- ముందుగా 3 కోట్లమంది ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు..
- ప్రజలు పుకార్లను నమ్మొద్దు
- కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడి
డ్రైరన్ జరుగుతున్న హాస్పిటల్ సందర్శన
దేశవ్యాప్తంగా కొరోనా వైరస్ టీకాను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోడీ నిర్ణయించారని, అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నామని అన్నారు. టీకా డ్రై రన్ సందర్భంగా శనివారం ఆయన ఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ హాస్పిటల్‌ను సందర్శించారు. ఆ తర్వాత ఆయన డియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఒక్క ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఆయన ఢిల్లీలోని జీటీబీ దవాఖానలో డ్రైరన్ పక్రియను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. టీకా భద్రత, సామర్థ్యాన్ని నిర్దారించడం తమ ప్రాధాన్యత అని చెప్పారు. పోలియో టీకా సమయంలో వివిధ రకాల పుకార్లు వ్యాపించాయి. కానీ ప్రజలు టీకా తీసుకున్నారు. దీంతో భారత్ ఇప్పుడు పోలియో రహిత దేశంగా మారిందని చెప్పారు. ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన కోవీషీల్డ్ టీకాను అత్యవసరంగా వినియోగించేందుకు కేంద్ర నిపుణుల కమిటీ శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే డీజీసీఐ అనుమతి ఇంకా రావాల్సి ఉన్నది. పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ..కోవీషీల్డ్ టీకాను తయారు చేస్తున్నది. సబ్జక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) ఇచ్చిన నివేదికను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా పరిశీలించనున్నారు.
దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం డ్రై రన్ జరుగుతోందని, వదంతులను ఎవరూ నమ్మవద్దని ఈ సందర్భంగా కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కోరారు. ప్రజలకు భద్రతతోపాటు వ్యాక్సిన్ విజయవంతం కావడానికి ప్రాధాన్యమిస్తామన్నారు. వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుగుతున్న హాస్పిటల్ సందర్శన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జిటిబి దవాఖానాతో పాటు దరియాగంజ్ ప్రైమరీ హెల్త్ సెంటర్, వేంకటేశ్వర హాస్పిటల్లో కూడా డ్రై రన్ జరుగుతోంది. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన డ్రై రన్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించామని, ఆ సమాచారం ఆధారంగా నూతన మార్గదర్శకాలను రూపొందించామని హర్షవర్దన్ చెప్పారు. నూతన మార్గదర్శకాల ప్రకారమే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శనివారం డ్రై రన్ జరుగుతుందని తెలిపారు. డిసెంబరు 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో డ్రై రన్ జరిగింది. శనివారం దేశవ్యాప్తంగా డ్రైరన్ నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఇమ్యునేజేషన్ కార్యక్రమం భారత దేశంలో జరగబోతోంది. ఇందుకు అన్ని విధాలుగా సన్నాహాలు జరుగుతున్నాయన్నారు.
ముందుగా 3 కోట్లమంది ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు..
కొరోనా వైరస్‌ను అంతమొందించే టీకా త్వరలోనే దేశంలో అందుబాటులోకి రానున్న వేళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప్రాణాంతక వైరస్‌పై పోరులో ముందున్న మూడు కోట్ల మందికి తొలి విడతలో వ్యాక్సిన్ వేయనున్నట్టు తెలిపారు. వీరిలో కోటిమంది ఆరోగ్య కార్యకర్తలు, 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు ఉన్నారు. టీకా విషయంలో ప్రభుత్వ తొలి ప్రాధాన్యం వీరికేనని స్పష్టం చేశారు. ప్రాధాన్య క్రమంలో ఉన్న మిగతా 27 కోట్ల మంది వ్యాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలను ఖరారు చేస్తున్నట్టు చెప్పారు. పూణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ’కొవిషీల్డ్’ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వ నియమిత నిపుణుల కమిటీ.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ం ఇండియా (డీసీజీఐ)కి ప్రతిపాదించింది. నిపుణుల కమిటీ ప్రతిపాదనపై డీసీజీఐ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని హర్షవర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ భద్రతపై ఎటువంటి పుకార్లు ఉండకూడదని, ప్రతీది క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. పోలియో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లోనూ పుకార్లు షికారు చేశాయని, అయితే అది ఒకసారి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు దానిపై విశ్వాసం ఉంచారని తెలిపారు. దేశంలోని అన్ని రాష్టాల్రు డ్రై రన్ నిర్వహిస్తున్నాయని, దీనివల్ల ఏవైనా లోపాలు ఉంటే తెలుస్తాయని, వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో అవి జరగకుండా జాగ్రత్త పడవచ్చని అన్నారు. కాగా, ఈ వారంలో అసోం, ఆంధప్రదేశ్, పంజాబ్, గుజరాత్‌లలో రెండు రోజులపాటు డ్రైరన్ నిర్వహించారు.