“కరోనా వైరస్‌తో యావత్ ప్రపంచం కలవర పడుతుంటే…కేరళ మాత్రం విజయ పతాకాన్ని ఎగరేస్తోంది. మిగిలిన వారికి మార్గదర్శిగా నిలుస్తోంది. తెలంగాణా నుంచి ఇప్పటికే ఒక బృందం ఆ రాష్ట్రానికి వెళ్లింది అధ్యయనం చేయటానికి. ప్రాణాంతక వైరస్ కరోనాపై కేరళ వైద్యులు విజయం సాధించటమే దీనికి కారణం. ఇప్పుడే కాదు గతంలో నిఫా వైరస్ వచ్చినప్పుడు కూడా కేరళ వైద్యపర పోరాటం ఒక స్ఫూర్తిదాయక కథనంగా నిలబడింది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో ముగ్గురు బారిన పడినా…పూర్తిగా కోలుకున్నారు.”

ఇప్పుడు ప్రపంచం అంతటా కరోనా వైరస్ కలకలమే వినిపిస్తోంది. నిన్నటి వరకు మనం కూడా అనుమానిత కేసులనే లెక్కేసుకున్నా…ఇప్పుడు ఇద్దరికి కరోనా పాజిటివ్ తేలటంతో హైదరాబాద్ నగరంలో ఆందోళన మరింత పెరిగింది. సికింద్రాబాద్‌లోని మహేంద్ర హిల్స్‌కు చెందిన ఒక వ్యక్తికి ఇప్పటికే పాజిటివ్‌గా తేలగా, ఇప్పుడు మైండ్‌స్పేస్‌లో బిల్డింగ్-20లోని డీఎస్ఎం కంపెనీ ఉద్యోగినికి కరోనా పాజిటివ్‌గా ప్రకటించారు. ఈ ఇద్దరూ కూడా విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన వాళ్లే. కాని వారికి అనుమానం వచ్చి స్రీనింగ్కు వెళ్లి చెక్ చేయించుకునే లోపు వారు తిరిగి ప్రాంతాలు, కలిసిన మనుషుల్లో ఎంత మందికి కరోనా సోకి ఉంటుందో అన్నది ఆందోళన కలిగించే అంశం. సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి 88 మందిని కలిసినట్లు తేల్చారు. వీళ్లల్లో కొంత మందికైనా పాజిటివ్ రిపోర్టస్ వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం. అటు మైండ్ స్పేస్‌లో ఉద్యోగిని ఎంత మందితో ఇంటరాక్ట్ అయ్యారు అనేది ఇంకా తేల్చాల్సి ఉంది. మైండ్ స్పేస్ బిల్డింగ్‌లో వేలాది మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. కరోనా అనుమానాలు తేలటంతో ఆ కంపెనీ హుటాహుటిన తమ ఇతర ఉద్యోగులు అందరిని ఇళ్ళకు పంపించింది. అటు గూగుల్, ట్విట్టర్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే సదుపాయాన్ని కల్పించాయి. వర్క్ ఫ్రం హోమ్ ఉండని ఉద్యోగస్థులు భయంతోనూ, ఆందోళనతోనూ జాగ్రత్తలు తీసుకుని ఉద్యోగాలకు వెళ్ళాల్సిందే. అటు విజయవాడలో కూడా కరోనా వైరస్ కలకలం మొదలయ్యింది. నగరానికి చెందిన ఒక వ్యక్తిలో కరోనా లక్షణాలు కనపడ్డాయి. ఆయన కూడా ఈ మధ్య విదేశీ ప్రయాణం చేశారు. అందుకే ఇప్పుడు అన్ని విమానాశ్రయాల్లో తనిఖీలు, ముందస్తు చర్యలను ప్రభుత్వం చేపట్టింది.
విదేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేస్తున్నాం అంటున్నారు కాని హైదరాబాద్‌లో తేలిన రెండు కేసుల్లోనూ వాళ్లు వచ్చిన వారం పది రోజుల తర్వాత కరోనా లక్షణాలతో హాస్పటల్‌కు వెళ్ళి పరీక్షలు చేయించుకున్న వారే. దేశంలో ఇప్పటి వరకు 30 మందికి కరోనా వైరస్ ఉన్నట్టు గుర్తించామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. దిల్లీలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబానికి కరోనా సోకినట్లు గుర్తించారు. కేరళలో 3, దిల్లీలో 1, తెలంగాణలో రెండు, 16 మంది ఇటాలియన్లతో పాటు కరోనా సోకింది ఇప్పటి వరకు కేంద్రం చెప్పిన గణాంకాల ప్రకారం. ఇక్కడ మరొక విచిత్ర పరిస్థితి కూడా నెలకొని ఉంది. మన దేశంలో ఉన్న విదేశీయులు వెనక్కి వెళ్లాలనుకుంటున్నా…ఆయాదేశాలు రానివ్వడం లేదట. అలాంటి వారిని ప్రత్యేక క్యాంపుల్లో ఉంచుతున్నామని కేంద్రమే తెలిపింది. ప్రపంచ దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. తాజా గణాంకాల ప్రకారం చైనాలో ఇప్పటి వరకు సుమారు మూడు వేల మంది ఈ వైరస్ మహమ్మారి వల్ల మృత్యువాత పడ్డారు. ఇంకా వేల సంఖ్యలో స్క్రీనింగ్‌లు అవుతున్నాయి. చైనా తర్వాత దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఇరాన్లో శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు అక్కడ దాదాపు 2300 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 23 మంది ఎంపీలు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. అంతే కాదు ఏకంగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు మసౌమె ఎబ్తేకర్ కూడా ఈ వ్యాధి సోకిందని మీడియా రిపోర్టస్ స్పష్టం చేస్తున్నాయి. కరోనా బాధితుల జాబితాలో ఆ దేశ ఉన్నతాధికారులు కూడా ఉన్నారనటం ఆశ్చర్యం కలిగించదు. ఇరాన్లో కరోనా వచ్చి 77మంది మృతి చెందగా మరో 2336 కేసులు నమోదయ్యాయి ఉన్నాయి. ఈ నాలుగు దేశాల్లోనే వైరస్ మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వర సుమారు లక్ష మంది వైరస్ అనుమానితులు ఉంటే మరణాలు మూడు వేలపై చిలుకు సంభవించాయి.
కరోనా-కేరళ విజయ గాథ
కరోనా వైరస్‌తో యావత్ ప్రపంచం కలవర పడుతుంటే…కేరళ మాత్రం విజయ పతాకాన్ని ఎగరేస్తోంది. మిగిలిన వారికి మార్గదర్శిగా నిలుస్తోంది. తెలంగాణా నుంచి ఇప్పటికే ఒక బృందం ఆ రాష్ట్రానికి వెళ్లింది అధ్యయనం చేయటానికి. ప్రాణాంతక వైరస్ కరోనాపై కేరళ వైద్యులు విజయం సాధించటమే దీనికి కారణం. ఇప్పుడే కాదు గతంలో నిఫా వైరస్ వచ్చినప్పుడు కూడా కేరళ వైద్యపర పోరాటం ఒక స్ఫూర్తిదాయక కథనంగా నిలబడింది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో ముగ్గురు బారిన పడినా…పూర్తిగా కోలుకున్నారు. చైనాలోని వుహాన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న ముగ్గురు విద్యార్ధినులకు కరోనా వైరస్ సోకింది. ఈ ముగ్గురూ చైనా నుంచి భారత్‌కు తిరిగి రాగానే ప్రత్యేక వార్డులకు తరలించి వైద్యం అందించారు. కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ స్వీయ పర్యవేక్షణలో వైద్యం జరిగింది. వారు కోలుకుని ఇళ్ళకు సురక్షితంగా చేరుకోవటం అభినందించాల్సిన అంశం. అక్కడ ప్రభుత్వం స్పందించిన తీరు, తీసుకున్న జాగ్రత్తలకు ఇదో ఉదాహరణగా నిలిచింది. ఆ రాష్ట్రం తీసుకున్న పటిష్టమైన ముందు జాగ్రత్త చర్యలను అందరం గమనించాల్సిన అవసరం ఉంది. దీనిలో వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించగలగటం మొదటి అడుగు. ఈ ప్రక్రియ ఎంత త్వరగా చేస్తే నష్ట నివారణ అంత ఎక్కువగా ఉంటుంది. అనుమానం ఉన్న ప్రతి పేషంట్‌ను గుర్తించి వారికి వెంటనే మెడికల్ టెస్టల్లు నిర్వహిస్తోంది కేరళ ప్రభుత్వం. అనుమానితులను గుర్తించటంలో నిర్లక్ష్యం, నిర్లిప్తత ఉంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అవుతుంది. కేరళ సగం విజయం ఇక్కడే సాధిస్తోంది. నిత్యం పరీక్షలు చేయించటం, గవర్నమెంట్ హాస్పటల్స్‌లో మాక్ డ్రిల్స్ వంటివి అక్కడ కామన్. ప్రతి మూడు ఊర్లకు రెండు ప్రధాన ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు అంటేనే వైద్యపరంగా ఎంత చిత్తశుద్దితో అక్కడి ప్రభుత్వం ఉందో మనం లెక్కేసుకోవచ్చు.
