేసులు నమోదు చేశారు. ఇకముందు వారిపై క్రిమినల్‌ ‌కేసులు కూడా పెడతామంటున్నారు. ఏదిఏమైనా నెలరోజులుగా ప్రజలకు తీరని కష్టాలను తెచ్చిపెడుతున్న కొరోన నుండి విముక్తికి వ్యాక్సిన్‌ ‌కోసం ఎదురుచూడడం తప్ప ఏమీచేయలేని పరిస్థితి ప్రజలది.

Leave a Reply