- నెలఖారుకు టీకా అత్యవసర వినియోగానికి అవకాశం
- ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వెల్లడి
భారతదేశంలో కొన్ని వ్యాక్సిన్లు చివరి దశ ట్రయల్స్‌లో ఉన్నాయని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. డిసెంబర్ చివరినాటికి లేదా వొచ్చే నెల ఆరంభంలో భారత నియంత్రణ అధికారుల నుంచి టీకా అత్యవసర వినియోగ అధికారాన్ని ఇవ్వగలమని తాను ఆశిస్తున్నానని చెప్పారు. అప్పుడు సాధారణ ప్రజలకు టీకాలు వేయడానికి ఉపయోగించబడుతుందని, టీకాలు సురక్షితంగా ఉన్నాయని, దానికి సంబంధించిన తగినంత డేటా అందుబాటులో ఉన్నదని, టీకాల భద్రత, సమర్థత విషయంలో ఏమాత్రం రాజీపడబోమని ఆయన చెప్పారు.
దేశంలో ఇప్పటివరకు 70-80 వేల వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చారని, వారిలో గణనీయమైన, తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు కనిపించలేదని తెలిపారు. స్వల్పకాలిక వ్యాక్సిన్ సురక్షితంగా ఉందని డేటా చూపిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో పరిశీలనలో ఉన్న వ్యాక్సిన్లలో ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్ ఉన్నాయి. వీటిని సీరం ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్నది. మన దేశంలో కోవిషీల్డ్ అని పిలిచే ఈ టీకా కారణంగా తనకు తీవ్రమైన నాడీ, మానసిక లక్షణాలను ఇచ్చిందని చెన్నైకి చెందిన ఒక ట్రయల్ పార్టిసిపెంట్ ఆరోపించారు. అయితే ఫార్మా కంపెనీ అటువంటి వాదనలన్నింటినీ ఖండించింది.