హాస్పటల్స్ పెట్టి చేతులు దులుపుకోలేదు. అనుభవం ఉన్నడాక్టర్స్ను అక్కడ అందుబాటులో ఉంచింది. అంతే కాదు వైద్యం ఖర్చు అతి సామాన్యుడికి కూడా అందేలా చేసింది. కేవలం ఐదు రూపాయలకే అక్కడ మంచి వైద్య సౌకర్యాలు లభిస్తాయి అంటే మనం నేర్చుకోవల్సింది ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
కేరళ తీసుకువచ్చిన మరో వినూత్న విధానం సెల్ఫ్ డిజైన్డ్ ప్రొటోకాల్. దీనిలో భాగంగా వైరస్ సోకిన వ్యక్తి కలిసిన వ్యక్తుల్లో కూడా వైరస్ సోకే అవకాశం ఉండటంతో అనుమానితులను గుర్తించి వెంటనే సమాచారం అందించేలా ప్రోత్సహిస్తుంది. ఈ ప్రాణాంతక వైరస్ నివారణ, నియంత్రణ మందులు లేకపోవడంతో వైరస్ సోకిన వ్యక్తులను సాధ్యమైనంత వరకు మరొకరితో కలవకుండా నిరోధించడమే కేరళ అనుసరిస్తున్న మరో ముఖ్య వ్యూహం. దీని వల్ల వైరస్ వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకోవటానికి ఆస్కారం ఏర్పడింది. ప్రభుత్వ బాధ్యత అక్కడితో ఆగిపోదు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించటం కోసం 18 మంది నిపుణుల సభ్యులతో ప్రత్యేకించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అక్కడ మెడికల్ సిబ్బంది ఏదో ఉద్యోగంలా కాకుండా సైనికుల్లా పని చేసేట్లు వ్యవస్థను ఏర్పాటు చేయగలిగింది. ఆరోగ్యశాఖ మంత్రి ప్రతి రోజు పరిస్థితి సమీక్షించటం కూడా దీనిలో భాగం. వైరస్ బాధితులను ఇళ్లల్లోనే 28 రోజుల వరకు నిర్బంధించేలా చర్యలు తీసుకున్నారు. వారికి అవసరమైన వైద్య సదుపాయాలు, నిత్యావసర వస్తువులు కూడా అందించారు.
భయాందోళనలు లేని అవగాహన ముఖ్యం
ఈ క్రమంలో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. బయటకు వెళితే ఏమవుతుందో, ఎటు నుంచి వైరస్ తమ మీదకు దాడి చేస్తుందో అన్న భయం ఎక్కువ అవుతోంది. దీనికి తోడు సోషల్ మీడియా పోస్టింగ్, మీడియాలో వచ్చే కథనాలు కూడా ఆందోళనలు మరింత పెంచుతున్నాయి. ఇప్పుడు నగరంలో మాస్క్‌ల తీవ్ర కొరత ఏర్పడుతోంది. మాస్క్‌ల రేట్లు కూడా అమాంతం మూడు, నాలుగింతలు పెరిగిపోయాయి. అదే సమయంలో ప్రజల్లో అవగాహన, చైతన్యం కూడా అవసరం. ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వం, మీడియా, సామాజిక వేత్తలు, వైద్యులపై ఉంది. ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం ఇది. ఏ మాత్రం ఏమర పాటుగా ఉన్నా వైరస్ మహమ్మారి మరింత దూకుడుగా ప్రబలే అవకాశం ఉంది.