Take a fresh look at your lifestyle.

కల్లోల పెడుతున్న కొరోనా

శాస్త్రవేత్తలువైద్య సిబ్బంది ముందుగానే హెచ్చరించినట్లు జనవరిలో కొరోనా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నది. మరో మూడు వారాల వరకు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వారు చెబుతున్నది కూడా అక్షరాల నిజమని రుజువుచేసేలా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి. మొదటి వేవ్‌ ‌తర్వాత ఈ థర్డ్ ‌వేవ్‌ ‌వైరస్‌ ఒక విధంగా రెచ్చిపోతున్నట్లుగానే ఉంది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం గడచిన ఇరవై నాలుగు గంటల్లోనే రెండు లక్షల ఎనబైమూడు వేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. కాని, అనధికారంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందంటున్నారు. ఇతర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో కూడా ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సోమ, మంగళవారాల మధ్య కాలంలో దాదాపు మూడువేల కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయినట్లు చెబుతున్నప్పటికీ వీటి సంఖ్య కూడా ఇంకా ఎక్కువే ఉంటుందన్నది వివిధ జిల్లాల నుండి వొస్తున్న వార్తల వల్ల అర్థమవుతున్నది. మొదటి, రెండు కొరోనా వేవ్‌లో బాధితులను కనీసం హాస్పిటళ్లలో చేరితే చికిత్స లభిస్తుందన్న భరోసా ఉండింది.

ఈ థర్డ్‌వేవ్‌లో హాస్పిటల్‌కి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఒక విధంగా రాష్ట్రంలో నమోదు అవుతున్న కొరోనా కేసుల్లో అత్యధిక శాతం రాష్ట్ర రాజధానికి సంబంధించినవే కావడం, ఇప్పుడు కొరోనాకు గురవుతున్న వారిలో ఎక్కువ శాతం హాస్పిటల్‌ ‌సిబ్బంది కావడం ఈ భయానికి కారణంగా మారుతున్నది. నగరంలోని ప్రధాన హాస్పిటళ్లయిన ఉస్మానియా, నిమ్స్, ఎ‌ర్రగడ్డ, నీలోఫర్‌ ‌హాస్పిటళ్లలోని డాక్టర్లు, వైద్య విద్యార్దులు, హౌజ్‌ ‌సర్జన్లు, నర్సింగ్‌ , ‌పారా మెడికల్‌ ‌సిబ్బంది వందల సంఖ్యలో వైరస్‌తో బాధపడుతుండడంతో చికిత్సకోసం హాస్పిటల్‌ ‌గడప తొక్కాలంటేనే వ్యాధిగ్రస్తులు భయపడి పోతున్నారు. గాంధీలో 40 మంది పిజి విద్యార్థులకు, మరో నలబై మంది హౌజ్‌ ‌సర్జన్లకు, 35 మంది వైద్య విద్యార్దులకు, ఆరుగురు అధ్యాపకులకు పాజిటివ్‌ ‌రావడం కలవరం రేపుతున్నది. ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్స్‌గా కొరోనా సోకినవారికి సేవలను అందించడంలో ఈ సిబ్బంది సెలవులను కూడా లెక్కచేయకుండా రోగులకు సేవ చేస్తూ వారే ఇప్పుడు కొరోనా బారిన పడ్డారు. అలాగే ఉస్మానియాలో అదనపు సూపరింటెండెంట్‌తో సహా 175 మంది వైద్య సిబ్బంది దీనిబారిన పడ్డారు. ఉస్మానియా డెంటల్‌ ‌హాస్పిటల్‌ ‌వైద్యులపైన కూడా వైరస్‌ ‌ప్రభావం పడింది. నిమ్స్‌లో 70 మంది వైద్యులకు, ఎర్రగడ్డలో 66 మంది సిబ్బందికి, నీలోఫర్‌లో 25 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్‌ ‌వొచ్చింది. వరంగల్‌ ఎం‌జిఎం హాస్పిటల్‌లో అసలు వైద్య సిబ్బందే తక్కువ. ఉన్నవారిని కూడా వైరస్‌ ‌వదిలిపెట్టలేదు.

