- ప్రధాని నాయకత్వంలో చురుగ్గా యత్నాలు
- రెండోరోజు ప్రజాశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో త్వరలో చిన్న పిల్లలకు కొరోనా టీకా అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే పరిశోధనలు కొలిక్కి వొచ్చాయని, టీకా ఉత్పత్తి కోసం వివిధ సంస్థలు క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేశాయని అన్నారు. జిల్లాలో రెండో రోజు కేంద్ర మంత్రి జన ఆశీర్వాద యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కొరోనాతో ప్రాణాలు కోల్పోయిన 100 మంది జర్నలిస్టులకి రూ.5లక్షల నగదును కేంద్రం అందించిందని తెలిపారు. కొరోనా బారిన పడి తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల విద్యాభ్యాసం భాద్యతను కేంద్రం తీసుకుంటుందన్నారు. కొరోనా వారియర్స్‌కు పాదాభివందనాలు అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇదిలావుంటే మరి కొన్నాళ్లు ముఖ్యమంత్రి పదవిలో కేసీఆర్ కొనసాగితే రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వస్తుందన్నారు.
సచివాలయానికి ఏ రోజూ రాని సీఎం రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో కేంద్రంపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఓ మంత్రి ట్విటర్లో తప్ప ఎక్కడా మాట్లాడరని కేటీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు కేసీఆర్ అనేక కుట్రలు పన్నుతున్నారని… పథకాలు పన్నుతున్నారని మండిపడ్డారు. అయితే ఈటలకు భాజపా కార్యకర్తల అండ ఉందన్నారు. తెరాస పాలనలో నిరుద్యోగులు అనేక బాధలు పడుతున్నారని, కేసీఆర్‌ను గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందాక తొలిసారి రాష్ట్రానికి వొచ్చిన కిషన్‌రెడ్డి కోదాడ, సూర్యాపేటల్లో గురువారం జరిగిన జన ఆశీర్వాద యాత్రలో పాల్గొంటున్నారు.