Take a fresh look at your lifestyle.

తెలంగాణలో ఉచితంగా కొరోనా టీకా

  • 18 నుంచి 45 ఏళ్ల లోపు వారందరికీ
  • రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష

‌తెలంగాణలో అందరికీ ఉచితంగా కొరోనా టీకా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్న వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ‌చేయనున్నట్లు శనివారం ప్రకటించింది. ఈమేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు రోజుల్లో అందరికీ ఉచిత వ్యాక్సిన్‌ ‌పంపిణీపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమాన్ని సమర్థంగా, వేగంగా నిర్వహించేందుకు గాను జిల్లాల వారీగా ఇంచార్జీల నియామకంతో పాటు రాష్ట్రంలోని ప్రతీ జిల్లాకు ఒక్కో ఉన్నతాధికారిని ప్రత్యేకంగా నియమించనున్నారు. ఏపీలో 18 నుంచి 45 ఏళ్ల లోపు వారందరికీ ఉచితంగా కొరోనా వ్యాక్సిన్‌ ‌పంపిణీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇప్పటి వరకు 45 ఏళ్ల పైబడిన వారందరికీ ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఉచితంగా వ్యాక్సిన్‌ ‌పంపిణీ చేస్తున్నది.

ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు 30 లక్షల మందికి పైగా వ్యాక్సిన్‌ ‌వేయించుకున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాకు వ్యాక్సిన్‌ అం‌దనుంది. ఇదిలా ఉండగా, 18 నుంచి 45 ఏళ్ల వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ‌వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వంపై దాదాపు రూ. 2500 కోట్ల భారం పడనుంది.

Leave a Reply