ఈ హాస్పిటల్‌ ‌సూపరింటెండెంట్‌తో సహా పది మంది ప్రోఫెసర్లకు, నలుగురు ఎస్‌ఆర్‌లకు, 21 మంది పిజి విద్యార్థులకు, 23 మంది నర్సింగ్‌ ‌స్టాఫ్‌కు, 19 మంది మెడికల్‌, ‌మరో 15 మంది ఇతర సిబ్బంది దీని ప్రభావానికి గురైనారు. వరంగల్‌ ‌నిట్‌ ‌కళాశాలలో 16 మంది విద్యార్థులు కూడా ఈ వైరస్‌తో బాధపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలోని మంచిర్యాలలో ఒక్క రోజున్నే 450 కేసులు నమోదు అయ్యాయంటే రాష్ట్రంలో ఈ వైరస్‌ ఎలా విజృంభిస్తుందన్నది అర్థమవుతున్నది. ఇది ఒక మెడికల్‌ ‌డిపార్టుమెంటుతో ఆగటం లేదు. రాజకీయ నాయకులు పలువురు దీని బారిన పడుతున్నారు. వరంగల్‌లో ఒకేసారి మహబూబాబాద్‌ ఎంఎల్‌ఏ ‌శంకర్‌నాయక్‌, ‌భూపాలపల్లి ఎంఎల్‌ఏ ‌గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య వరంగల్‌ ‌జడ్‌పి చేర్‌పర్సన్‌ ‌గండ్ర జ్యోతి, అంతకు ముందే ఇదే జిల్లాకు చెందిన పంచాయితీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావులతో పాటు మరికొంతమంది వారి అనుచర వర్గానికి చుట్టకుంది. హైదరాబాద్‌లో అయితే రాష్ట్ర అడ్మినిష్ట్రేషన్‌ ‌లోని ప్రధాన వ్యక్తులందరూ ఒకరితర్వాత ఒకరిగా కొరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే.

సాక్షాత్తు సెక్రెటరేట్‌లో హెల్త్ ‌సెక్రెటరీ, ఎడ్యుకేషనల్‌ ‌సెక్రెటరీ, ఫైనాన్స్ ‌సెక్రెటరీ లాంటి ప్రధాన అధికారులంతా వైరస్‌ ‌బారిన పడ్డారు. అంతెందుకు కొరోనా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిత్యం టివిల్లో చెప్పే ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌జి. శ్రీనివాసరావుకే తప్పలేదు. పలువురు హెచ్‌ఓడిలు హోమ్‌ ‌క్వారెంటైన్‌లోకి వెళ్ళారు. జిఎడి ప్రిన్సిపల్‌ ‌సెక్రెటరీ వికాస్‌రాజ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోయారు. ఫ్రంట్‌ ‌వారియర్‌లో డాక్టర్స్ ‌తర్వాత అంత గొప్ప పాత్ర నిర్వహించిన పోలీసు సిబ్బందికి ఈ బాధ తప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యి మంది పోలీసు సిబ్బందికి పాజిటివ్‌ ‌వొచ్చినట్లు తెలుస్తున్నది. వీరిలో దాదాపు ఏడు వందల మంది హైదరాబాద్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలోని వారు కావటం విశేషం. అయితే వీరిలో కొందరికి స్వల్ప అస్వస్థత ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు కొన్ని పోలీస్‌ ‌స్టేషన్‌లకు కూడా ఇది పాకింది. దీంతో ఫిర్యాదు దారులను ఒక్కరిని మాత్రమే లోనికి అనుతివ్వాలని ఆయా పోలీసు స్టేషన్‌లు నిశ్చయించినట్లు తెలుస్తున్నది. దీన్నిబట్టి చూస్తే దాదాపు తెలంగాణలో ముప్పై నుండి నలబై శాతం మంది వైరస్‌కు గురవుతున్నట్లు అర్థమవుతున్నది. దీంతో ప్రభుత్వ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు, ఐటి సిబ్బందిలాగా తామకు కూడా వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ‌పని సౌకర్యాన్ని కల్పించాలని వారు కోరుతున్నారు. కాని పక్షలో లాంగ్‌ ‌లివ్‌ ‌పెట్టే ఆలోచనలో వారున్నట్లు తెలుస్తున్నది.

Leave a Reply